బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు, గనుల రంగాలు బలమైన పునాదిగా... దూసుకెళ్తున్న భారత ఆర్థిక రంగానికి మూలాధారం ఉక్కు పరిశ్రమ: కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి
2030 నాటికి 100 మిలియన్ టన్నుల లక్ష్యంతో ప్రత్యామ్నాయంగా బొగ్గు గ్యాసిఫికేషన్‌కు ప్రోత్సాహం
కోకింగ్ కోల్ బ్లాకుల వేలంలో పరిశ్రమ భాగస్వాములు చురుగ్గా పాల్గొనాలని కోరిన కేంద్ర మంత్రి
Posted On:
26 APR 2025 2:56PM by PIB Hyderabad
ఈరోజు ముంబయిలో జరిగిన ఉక్కు రంగం ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశం, ఇండియా స్టీల్ 6వ ఎడిషన్‌ను ఉద్దేశించి కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఉక్కు రంగం, బొగ్గు పరిశ్రమతో దాని సహసంబంధం గురించి విధాన రూపకర్తలు, పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు, పరిశోధకులు, పౌరుల మధ్య చర్చలకు ఈ కార్యక్రమం ఒక ముఖ్య వేదికగా నిలిచింది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తన కీలక ఉపన్యాసంలో... భారత ఆర్థిక పురోగతికి ఉక్కు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే జాతీయ దార్శనికతకు ఈ పరిశ్రమ కీలక చోదక శక్తిగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన నుంచి తమిళనాడులోని చారిత్రాత్మక పాంబన్ వంతెన వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ సరికొత్త ప్రపంచస్థాయి ప్రమాణాలను నిర్దేశిస్తున్నదన్న కేంద్రమంత్రి... ఇవన్నీ ఉక్కు రంగ బలం పెరగడం ద్వారానే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. దేశ మౌలిక సదుపాయాల ప్రయాణంలోని ప్రతి మైలురాయి ఉక్కుతోనే ముడిపడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశ ముందడుగును, ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ఇటీవలి కాలంలో భారత ఉక్కు రంగం అద్భుతమైన వేగంతో వృద్ధి చెందిన క్రమంలో, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ నిలిచిందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను ఉటంకిస్తూ, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా దేశీయ వినియోగం, పారిశ్రామిక విస్తరణ, స్వీయ-సమృద్ధితో కీలక చోదక శక్తిగా ఉన్న ఉక్కు రంగాన్ని భారత "సన్‌రైజ్ సెక్టార్"గా కేంద్రమంత్రి అభివర్ణించారు.
బొగ్గు, గనుల రంగాల బలమైన పునాదిపై దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఉక్కు రంగం మూలాధారంగా ఉందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. ముడి పదార్థాల వ్యూహం, ముడి పదార్థాల మిశ్రమంలో మార్పు గురించి జరుగుతున్న ప్రస్తుత సమావేశ సందర్భంలో, ముడి పదార్థాల భద్రత ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్, సున్నపురాయి వంటి కీలక ముడి పదార్థాల లభ్యతతో పాటు మాంగనీస్, నికెల్, క్రోమియం వంటి ముఖ్యమైన మిశ్రమ మూలకాల లభ్యతను నిర్ధారించడం ఆర్థిక, వ్యూహాత్మక ఆవశ్యకతగా ఆయన పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, పంపిణీ ఘనతను భారత్ సాధించింది - ఇది జాతీయ ఇంధన భద్రత దిశగా పరివర్తనాత్మక ముందడుగు. భారత మొత్తం ఇంధన అవసరాల్లో దాదాపు 60 శాతం.. దాని విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం బొగ్గు ద్వారానే జరుగుతున్నట్లు ఇంధన గణాంకాలు 2025 వెల్లడిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనాలను పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, రాబోయే కాలంలో బొగ్గు భారత ఇంధన, పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా ఉంటుందని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు.
ఉక్కు తయారీలో కీలకమైన కోకింగ్ కోల్, ఉక్కు ఉత్పత్తి వ్యయంలో దాదాపు 42 శాతం వాటా కలిగి ఉందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత కోకింగ్ కోల్ అవసరాల్లో 85 శాతం భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రమంలో, అంతర్జాతీయంగా ధరల అస్థిరత, సరఫరాలో అంతరాయాల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, 140 మెట్రిక్ టన్నుల దేశీయ ఉత్పత్తి సాధించడం, 2030 నాటికి ఉక్కు తయారీలో దేశీయ బొగ్గు మిశ్రమాన్ని 10 శాతం నుంచి 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2021లో మిషన్ కోకింగ్ కోల్‌ను ప్రారంభించింది.
కొత్త అన్వేషణ ప్రాంతాలను గుర్తించడం, ప్రస్తుత గనుల నుంచి ఉత్పత్తిని పెంచడం, బొగ్గు వాషింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రైవేట్ సంస్థల కోసం కొత్త కోకింగ్ కోల్ బ్లాకుల వేలం వంటి కీలక చర్యలు ఈ మిషన్‌లో భాగంగా ఉన్నాయి. దీని ద్వారా నాణ్యతలో రాజీ లేకుండా అధిక బూడిద గల దేశీయ బొగ్గును ఉపయోగించుకునేందుకు స్టాంప్ ఛార్జింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. 2030 నాటికి 58 మిలియన్ టన్నుల బొగ్గు వాషింగ్ సామర్థ్యాన్ని సాధించడంతో పాటు 23 మిలియన్ టన్నుల వాష్డ్ కోకింగ్ బొగ్గును సరఫరా చేసే లక్ష్యంతో ఈ మిషన్ రూపొందించారు.
వాషరీలు, బెనిఫిషియేషన్ ప్లాంట్లు, బ్లాక్‌ల వేలంలో ప్రైవేట్ సంస్థలు చురుగ్గా పాల్గొనాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. దేశీయ బొగ్గును ఉపయోగిస్తున్న పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్ (పీసీఐ) ట్రయల్స్ ఇప్పటికే దిగుమతి ప్రత్యామ్నాయంగా ఆశాజనకంగా కొనసాగుతన్నాయనీ, బెనిఫిషియేషన్లో గొప్ప ఆవిష్కరణలతో మరింత మెరుగైన ఫలితాలను ఆశించవచ్చని ఆయన తెలిపారు.
ఇనుప ఖనిజం గురించి ప్రస్తావిస్తూ, 35 బిలియన్ టన్నులకు పైగా విస్తారమైన నిల్వలతో భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని కేంద్రమంత్రి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 263 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి కాగా, 50 మిలియన్ టన్నులు ఎగుమతి చేయడంతో పాటు, పెరుగుతున్న దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉండేలా కృషి జరుగుతోందన్నారు. ప్రస్తుతం, మన వద్ద 179 క్రియాశీల ఇనుప ఖనిజ గనులు ఉన్నాయనీ, ఇప్పటివరకు 126 బ్లాక్‌ల వేలం పూర్తవగా 38 గనుల్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమైనట్లు కేంద్రమంత్రి వివరించారు. మరిన్ని గనుల్లో త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, 66 శాతానికి పైగా నిల్వలు మధ్యస్థ, తక్కువ-గ్రేడ్ నాణ్యత గలవేనని, వీటి కోసం బెనిఫిషియేషన్ అవసరమని ఆయన తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు గానూ, తక్కువ-గ్రేడ్ ఖనిజ బెనిఫిషియేషన్‌ను ప్రోత్సహించడం కోసం గనుల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ప్రజా సంప్రదింపుల దశలో ఉన్న ఒక విధానాన్ని ప్రతిపాదించింది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి సున్నపురాయి, తక్కువ-గ్రేడ్ ఖనిజానికి రాయల్టీ రేట్ల సవరణ సహా విధానపరమైన సంస్కరణలు కొనసాగుతున్నాయి.
ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా గ్రీన్‌ఫీల్డ్ గనులను సకాలంలో ఉపయోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి వనరులను సద్వినియోగం చేయడంలో జాప్యం చేయడం జాతీయ వనరులను వృధా చేయడమే అవుతుందన్నారు. గనుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి తమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోందనీ, బిడ్డర్లతో పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని తెలిపారు. అనుమతుల క్రమబద్ధీకరణ కోసం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఈఎఫ్‌సీసీ)తో మెరుగైన సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు. గత ఆరు నెలల కాలంలో అనేక కీలక మార్గదర్శకాలు జారీ చేశామనీ, మరిన్ని సంస్కరణలు పురోగతిలో ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
బొగ్గు, మైనింగ్ రంగాలు దిగుమతులపై ఆధారపడుటను తగ్గిస్తూ, భారత వాతావరణ నిబద్ధత.. సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, ఈ సవాళ్ల కోసం సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
ఈ దిశలో నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ఒక ప్రధాన కార్యక్రమంగా నిలుస్తుంది, ఇది రూ. 8,500 కోట్ల పెట్టుబడితో 2030 నాటికి 100 మెట్రిక్ టన్నుల గ్యాసిఫికేషన్ సాధించే లక్ష్యంతో కొనసాగుతోంది. డిఆర్ఐ (డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్) ఉక్కు తయారీ కోసం పరిశుభ్రమైన ప్రత్యామ్నాయంగా ఉన్న సింథసిస్ గ్యాస్ (సింగ్యాస్) ఉత్పత్తి చేయడానికి అధిక-బూడిద గల, నాన్-కోకింగ్ దేశీయ బొగ్గు వినియోగాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. ఉద్గారాలను తగ్గించడమే కాకుండా ఇంధన భద్రత, ఎకనమిక్ వాల్యూ చెయిన్‌లను మెరుగుపరిచే ఈ పరివర్తనాత్మక సాంకేతికతలో పెట్టుబడి పెట్టాలని పరిశ్రమ ప్రముఖులను శ్రీ కిషన్ రెడ్డి కోరారు.
అంతే కాకుండా, అధునాతన మిశ్రమలోహాలు, గ్రీన్ టెక్నాలజీలకు మద్దతు కోసం డంప్‌లు, టైలింగ్‌ల నుంచి కీలకమైన ఖనిజాలను తిరిగి పొందడంపై దృష్టి పెట్టాలని గనుల నిర్వాహకులకు కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉన్న డంప్‌లను పరీక్షించడం అలాగే వాటి నుంచి ఖనిజాలను తిరిగి పొందడం జాతీయ ప్రాధాన్యంగా చేపట్టాలని కోరారు.
సురక్షితమైన, అన్ని రకాల పరిస్థితులను తట్టుకోగల, సుస్థిరమైన ముడి పదార్థాల వ్యూహం దిశగా సాగే ప్రయాణం సమిష్టి ప్రయాణం అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, భారత్ ఉక్కు రంగం విషయంలో సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన మార్గంలో ముందుకు సాగుతోంది. 2030-31 నాటికి 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని, 2047 నాటికి 500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే జాతీయ ఉక్కు విధానం లక్ష్యం. బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖలు ఈ దార్శనికతకు పూర్తిగా అనుగుణంగా పనిచేస్తున్నాయి అలాగే ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం అవసరమైన చర్యలను చేపడుతున్నాయి.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వాముల మధ్య సన్నిహిత సహకారం ద్వారా, భారత్ దేశీయంగా తన ముడి పదార్థాల అవసరాలను తీర్చడమే కాకుండా, సుస్థిరత.. స్వీయ-సమృద్ధితో ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని శ్రీ కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ఉక్కు రంగం కోసం హరిత.. మరింత సమర్థమైన భవిష్యత్తును అందించే విధానాలను రూపొందించుటలో తమవంతు సహకారం అందించాలని సమావేశానికి హాజరైన వారికి శ్రీ కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పలువురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశ ప్రారంభోత్సవ సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ రంగంలో సహకారాత్మక అభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు.
స్టీల్ ఎక్స్‌పో రెండో రోజున, ఉక్కు రంగంలో ముడి పదార్థాల లభ్యతపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ, బొగ్గు రంగం అనుసరిస్తున్న విధానంలో గణనీయమైన మార్పును ప్రధానంగా ప్రస్తావించారు. వారసత్వ రంగంగా ఉన్న ఈ రంగం నేడు ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మూల స్తంభంగా మారిందని ఆయన పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ భవిష్యత్ వ్యూహాన్ని వివరిస్తూ, దేశీయ కోకింగ్ కోల్ ఉత్పత్తిని పెంచడం, ఇంధన నాణ్యతను పెంచడం కోసం బొగ్గు వాషింగ్ పద్ధతులను మెరుగుపరచడం, శుభ్రమైన ఉక్కు తయారీకి వీలుగా అధునాతన కోక్ తయారీ, గ్యాసిఫికేషన్ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకునేలా ప్రోత్సహించేందుకు కృషి జరుగుతోందని వివరించారు. ఆవిష్కరణలను పెంపొందించడానికి, భారత బొగ్గు నిల్వల పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు సహకారాత్మక విధానం అనుసరించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.
ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ ఇండియా స్టీల్ ఎక్స్‌పో 2025 ఈ రంగానికి చెందిన ప్రపంచ స్థాయి ప్రముఖులు వృద్ధి వ్యూహాలు, ఉక్కు ఉత్పత్తిలో సుస్థిర పద్ధతులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య అన్ని పరిస్థితులను తట్టుకునే సమర్థత, పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంచడంలో ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తనల కీలక పాత్ర వంటి ప్రధాన అంశాలను గురించి చర్చించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నిర్మాణాత్మకంగా దృక్పథాలను పంచుకోవడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శనలతో పాటు, వనరుల సామర్థ్యం, పర్యావరణ బాధ్యత వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ క్రియాశీల భాగస్వామ్యం బొగ్గు, ఉక్కు రంగాల వ్యూహాత్మక ఐక్యతను స్పష్టం చేసింది. సుస్థిరమైన, స్వీయ-సమృద్ధి గల, ముందుచూపుతో కూడిన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఈ రెండు రంగాల సమిష్టి నిబద్ధతను ఇది ప్రతిబింబించింది. ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ భాగస్వాములు హాజరైన ఈ సమావేశం ప్రపంచ బొగ్గు, ఉక్కు రంగాల భవిష్యత్తును రూపొందించడంలో పెరుగుతున్న భారత స్థాయిని పునరుద్ఘాటించింది.
***
(Release ID: 2124777)