రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళానికి 26 రఫేల్-మెరైన్ విమానాలు
ఫ్రాన్స్‌తో అంతర ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు
Posted On:
28 APR 2025 3:53PM by PIB Hyderabad
26 ‘రఫేల్’ పోరాట విమానాల (ఒక సీటుతో ఉండే 22 విమానాలు, రెండు సీట్లు ఉండే 4 విమానాలు)ను భారత నౌకాదళం కోసం కొనుగోలు చేయడానికి ఒక అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ) పైన భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. వీటిలో శిక్షణ, సిమ్యులేటర్, ఇతరత్రా సంబంధిత ఉపకరణాలు, ఆయుధాలతో పాటు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ సామగ్రి సైతం కలిసి ఉన్నాయి. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) దగ్గర ఇప్పటికే ఉన్న రఫేల్ విమానాలకు అవసరమైన అదనపు సామగ్రి కూడా దీనిలో భాగంగా ఉంది.
కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ ఆయుధ దళాల మంత్రి శ్రీ సెబాస్టియన్ లెకార్నూ ఐజీఏపై సంతకాలు చేశారు. న్యూఢిల్లీలోని నౌసేనా భవన్‌లో రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో భారత్, ఫ్రాన్స్‌ల అధికారులు ఒప్పందం ప్రతులు, విమాన ప్యాకేజీ సరఫరా ప్రోటోకాల్, ఆయుధ ప్యాకేజీ ప్రోటోకాల్‌కు సంబంధించిన సంతకాలు పూర్తయిన ప్రతులను ఈ రోజు ఇచ్చిపుచ్చుకున్నారు.
స్వయం సమృద్ధ భారత్ (‘ఆత్మనిర్భర్ భారత్’)ను సాకారం చేద్దామంటున్న ప్రభుత్వ దృష్టికోణానికి అనుగుణంగా, ఈ ఒప్పందంలో స్వదేశీ ఆయుధాల ఏకీకరణకుగాను టెక్నాలజీ బదలాయింపు కూడా ఒక భాగంగా ఉంది. దీనిలో రఫేల్ విమాన ముఖ్యభాగం (ఫ్యూజ్‌లేజ్) ఉత్పత్తి సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు భారత్‌లో ఇంజిన్, సెన్సర్లు, ఆయుధాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్ వంటి సదుపాయాలు కూడా కలిసున్నాయి. ఈ లావాదేవీతో ఈ తరహా సదుపాయాలు మొదలవడం వేల కొద్దీ ఉద్యోగాల కల్పనకే కాక, పెద్ద సంఖ్యలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ఆస్కారం, అవి తయారుచేసే ఉత్పత్తులకు గిరాకీతోపాటు ఆదాయార్జన అవకాశాలు కూడా అందివస్తాయన్న అంచనాలున్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన పోరాట విమానం ‘రఫేల్-మెరైన్’. సముద్ర ప్రాంతంలో పూర్తి స్థాయిలో పనిచేయగల సత్తా దీని సొంతం. ఈ విమానాల సరఫరా 2030కల్లా పూర్తవుతుంది. ఈ విమానాలను నడిపే సిబ్బందికి ఫ్రాన్స్‌లో, భారత్‌లో శిక్షణనివ్వనున్నారు.
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఇప్పటికే ఉపయోగిస్తున్న రఫేల్‌తో రఫేల్-మెరైన్‌కు ఒక పోలిక ఉంది. దీనిని కొనుగోలు చేయడంతో భారత నౌకాదళంతోపాటు ఐఏఎఫ్‌కు కూడా విమాన శిక్షణ, రక్షణ సామగ్రి ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) సంబంధిత అనుకూలతలు ఏర్పడతాయి. సంయుక్త విన్యాసాల సామర్థ్యం సైతం చెప్పుకోదగినంతగా మెరుగుపడుతుంది. రఫేల్-మెరైన్‌ను చేర్చుకోవడంతో భారత నౌకాదళ విమానవాహక నౌకల దాడి సామర్థ్యం కూడా గణనీయంగా పెరగడం ఖాయం.
***
(Release ID: 2125002)
Visitor Counter : 12