సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
బుద్ధుని పవిత్ర అవశేషాలు సారనాథ్ నుంచి న్యూఢిల్లీకి... త్వరలో వియత్నాంకు
Posted On:
30 APR 2025 11:31PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని జాతీయ వస్తు ప్రదర్శనశాలలో ఒక ప్రత్యేక ఆవరణలో పుష్పాలతో అలంకరించి ఉంచిన బుద్ధుని పవిత్ర అవశేషాల వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడిన సాధువులు, భిక్షుకులు, దౌత్యవేత్తలు, సంఘ ప్రతినిధులు బుధవారం (ఏప్రిల్ 30న) మంత్రోచ్చారణ, విశేష ప్రార్థన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతక్రితం సారనాథ్ నుంచి ఈ పవిత్ర అవశేషాలను న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. దీనిని వియత్నాం తీసుకువెళ్తారు. భారత్‌లో వియత్నాం రాయబారి శ్రీ ఎన్‌గుయెన్ థాన్ హయితో పాటు మన దేశానికి తాత్కాలిక హైకమిషనరు ప్రియంగా విక్రమసింఘె కూడా ప్రార్థనలలో పాలుపంచుకొన్నారు.
బుద్ధుని పవిత్ర అవశేషాలను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఐక్య రాజ్య సమితి వెసాక్ దినం సందర్భంగా వియత్నాంలోని నాలుగు నగరాల్లో మొట్టమొదటిసారి ప్రదర్శనకు ఇవ్వనుంది. దీనికోసం అంతర్జాతీయ బౌద్ధిక సమాఖ్య (ఐబీసీ) సహకారాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ కోరింది. బుద్ధుని పవిత్ర అవశేషాల్ని సారనాథ్‌లో మూలగంధ కుటి విహారలో ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. వీటిని ఆంధ్ర ప్రదేశ్ లోని నాగార్జున కొండ తవ్వకాలలో కనుగొన్నారు. ఇవి క్రీ.శ.246 కంటే పాతవని విశ్వసిస్తున్నారు.
ఈ పవిత్ర అవశేషాలను పూర్తి అధికార గౌరవ మర్యాదలతో వారణాసి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. వీటిని జాతీయ వస్తు ప్రదర్శనశాలకు తెచ్చే కంటే ముందు, ఐజీఐ విమానాశ్రయంలోని ప్రత్యేక విశ్రాంతి మందిరంలో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచారు.
ఈ పవిత్ర అవశేషాలు గురువారం (మే1న) ఢిల్లీని వీడి వెళ్లే సమయంలో వియత్నాం నుంచి దాదాపు 120 మంది సాధువులు నేషనల్ మ్యూజియానికి వచ్చి తమ వందనాన్ని ఆచరించనున్నారు. వారు ఆ తరువాత అదే రోజున- పవిత్ర అవశేషాన్ని వియత్నాం చేర్చడానికంటే ముందు- తమ దేశానికి తిరిగివెళ్తారు. పవిత్ర అవశేషం రాకను పురస్కరించుకొని వియత్నాంలో ఏర్పాటు చేసే ఒక స్వాగత కార్యక్రమంలో ఈ సాధువులు పాల్గొననున్నారు.
***
(Release ID: 2125703)
Visitor Counter : 6