యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
డిజిలాకర్ ద్వారా క్రీడా సర్టిఫికేట్ల జారీని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
ఐజీ స్టేడియంలో నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రారంభం
క్రీడాకారులే కేంద్రంగా మోదీ ప్రభుత్వం క్రీడా కార్యక్రమాలను చేపట్టింది - డాక్టర్ మాండవీయ
ఉన్నత స్థాయి పరిశోధన, విద్య, ఆవిష్కరణలకు కేంద్రంగా ఎన్సీఎస్ఎస్ఆర్ నిలుస్తుంది.. క్రీడా ప్రదర్శనలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కేంద్ర మంత్రి
Posted On:
24 APR 2025 4:44PM by PIB Hyderabad
డిజిలాకర్ ద్వారా క్రీడా ధ్రువీకరణ పత్రాల జారీని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈరోజు ప్రారంభించారు.
దీనికి ముందు, అక్కడే నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ (ఎన్సీఎస్ఎస్ఆర్)ను ఆయన ప్రారంభించారు.
సమావేశాన్నిఉద్దేశించి మాట్లాడుతూ, అథ్లెట్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ పునరుద్ఘాటించారు. అథ్లెట్లను కేంద్రీకృతం చేస్తూ మోదీ ప్రభుత్వం అనేక క్రీడా కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జాతీయ క్రీడా పాలన బిల్లు 2024 ముసాయిదా, జాతీయ క్రీడా విధానం 2024 ముసాయిదా, క్రీడలలో వయస్సురీత్యా మోసాలను అరికట్టేలా జాతీయ నియమావళి ముసాయిదా (NCAAFS)-2025లను ఉటంకిస్తూ.. భారత క్రీడా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం, సుపరిపాలనను నెలకొల్పాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇవి నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు.
డిజిలాకర్ ద్వారా జారీ చేసిన క్రీడా ధ్రువీకరణ పత్రాలను త్వరలోనే నేషనల్ స్పోర్ట్స్ రిపోజిటరీ సిస్టమ్ (ఎన్ఎస్ఆర్ఎస్)తో అనుసంధానిస్తామని, దాని ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రభుత్వ నగదు బహుమతులను నేరుగా అథ్లెట్ల బ్యాంకు ఖాతాల్లోకే పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందని, దాంతో ప్రత్యేకంగా భౌతికంగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు.
“గతంలో ఏం జరిగేదంటే- ఓ క్రీడాకారుడు అంతర్జాతీయ పోటీలలో పతకాలు గెలిచిన తర్వాత ప్రభుత్వ నగదు పారితోషికం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అథ్లెట్లు తమకు రావాల్సిన బహుమతిని పొందడంలో అడ్డంకులను ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వారికోసం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ కార్యక్రమాలను రూపొందించాం. అతడు/ ఆమె అంతర్జాతీయంగా పతకం గెలవడాన్ని అందరూ చూశాక కూడా, వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమేముంది’’ అని మంత్రి అన్నారు.
భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడానికి భారత బిడ్ కు అనుగుణంగా అమలు చేస్తున్న సమగ్ర ప్రణాళిక గురించి డాక్టర్ మాండవీయ వివరించారు. 2030లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్ లు), నిర్వహణ సమర్థత, అథ్లెట్ల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని పిలుపునిస్తూ.. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడానికి అథ్లెట్లు, సమాఖ్యలు, ప్రభుత్వం సమష్టిగా కృషి చేయాలని కేంద్ర మంత్రి కోరారు. ఈ దిశగా చర్యల్లో భాగంగా.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలోని కార్యాలయాన్ని ఆసక్తి గల జాతీయ క్రీడా సమాఖ్యల కోసం అందుబాటులో ఉంచుతామని ఆయన ప్రకటించారు.
సమాఖ్య సహకారాన్ని సులభతరం చేయడంతోపాటు క్రీడల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ‘వన్ స్పోర్ట్–వన్ కార్పొరేట్’ విధానాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు డాక్టర్ మాండవీయ ప్రకటించారు. అంతేకాకుండా, ప్రాధాన్య క్రీడా విభాగాల కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా ఒలింపిక్ శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
ఎన్సీఎస్ఎస్ఆర్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ.. క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలను తీర్చిదిద్దుతూ, ఇది అత్యున్నత స్థాయి పరిశోధన, విద్య, ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తుందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ కింద.. భారత దీర్ఘకాలిక క్రీడా లక్ష్యాలను సాకారం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని ఆయన స్పష్టం చేశారు.
‘‘నవ భారత్ కోసం బలమైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మనమందరం కలిసి కృషిచేద్దాం’’ అంటూ డాక్టర్ మాండవీయ ముగించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఒలింపిక్ రజత పతక విజేత, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కార గ్రహీత మీరాబాయి చాను ఇలా అన్నారు: - “క్రీడాకారుల కోసం నిజంగా ఇదొక మంచి పథకం. డిజిలాకర్ ద్వారా క్రీడా ధ్రువీకరణ పత్రాల జారీ అన్నది నావంటి క్రీడాకారులకు చాలా ఒత్తిడిని దూరం చేస్తుంది. చాలా సార్లు క్రీడాకారులు - ప్రభుత్వ ఉద్యోగాలు, వీసా మొదలైన వాటిని పొందాలంటే కొన్ని పత్రాల కోసం హడావుడిగా ఇళ్లకు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే మనం వాటిని ఎప్పుడూ మనతో పట్టుకెళ్లలేం. ఈ కార్యక్రమంపట్ల క్రీడాకారులందరి తరఫునా మన క్రీడా మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.”
***
(Release ID: 2124206)