WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రపంచ స్ట్రీమింగ్, ఫిల్మ్ ఎకానమీలో వృద్ధి చెందుతున్న భారత పాత్రను ఆవిష్కరిస్తున్న వేవ్స్

“ప్రపంచస్థాయి కంటెంట్ కోసం భారత్ లో మౌలిక వసతులు గల స్టూడియోలు, నిర్మాణ కేంద్రాలు, సాంకేతికత-ఆధారిత వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టాలి: శిబాసిష్ సర్కార్


సృజనాత్మక రిస్కులు తీసుకోవడం అవసరమే అయినా కంటెంట్ పోర్ట్‌ఫోలియో సమతుల్యంగా, నిర్మాణాత్మకంగా ఉండాలి: ఏక్తా కపూర్

 Posted On: 02 MAY 2025 5:29PM |   Location: PIB Hyderabad

"ప్రపంచ చలనచిత్ర, స్ట్రీమింగ్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి చెందుతున్న భారత్ పాత్ర" అనే అంశంపై ముంబయిలో ఈరోజు జరిగిన బ్రేక్ అవుట్ సమావేశంలో మీడియా-కంటెంట్ రంగాల భవిష్యత్తు రూపకర్తలైన పలువురు ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈరోస్ నౌ, మజాలో (ఎక్స్‌ఫినైట్ గ్లోబల్) సీఈఓ శ్రీ విక్రమ్ తన్నా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శ్రీ శిబాసిష్ సర్కార్, బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏక్తా ఆర్ కపూర్, గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ శ్రీమతి షాలిని గోవిల్ పాయ్ వీరిలో ఉన్నారు.

 

భారతదేశ సంస్కృతితో సుదీర్ఘ అనుబంధం గల కథలు చెప్పే సంప్రదాయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ శిబాసిష్ సర్కార్... ఒక శతాబ్దం క్రితం నుంచి నేటి డైనమిక్ స్ట్రీమింగ్ వేదికల వరకు భారతీయ సినిమా పరిణామ క్రమాన్ని వివరించారు. స్ట్రీమింగ్ కారణంగా భారతీయ కథలు ప్రపంచ ప్రేక్షకులకు చేరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రపంచ స్థాయి కంటెంట్ రూపొందించడం కోసం, మంచి మౌలిక సదుపాయాలు గల స్టూడియోలు, నిర్మాణ కేంద్రాలు, సాంకేతికత ఆధారిత వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. సంస్థాగత మూలధన మద్దతు కోసం కేంద్రీకృత, దేశవ్యాప్త విధానాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ప్రపంచస్థాయి విజయంలో కీలకమైన అంశం ఆకర్షణీయంగా కథను చెప్పడమేనని శ్రీమతి ఏక్తా ఆర్ కపూర్ స్పష్టం చేశారు. ఒక కథ ఎంత ఔచిత్యంగా, భావోద్వేగాలను పలికించేదిగా ఉంటే, అది అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బాధ, అభిరుచి, ఆశ వంటి భావోద్వేగాలు సార్వత్రికమైనవని తెలిపారు. సృజనాత్మక రిస్కులు తీసుకోవడం అవసరమే అయినప్పటికీ, కంటెంట్ పోర్ట్‌ఫోలియోలు సమతుల్యంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించారు. పెట్టుబడులను రిస్క్ నుంచి దూరంగా ఉంచాలని, అలాగే పోటీ అధికంగా ఉన్న రంగంలో దీర్ఘకాలిక మనుగడను కొనసాగించాలని ఆమె పేర్కొన్నారు.

 

శ్రీమతి షాలిని గోవిల్ పాయ్ మాట్లాడుతూ... ప్రపంచీకరణ నేడు కంటెంట్‌ విషయంలో అత్యంత పెను మార్పులకు లోనవుతోందని పేర్కొన్నారు. పంపిణీలోని అవరోధాలను సాంకేతికత ఛేదించిందనీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా కథల స్థాయిని నిర్ణయించడాన్ని ఇది సులభతరం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు, మరింత సమర్థవంతమైన, డేటా-ఆధారితమైన కంటెంట్ క్రియేషన్‌ను కృత్రిమ మేధ (ఏఐ) పునర్నిర్మిస్తోందన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన కథలను అందించడం కోసం సంప్రదాయిక పద్ధతులను మించి ఏఐ, సాంకేతికతలను ఉపయోగించుకోవడంలో ముందుండాలని ఆమె భారత సృజనకారులను కోరారు. కంటెంట్ ఆవిష్కరణ కీలకంగా మారుతోందని, తదుపరి విజయం స్మార్ట్ నావిగేషన్, ఆవిష్కరణ సామర్థ్యంతో పాటు, సాంకేతికత ఆధారంగా కథలు చెప్పడంపైనే ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

భారత డిజిటల్-ఫస్ట్ ప్రేక్షకుల ప్రవర్తనకు తగినట్లు కథ చెప్పే విధానాల్లో మార్పులు అవసరమన్న శ్రీ విక్రమ్ తన్నా, ఎక్కువ సమయం శ్రద్ధ వహించలేని పరిస్థితులు, పెరిగిన మొబైల్ వినియోగం నేపథ్యంలో, వాయిస్-ఆధారితమైన, అభిప్రాయ-ఆధారిత, మరింత లీనమయ్యేలా ఉండే కంటెంట్‌ను రూపొందించాలని సూచించారు. సాంకేతికతను పునర్నిర్వచించడం, అనుభవ-ఆధారితమైన కథలు చెప్పే విధానాలను రూపొందించడం, నమ్మకమైన అభిమానులను ఆకర్షించే ఐపీలను నిర్మించడం వంటి మూడు చోదకశక్తులు విజయంలో కీలకమైనవిగా ఆయన పేర్కొన్నారు. సృజనకారులు, వేదికలను మలుపుతిప్పే గొప్ప అవకాశంగా జనరేటివ్ ఏఐని అభివర్ణించిన ఆయన... లీనమయ్యేలా, డబ్బులు సంపాదించేలా, వ్యక్తిగతీకరించేలా కథలు చెప్పడం కోసం కొత్త మార్గాలను సూచించారు.

 

ప్రపంచ కంటెంట్ శక్తి కేంద్రంగా అవతరించాలనే దార్శనికత కోసం భారత్ ప్రస్తుతం తగిన స్థితిలో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ముగించారు. మౌలిక సదుపాయాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ధైర్యంగా ఉపయోగించడం అలాగే ప్రామాణిక విధానంలో కథలు చెప్పడం పట్ల నిబద్ధతతో, ప్రపంచ మీడియా ఆవిష్కరణల తదుపరి దశకు భారత్ నాయకత్వం వహించగలదని సమావేశం అభిప్రాయపడింది.

 

****


Release ID: (Release ID: 2126428)   |   Visitor Counter: 7