WAVES BANNER 2025
ప్రధాన మంత్రి కార్యాలయం

ముంబయి ‘వేవ్స్‌ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి ప్రసంగం

 Posted On: 01 MAY 2025 3:16PM |   Location: PIB Hyderabad

ఈ రోజు మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ లేదా ఈ గడ్డపై జన్మించిన సోదరీసోదరులందరికీ నా శుభాకాంక్షలు!

అంతేకాదు... ఇవాళ గుజరాత్‌ రాష్ట్రావతరణ దినోత్సవం కూడా... ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త  గుజరాతీ సోదరీసోదరులందరికీ అనేకానేక అభినందనలు.

వేవ్స్‌ సమ్మిట్‌ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్‌, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!

మిత్రులారా!

నేడు ఈ ముంబయి నగరంలో 100కుపైగా దేశాల నుంచి హాజరైన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి చేరుకున్నారు. మరోమాటలో- అంతర్జాతీయ ప్రతిభా, సృజనాత్మకత సహిత ప్రపంచావరణ వ్యవస్థ ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టుకుంటోంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్- అంటే.. ‘వేవ్స్’ అన్నది ఓ సంక్షిప్త పదరూపం కాదు. ఇది సంస్కృతి, సృజనాత్మకత, సార్వత్రిక అనుసంధాన సమ్మేళన కెరటం. ఈ తరంగంలో సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథ చెప్పడం, సృజనాత్మకత సంబంధిత విస్తృత ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ‘వేవ్స్‌’ ప్రతి కళాకారుడికి, మీలాంటి ప్రతి సృష్టికర్తకూ సంబంధించిన ప్రపంచ వేదిక. ఇక్కడ ప్రతి కళాకారుడు, యువతరంలోని ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచన ద్వారా సృజనాత్మక ప్రపంచంతో సంధానితులవుతారు. ఈ చారిత్రక, అద్భుత సమారంభానికి దేశవిదేశాల నుంచి తరలివచ్చిన ప్రముఖులందరికీ నా అభినందనలు.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా!

ఈ రోజు మే 1వ తేదీ... భారత్‌లో 112 ఏళ్లకిందట... అంటే- 1913 మే 3వ తేదీన  తొలి  చలనచిత్రం “రాజా హరిశ్చంద్ర” విడుదలైంది. దీని నిర్మాత శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే... ఇక నిన్న ఆయన జన్మదినం కావడం ఒక విశేషం. గడచిన శతాబ్దంలో మన దేశాన్ని ప్రపంచం నలుమూలలకూ చేర్చడంలో భారతీయ సినిమా అద్వితీయ విజయం సాధించింది. రష్యాలో రాజ్ కపూర్ గారికిగల ప్రేక్షకాదరణ, ‘కేన్స్’లో సత్యజిత్ రే గారికి లభించిన విశేషాదరణ, ‘ఆస్కార్’లో “ఆర్‌ఆర్‌ఆర్‌”కు దక్కిన అనూహ్య ప్రాచుర్యం తదితరాల్లో ఈ విజయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది గురుదత్ సినిమా కవిత్వం కావచ్చు లేదా రిత్విక్ ఘటక్ ప్రతిఫలింపజేసిన సామాజిక ప్రతిబింబం కావచ్చు... ఎ.ఆర్‌.రెహమాన్ బాణీ లేదా రాజమౌళి ఐతిహాసిక సృజన కావచ్చు... ప్రతి కథ భారతీయ సంస్కృతిని గళమెత్తి వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో నేడిక్కడ వేవ్స్ వేదికపై మనం తపాలా బిళ్లల ద్వారా భారతీయ సినిమా రంగంలోని అనేక మంది దిగ్గజాలను స్మరించుకుంటున్నాం.

మిత్రులారా!

నేను కొన్నేళ్లుగా గేమింగ్, సంగీత ప్రపంచ ప్రముఖులను, చిత్రనిర్మాతలను, తెరపై మెరిసే నటీనటులను ఎందరినో కలిశాను. ఈ సందర్భంగా వారితో సాగిన చర్చలలో భారతీయ సృజనాత్మకత, సృజనాత్మక సామర్థ్యం, ఆయా రంగాల్లో ప్రపంచంతో భాగస్వామ్యం వంటి వివిధ అంశాలు తరచూ ప్రస్తావనకు వస్తూండేవి. సృజనాత్మక లోక ప్రసిద్ధులైన మీ అందరినీ కలిసిన ప్రతిసారి, మీ ఆలోచనలను స్వీకరించిన ప్రతి సందర్భంలోనూ ఈ అంశపై లోతుగా ఆలోచించే అవకాశం నాకూ లభించింది. తదనుగుణంగా నేను కూడా ఓ ప్రయోగం చేశాను. ఆ మేరకు 6-7 ఏళ్ల కిందట మహాత్మా గాంధీ 150వ జయంతి నేపథ్యంలో ఆయనకెంతో ఇష్టమైన “వైష్ణవ్ వజన్ కో తేనే కహియే” గీతాన్ని ఆలపించాల్సిందిగా 150 దేశాల గాయనీగాయకులను ప్రేరేపించాను. శ్రీ నర్సీ మెహతా జీ స్వరపరిచిన ఈ గీతం 500-600 ఏళ్లనాటిది. అయితే, ‘గాంధీ-150’ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి సంగీత కళాకారులు దీన్ని భక్తిపురస్సరంగా ఆలపించారు. అదెంతటి ప్రభావం చూపిందంటే- యావత్‌ ప్రపంచం దానితో గళం కలిపింది. అలాగే ఇక్కడ హాజరైనవారిలో చాలామంది గాంధీజీ ప్రబోధాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తూ 2-3 నిమిషాల వీడియోలు రూపొందించారు. ఏతావాతా భారత్‌సహా ప్రపంచంలోని సృజనాత్మక లోక సమష్టి శక్తి ఎంతటి అద్భుతాలనైనా ఆవిష్కరించగలదని చెప్పడానికి అప్పుడు మనమంతా సాక్షులం. నాటి ఊహలు నేడు వాస్తవరూపు దాల్చి పోటెత్తిన కెరటాల్లా నేడు ఈ తీరానికి చేరాయి.

మిత్రులారా!

ఉషోదయాన సూర్యకిరణాలు ఆకాశాన్ని సప్తవర్ణ శోభితం చేసే రీతిలో ‘వేవ్స్‌’ సమ్మిట్‌ ఆరంభ క్షణం నుంచే కాంతులు వెదలజల్లడం ప్రారంభించింది. “తొలి క్షణం నుంచే సుస్పష్ట లక్ష్యంతో ఈ కెరటం శిఖరస్థాయిలో గర్జించడం మొదలుపెట్టింది.” ‘వేవ్స్’ తన తొలి ఎడిషన్‌లోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మా సలహా బోర్డుతో సంధానితులైన సహచరులందరి సమష్టి కృషి ఫలితం నేడిక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో మీరు ‘క్రియేటర్స్ ఛాలెంజ్’, ‘క్రియేటోస్ఫియర్’ పేరిట భారీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రపంచంలోని దాదాపు 60 దేశాల నుంచి లక్ష మందికిపైగా సృజనాత్మక వ్యక్తులు పాల్గొన్నారు. ఈ విధంగా నిర్వహించిన 32 రకాల పోటీల నుంచి 800 మంది విజేతలను తుదిదశ పోటీకి ఎంపికయ్యారు. ఈ ఫైనలిస్టులందరికీ నా శుభాకాంక్షలు... ప్రపంచంపై మీదైన ముద్ర వేయడానికి, ఏదైనా ఘనత సాధించడానికి తగిన అవకాశం మీకు అత్యంత చేరువలో ఉంది.

మిత్రులారా!

మీరంతా ‘భారత్‌ పెవిలియన్‌’లో సరికొత్త ఆలోచనలతో అనేక అద్భుతాలు సృష్టించారని నాకు సమాచారం అందింది. వాటన్నిటినీ తిలకించేందుకు నేనెంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను... కచ్చితంగా అన్నిటినీ చూస్తాను. ఇక ‘వేవ్స్ బజార్’ కార్యక్రమం కూడా చాలా వినూత్నమైనది... ఇది నవ్య సృష్టికర్తలను ప్రోత్సహిస్తూ, వారిని కొత్త మార్కెట్లకు పరిచయం చేస్తుంది. కళా రంగంలో కొనుగోలుదారులు-విక్రేతలను అనుసంధానించే ఈ ఆలోచన నిజంగా ఎంతో గొప్పది.

మిత్రులారా!

ఓ శిశువు ఊపిరి పోసుకున్న తర్వాత, జన్మించిన మరుక్షణం నుంచీ తల్లితో సంబంధం ఒక లాలిపాటతో ప్రారంభమవుతుందని మనందరికీ తెలిసిందే. ఆ బిడ్డ వినే తొలి స్వరం తన తల్లిదే... ఆ జోలపాటతోనే సంగీతంపై అవగాహన మొదలవుతుంది. తన బిడ్డ కలలకు ఒక రూపమిచ్చే తల్లిలాగా సృజనాత్మక లోకంలోని కళాకారులు, నిపుణులు ఒక యుగకాలపు స్వప్నాలకు రూపమిస్తారు. అలాంటి వారందర్నీ ఒకే వేదికపైకి చేర్చడమే ‘వేవ్స్‌” లక్ష్యం.

మిత్రులారా!

ఎర్రకోట పైనుంచి నేను ‘సమష్టి కృషి’ గురించి చాలాసార్లు ప్రస్తావించాను. ఆ మేరకు మీ అందరి సమష్టి కృషితో ‘వేవ్స్‌’ సంరంభం భవిష్యత్తులో భారత్‌ను సమున్నత శిఖరాలకు చేర్చగలదనే నా నమ్మకం ఇవాళ మరింత దృఢంగా మారింది. ఈ తొలి సమ్మిట్‌లో చేదోడువాదోడుగా నిలిచిన తరహాలోనే ఈ సహకారాన్ని కొనసాగించాలని పరిశ్రమలోని నా సహచరులను అభ్యర్థిస్తున్నాను. ‘వేవ్స్‌’లో మరెంతో సుందర కెరటాలు ఎగయనున్నాయి. ‘వేవ్స్‌’ అవార్డుల ప్రదానం కూడా భవిష్యత్తులో ప్రారంభమవుతుంది. ఇవి కళా, సృజనాత్మకత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకం కావడం ఖాయం. మనమంతా ఐక్యంగా ప్రపంచ ప్రజానీకం హృదయాలను చూరగొనాలి... ప్రతి వ్యక్తినీ మనతో మమేకం చేసుకోవాలి.

మిత్రులారా!

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో భారత్‌ శరవేగంగా ముందడుగు వేస్తోంది. ఇక అంతర్జాతీయంగా ‘ఫిన్‌టెక్’ అనుసరణ క్రమంలో అగ్ర స్థానానికి చేరింది. అంతేకాదు... మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు. అలాగే ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థ మనదే. వికసిత భారత్‌ దిశగా మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భారత్‌ నుంచి ప్రపంచం పొందగలిగింది మరెంతో ఉంది. ఎందుకంటే- 100 కోట్లకుపైగా జనాభాతోపాటు... 100 కోట్లకు మించిన కథలుగల దేశమిది. రెండు వేల ఏళ్లకిందట భరతముని నాట్యశాస్త్రాన్ని రచించినప్పుడు- “నాట్యం భావయతి లోకం” అన్నది దాని సందేశం. అంటే- కళ ప్రపంచానికి భావోద్వేగాలను, అనుభూతులను కలిగిస్తుందని అర్థం. శతాబ్దాల కిందట కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’, ‘శాకుంతలం’  రచించిన నాడే ప్రాచీన నాటక రంగానికి భారత్‌ సరికొత్త దిశానిర్దేశం చేసింది. దేశంలోని ప్రతి వీధికీ ఓ కథ ఉంటుంది.. ప్రతి పర్వతం ఓ గీతమాలపిస్తుంది... ప్రతి నది ఏదో ఒక స్వరం వినిపిస్తుంది. మీరు ఈ దేశంలోని 6 లక్షలకుపైగాగల గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా ఆయా గ్రామాలకు తమవైన జానపద గాథలు, వాటిని వినిపించే విశిష్ట శైలి కనిపిస్తాయి. ఇక్కడ వివిధ సమాజాలు జానపద కథల రూపంలో తమ చరిత్రను భవిష్యత్తరాలకు అందిస్తూ వచ్చాయి. సంగీతం కూడా మనకొక సాధనే... అది భక్తిగీతమైనా, గజల్‌ అయినా, శాస్త్రీయం లేదా సమకాలీనమైనా... ప్రతి రాగానిదీ ఓ కథ.. ప్రతి లయకూ ఒక ఆత్మ ఉంటాయి.

మిత్రులారా!

మనకు ‘నాద బ్రహ్మం’... అంటే ‘దివ్య స్వరం’ అనే భావన ఉంది. మన దేవుళ్ళు సంగీత-నృత్యాల ద్వారా కూడా తమనుతాము వ్యక్తీకరిస్తారు. శివుని డమరుకం సృష్టికి తొలి శబ్దం. సరస్వతీ మాత వీణ జ్ఞానం, జ్ఞాన లయ సమన్వితం. శ్రీకృష్ణుని వేణువు ప్రేమ, సౌందర్యాలకు శాశ్వత సందేశం. విష్ణువు శంఖం, దాని ధ్వని సానుకూల శక్తికి సంకేతాలు... ఇలాంటివెన్నో మనకున్నాయి. ఇటీవల ఇక్కడ నిర్వహించిన ఆకర్షణీయ సాంస్కృతిక ప్రదర్శనలో వీటన్నిటి సంగ్రహ రూపాన్ని మనం చూశాం. అందుకే నేనేమంటున్నానంటే- ఇదే సమయం... సరైన తరుణం.. ‘భారత్‌లో సృష్టి-ప్రపంచం కోసం సృష్టి’ సముచిత కాలం. కథ చెప్పడంలో కొత్త మార్గాల కోసం ప్రపంచం నేడు అన్వేషిస్తున్న వేళ, భారత్‌కు వేల ఏళ్లనాటి అపార కథానిధి ఉంది. అంతేకాదు... ఈ సంపద కాలాతీతం... ఆలోచనా ప్రేరకం... విశ్వవాప్తం. అది కేవలం సంస్కృతి సంబంధిత అంశాలకు పరిమితం కాదు... సైన్స్ ప్రపంచం, క్రీడలు, ధైర్యసాహసాల కథలు, త్యాగం, తపస్సు కథలెన్నో ఉన్నాయి. మన కథల్లో సైన్స్, ఫిక్షన్, ధైర్యం, సాహసం ఉన్నాయి. భారత కథా భాండాగారం అత్యంత విశాలం.. విస్తీర్ణం గలది. ఈ నిధిని ప్రపంచం నలుమూలలకూ చేర్చడం, ఆసక్తికర రీతిలో భవిష్యత్తరాలకు అందించడం ఈ ‘వేవ్స్‌’ వేదిక బృహత్తర కర్తవ్యం.

 

****


Release ID: (Release ID: 2125848)   |   Visitor Counter: 18