రక్షణ మంత్రిత్వ శాఖ
భారత రక్షణ మంత్రికి అమెరికా రక్షణ కార్యదర్శి ఫోన్:
పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల మృతిపట్ల సంతాపం
పాకిస్తాన్ హింసను ప్రోత్సహించే దేశమని రుజువైంది... అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎగదోస్తూ
ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోంది.. ఈ హేయమైన చర్యలను అంతర్జాతీయ సమాజం నిర్ద్వంద్వంగా, నిస్సంకోచంగా ఖండించాలి, నిరసించాలి: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
భారత్‌కు అమెరికా సంఘీభావంగా నిలుస్తుంది... స్వీయ రక్షణపై భారత్ హక్కులకు అండగా ఉంటుంది: శ్రీ పీట్ హెగ్సేత్
Posted On:
01 MAY 2025 6:06PM by PIB Hyderabad
అమెరికా రక్షణ కార్యదర్శి శ్రీ పీట్ హెగ్సేత్ మే 1న భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల ఉగ్రవాదుల దాడిలో అమాయక పౌరుల మరణంపట్ల సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, శిక్షణ ఇవ్వడంతోపాటు నిధులు సమకూర్చే చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని భారత రక్షణ మంత్రి అమెరికా రక్షణ కార్యదర్శికి ఈ సందర్భంగా చెప్పారు.
“పాకిస్తాన్ హింసను ప్రేరేపించే దేశంగా రుజువైంది. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోంది. ప్రపంచం ఇకపై ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదు” అని రక్షణ మంత్రి అన్నారు. ఈ హేయమైన ఉగ్రవాద చర్యలను అంతర్జాతీయ సమాజం నిర్ద్వంద్వంగా, నిస్సంకోచంగా ఖండించాల్సిన, నిరసించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా ప్రభుత్వ పూర్తి మద్దతు భారత్‌కు ఉంటుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి పునరుద్ఘాటించారు. భారత్‌కు అమెరికా సంఘీభావంగా నిలుస్తుందని, స్వీయ రక్షణపై భారత్ హక్కులకు అండగా ఉంటుందని తెలిపారు.
***
(Release ID: 2126000)
Visitor Counter : 19