వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 కాలంలో, భారత్ కరుణాపూరిత నేతృత్వం...
300 మిలియన్ డోసుల టీకామందు ప్రపంచానికి సరఫరా: కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
* న్యూఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య శిఖరాగ్ర సదస్సు ప్రాంతీయ సమావేశాన్ని
ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి
* భారత్ అనుసరిస్తున్న వేక్సీన్ దౌత్యం, ‘ఆయుష్మాన్ భారత్’ పథకం
ప్రపంచ ఆరోగ్య రంగ సమానత్వానికి ఇండియా కట్టుబడి ఉందని సూచిస్తున్నాయి: శ్రీ గోయల్
* ప్రజారోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది...
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 620 మిలియన్లకు పైగా ప్రజలు
ఉచిత ఆరోగ్యసంరక్షణ సేవలను పొందుతున్నారు: మంత్రి
Posted On:
27 APR 2025 8:03PM by PIB Hyderabad
‘ప్రపంచ ఆరోగ్య శిఖరాగ్ర సదస్సు (డబ్ల్యూహెచ్ఎస్) ప్రాంతీయ సమావేశం ఆసియా 2025’ను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం నిర్వహించగా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. కోవిడ్-19 మహమ్మారి విరుచుకుపడ్డ కాలంలో భారత్ ముందస్తు చొరవ తీసుకొని, ప్రపంచ దేశాల పట్ల కరుణతో వ్యవహరించిందని ఆయన అన్నారు. ‘వ్యాక్సీన్ మైత్రి’ కార్యక్రమాన్ని భారత్ అమలుచేస్తూ, తక్కువ స్థాయి అభివృద్ధిని మాత్రమే నమోదు చేస్తున్న దేశాలకు, బలహీన దేశాలకు సుమారు 300 మిలియన్ల (30 కోట్ల) సూదిమందు డోసులను- వాటిలో చాలావరకు ఉచితంగానే- సమకూర్చిందని మంత్రి తెలిపారు. పైపెచ్చు, ఏ దేశమూ కూడా ఈ విషయంలో వెనుకబడిపోకుండా జాగ్రత్తలు తీసుకుందని కూడా ఆయన చెప్పారు. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న కాలంలో, అనేక ఇతర దేశాలు ఎగుమతి నియంత్రణ విధానాలను అమలుపరిస్తే, దీనికి భిన్నంగా టీకామందును అందరికీ సమాన స్థాయిలో అందించడానికి భారత్ ప్రాధాన్యాన్ని కట్టబెట్టి, ‘వసుధైవ కుటుంబకమ్’ అనే తన ప్రాచీన సభ్యతా సూత్రానికి అనుగుణంగా వ్యవహరించిందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.
ఆసియాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన డబ్ల్యూహెచ్ఎస్ ప్రాంతీయ సమావేశం ‘‘ఆరోగ్య సమానత్వానికి పెద్ద పీట వేయడానికి గాను వ్యాప్తిని విస్తరించాల’’నే అంశంపై దృష్టిని కేంద్రీకరించినందుకు శ్రీ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యమైన ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యత స్థిరాభివృద్ధిలో ఓ ముఖ్య భాగమని ఆయన చెబుతూ, మెరుగైన ఆరోగ్య సేవల్ని అందరి అందుబాటులోకి తీసుకువెళ్లడంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని వివరించారు.
మహమ్మారి కాలంలో, ప్రపంచ నేతలతో తన సంభాషణల్ని మంత్రి గుర్తుకు తెచ్చుకుంటూ, ప్రపంచంలో ఆరోగ్య రంగంలో సంకట స్థితులు తలెత్తినప్పుడు వాటిని లాభార్జనకు వినియోగించుకొనే ధోరణిని కాదనుకుని కీలక మందులను సమంజసమైన ధరలకే సరఫరా చేయడానికి భారత్ ఎలా ముందంజ వేసిందీ వివరించారు.
ఆరోగ్య సమానత్వం అంశంపై శ్రీ గోయల్ మాట్లాడుతూ, చిన్న చిన్న మార్పులను మాత్రమే చేసి ఔషధ పేటెంటులను చేజిక్కించుకొనే ప్రయత్నాల్ని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పనులకు పాల్పడితే, లక్షల కొద్దీ ప్రజలు మందులను చౌకగా పొందలేకపోతారు అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలలో సైతం నాణ్యమైన ఆరోగ్యసంరక్షణ సేవలను అందజేసే దిశగా భారత్ ప్రయత్నాలను గురించి స్వయంగా తెలుసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య శిఖరాగ్ర సదస్సు (డబ్ల్యూహెచ్ఎస్) ప్రతినిధులను ఆయన కోరారు.
ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా 62 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత ఆరోగ్యసంరక్షణకు ప్రస్తుతం అర్హులయ్యారని శ్రీ గోయల్ ప్రధానంగా చెప్పారు. ఈ పథకం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఆరోగ్య బీమా కార్యక్రమం’గా కూడా ఉందని ఆయన అన్నారు. లాభాపేక్ష అనేదానికి బదులు కరుణయే భారత్ నిబద్ధతకు ప్రేరణగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను శ్రీ గోయల్ గుర్తుకు తెస్తూ ‘‘మా దృష్టిలో ఆరోగ్యసంరక్షణ అంటే- అది రోగికి పున:స్వస్థతను సమకూర్చడం ఒక్కటే కాదు, ముందుజాగ్రత్త చర్యలతో కూడిన స్వాస్థ్య సేవల్ని అందించడం కూడా దీన్లో భాగం.. ఇందులో సదరు వ్యక్తి శ్రేయానికి పాటుపడడం, ఆ వ్యక్తిని మానసికంగా కోలుకునేటట్లు చేయడం, పూర్తి సమాజాన్ని మెరుగైన జీవన శైలితోపాటు మెరుగైన భవిష్యత్తుతో జోడించడం.. ఇవన్నీ ఆరోగ్యసంరక్షణలో కలిసున్నాయి’’ అన్నారు.
మానవ సంక్షేమం విషయంలో భారత్ సమగ్ర దృష్టికోణాన్ని అనుసరిస్తోందని మంత్రి చెప్పారు. స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో పారిశుద్ధ్యంతోపాటు గౌరవానికి ప్రాధాన్యాన్ని ఇచ్చారు.. మరీ ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి ప్రాథమ్యాన్నిచ్చారని ఆయన తెలిపారు. ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన’లో ఇప్పటికే 4 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తవగా మరిన్ని లక్షల గృహాలు నిర్మాణదశలో ఉన్నాయని, ‘జల్ జీవన్ మిషన్’ నల్లా నీటి లభ్యతను 3 కోట్ల గ్రామీణ నివాసాల స్థాయి నుంచి 16 కోట్ల నివాసాలకు విస్తరించిందన్నారు. మహిళలు ఇళ్లలో పొగ బారిన పడకుండా వారిని రక్షించడానికి ‘ఉజ్జ్వల యోజన’లో ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందిస్తున్నట్లు, అంతేకాక మహమ్మారి కాలంలోనూ, ఆ తరువాత సైతం 80 కోట్ల మంది పౌరులకు ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.
ఒక సిసలైన ఆరోగ్యభరిత సమాజాన్ని తీర్చిదిద్దాలంటే శారీరక స్వస్థత, మానసిక పుష్టి, స్వచ్ఛ వాతావరణం, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ సంధానం, ఆర్థిక సాధికారత కల్పన.. వీటన్నిటినీ కలబోసి పునాదిని ఏర్పరచాల్సి ఉంటుందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.
మంత్రి తన ప్రసంగం ముగింపులో ప్రపంచ ఆరోగ్య అజెండా పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచంలోని పౌరులందరికీ ఆరోగ్యవంతమైన, మరింత సమానావకాశాలు లభించే భవిష్యత్తును అందించే దిశగా కలిసికట్టుగా పనిచేయాలంటూ అన్ని దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
***
(Release ID: 2124833)
Visitor Counter : 5