WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

మీడియా, వినోద రంగంలో ప్రవేశ అవకాశాలపై వేవ్స్-2025లో చర్చ: సమ్మిళిత ఆవిష్కరణ, విధానపరమైన సంస్కరణకు నిపుణుల పిలుపు

ప్రవేశ యోగ్యతకు అనుమతిని నిర్బంధం చేయకూడదు: సృజనాత్మక, నైతిక, వ్యూహాత్మక ఆవశ్యకతగా దానిని చూడాలి

భారత్ కేవలం ఎదగడం మాత్రమే కాదు.. అనేక మార్గాల్లో సమ్మిళిత విధానాలపై చర్చల్లో ముందుంటోంది: బ్రిజ్ కొఠారి

ప్రవేశ అవకాశాలను కల్పించడంలో వ్యవస్థాగతమైన మార్పు దిశగా మేం పునాదులు వేస్తున్నాం: గూగుల్ యాక్సెసిబిలిటీ, డిజబిలిటీ ఇంక్లూజన్ హెడ్ క్రిస్టోఫర్ పాట్నో

 Posted On: 02 MAY 2025 5:20PM |   Location: PIB Hyderabad

వేవ్స్ ప్రధాన వేదికగా ‘మీడియా, వినోద రంగంలో ప్రవేశయోగ్యతకు (యాక్సెసిబిలిటీ) ప్రమాణాలు’ అనే అంశంపై ఈరోజు ఆలోచనాత్మకంగా నిపుణుల బృంద చర్చను నిర్వహించారు. విద్యా, సాంకేతిక, విధానపరమైన, న్యాయ, పాత్రికేయ రంగాలకు చెందిన ప్రముఖులను ఒక్క చోటకు తెచ్చిన ఈ సదస్సు – కంటెంట్ సృజన, డిస్ట్రిబ్యూషన్‌లో పరిణామాలతోపాటు భారత డిజిటల్ పరివర్తన ప్రస్థానంలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకతపైనా చర్చించింది.

 

సదస్సులో ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ బ్రిజ్ కొఠారి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రవేశ సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో భారత్ ముందుందని ఆయన వ్యాఖ్యానించారు. “భారత్ కేవలం ఎదగడం మాత్రమే కాదు.. సమ్మిళిత విధానంపై చర్చలో మనం ముందుంటున్నాం’’ అని ఆయన అన్నారు. మెట్లు, వివిధ ఏర్పాట్లు, ప్రవేశ సౌలభ్యాలు దృష్టి లేదా వినికిడి లోపాలున్న వారికి పరిష్కారాలు మాత్రమే కాదని, 140 కోట్లకు పైగా పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించిన నమూనా అని ఆయన అన్నారు.

 

గూగుల్ ఈఎంఈఏ యాక్సెసిబిలిటీ, డిజబిలిటీ హెడ్ క్రిస్టోఫర్ పాట్నో తన ప్రసంగంలో కొన్ని అంతర్జాతీయ అంశాలను ప్రస్తావిచారు. అమెరికా వంటి కొన్ని దేశాల్లో బలమైన చట్టాలున్నప్పటీకీ, వాటి అమలులో లోపాలున్నాయన్నారు. ఐరోపా యాక్సెసిబిలిటీ చట్టం ఆశాజనకంగా ఉందని, దశాబ్ద కాలంలో మార్పు వస్తుందని ఆయన అన్నారు. “అందరికీ ప్రవేశ సౌలభ్యాన్ని కల్పించడంలో వ్యవస్థాగత మార్పు దిశగా మేం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం” అని చెప్పారు.

 

మీడియాలో యాక్సెసిబిలిటీకి సంబంధించి సృజనాత్మక కోణాన్ని కింటెల్ సీఈవో ఆశయ్ వినయ్ సహస్రబుద్ధే ప్రముఖంగా పేర్కొన్నారు. “సృజనకారుడు తనదైన దృష్టితో, ముఖ్యంగా సినిమాల్లో కంటెంటును రూపొందిస్తాడు. కంటెంటును నిజంగా అందుబాటులోకి తేవాలంటే, ఆ సృజనాత్మక దృక్పథాన్ని కాపాడుకోవాలి - సాధారణీకరించిన, ఆటోమేటెడ్ విధానాలతో దాన్ని నీరుగార్చకూడదు” అని ఆయన వివరించారు. దర్శకుడి దృష్టిని దివ్యాంగులు సహా ప్రేక్షకులందరికీ అర్థవంతంగా అందించడంపై దృష్టి సారించాలన్నారు.

అందరికీ వార్తలను అందుబాటులోకి తెచ్చేలా చేపట్టే చర్యలను సాంకేతికత, ఏఐ వేగవంతం చేస్తున్న తీరును జర్నలిస్టు ప్రీతి సాలియన్ వివరించారు. “సంకేత భాషా అవతార్‌ వ్యాఖ్యాతలతో ఒక ఏఐ ఆధారిత చానల్ ను మేం ప్రారంభించాం. ఆడియో వివరణలో పురోగతి ద్వారా.. గతంలో వారం రోజులు పట్టేది ఇప్పుడు 30 గంటల్లోనే పూర్తవుతుంది’’ అని ఆమె అన్నారు. అయితే సాంకేతికత ఒక్కటే సరిపోదని.. దేశంలో వినోదాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వ చేయూత, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యాలు, అధికారిక యంత్రాంగాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

 

థియేటర్, ఓటీటీ, టెలివిజన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో సమ్మిళితమైన కంటెంటు కోసం కృషిచేస్తున్న న్యాయవాది రాహుల్ బజాజ్ మాట్లాడుతూ దృఢమైన చట్టబద్ధమైన వ్యవస్థలు, సంస్థల మధ్య సహకారం అవసరమన్నారు. 

 

రేడియో ఉడాన్ వ్యవస్థాపకుడు డానిష్ మహాజన్ మాట్లాడుతూ... ప్రస్తుత విధానాలను కచ్చితంగా అమలు చేయాలని, విధాన రూపకల్పన, నియంత్రణ సంస్థలలో దివ్యాంగుల ప్రాతినిధ్యం పెంచాలని కోరారు. “ప్రవేశ సదుపాయం చివరి ప్రాధాన్యం కాదని, దానిని వ్యవస్థలో పొందుపరచాలన్న భావన వారి ప్రాతినిధ్యం వల్ల బలంగా వ్యక్తమవుతుంది’’ అని ఆయన అన్నారు.

 

సమష్టి కార్యాచరణకు నిపుణులు పిలుపునిచ్చారు: ప్రవేశ యోగ్యతకు నిబంధనలపట్ల అంగీకారాన్ని నిర్బంధం చేయకూడదు. సృజనాత్మక, నైతిక, వ్యూహాత్మక ఆవశ్యకతగా దానిని చూడాలి. కంటెంట్ విప్లవం కూడలిలో భారత్ నిలిచి ఉన్న తరుణంలో.. అది ప్రతి పౌరుడినీ చేరాలంటే ప్రవేశ సౌలభ్యం కీలకమైనది.  

 

***

 


Release ID: (Release ID: 2126367)   |   Visitor Counter: 12