కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ టెలికమ్ యూనియన్ (ఐటీయూ)లో అగ్రగామి నాయకత్వ స్థానానికి పోటీపడుతున్న భారత్


* ఐటీయూలో రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టరు పదవికి
భారతీయ అభ్యర్థిగా నామినేట్ అయిన ఎం. రేవతి

Posted On: 22 APR 2025 12:13PM by PIB Hyderabad

అంతర్జాతీయ టెలికమ్ యూనియన్ (ఐటీయూ)లోని రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టరు పదవికి భారత్ తన అభ్యర్థిగా ఎం. రేవతిని నామినేట్ చేసింది. ఈమె టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ)లో సంయుక్త వైర్‌లెస్ సలహాదారుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నామినేషన్‌ను దాఖలు చేయడం... ప్రపంచ రేడియో స్పెక్ట్రమ్ గవర్నెన్సులో ప్రభావాన్విత పాత్రను నిర్వహించడానికి గత కొన్ని దశాబ్దాల్లో మొట్టమొదటిసారి భారత్ చేస్తున్న అత్యంత కీలకమైన ప్రయత్నం.
జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న ఐక్య రాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీయే ఐటీయూ. ఇది ప్రపంచంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు కలిసికట్టుగాను, సురక్షితంగాను, న్యాయంగాను పనిచేసేటట్లు చూస్తోంది. ఐటీయూలోని రేడియో కమ్యూనికేషన్ బ్యూరో ప్రపంచ రేడియో ఫ్రీక్వెన్సీలతోపాటు ఉపగ్రహ కక్ష్యలను నియంత్రిస్తుంది. ఈ నియంత్రణ బాధ్యతనేది... 5జీ, 6జీ, అంతరిక్ష బ్రాడ్‌బ్యాండ్‌లతోపాటు విపత్తులు సంభవించే సమయాల్లో ప్రతిస్పందించడానికి పరిమితంగా మాత్రమే లభ్యమవుతున్న ఈ వనరుల నిర్వహణ కోణంలో చూస్తే... చాలా కీలకం. ఈ సంస్థ (ఐటీయూ)కు డైరెక్టరు భూమికలో రేవతి, ఆధునిక రేడియో కమ్యూనికేషన్ ప్రమాణాల రూపకల్పనలో,స్పెక్ట్రమ్‌ అందరికీ సమానంగా అందేటట్లు చూడడంలో ఓ ప్రధాన పాత్రను పోషించగలుగుతారు.  
డైరెక్టరు పదవికి రేవతి అభ్యర్థిత్వం... ‘వసుధైవ కుటుంబకమ్’ అన్న భారత్ దృష్టికోణంతోపాటు డిజిటల్ ప్రగతి ఫలాలు అన్ని దేశాలకు చెందాలని, ముఖ్యంగా అభివృద్ధి బాటలో సాగుతున్న దేశాలకు వీటి ప్రయోజనాలు అందాలని భారత్ చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తోంది. ఆమె ఎన్నికైతే, ఈ బ్యూరోకు నాయకత్వం వహించే తొలి మహిళ అవుతారు. అంతేకాదు, ప్రపంచంలో సగాని కంటే ఎక్కువ జనాభాను కలిగిఉన్న ఐటీయూ ప్రాంతాలైన ‘ఈ’ (ఆసియా/ఆస్ట్రేలేసియా), ‘డీ’ (ఆఫ్రికా) ప్రాంతాల నుంచి నేతృత్వం వహించే ప్రప్రథమ ప్రతినిధి కూడా ఆమే అవుతారు.
స్పెక్ట్రమ్, ఉపగ్రహ కక్ష్య నిర్వహణలో దాదాపుగా 30 సంవత్సరాల అనుభవం రేవతి సొంతం. అగ్రగామి నియంత్రణ నవకల్పనలకు నాంది పలికిన వ్యక్తిగా రేవతి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం ఐటీయూలో రేడియో రెగ్యులేషన్స్ బోర్డు‌లో సేవలందిస్తున్నారు. స్పెక్ట్రమ్ ఉపయోగంలో ప్రపంచ దేశాల మధ్య సమానత్వం ఉండాల్సిందేనని ఈ బోర్డు స్పష్టంగా పేర్కొంటోంది.
న్యూఢిల్లీలో కిందటి సంవత్సరం అక్టోబరు నెలలో ప్రపంచ  టెలికమ్యూనికేషన్ ప్రమాణీకరణ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ఏ)ని విజయవంతంగా నిర్వహించడంతో ప్రపంచ టెలికమ్ రంగంలో భారత్ నాయకత్వానికి ప్రశంసలు లభించాయి. ఈ సమావేశంలో 150కి పైగా దేశాల ప్రతినిధులు 3,700 మందికి పైగా పాల్గొన్నారు. డబ్ల్యూటీఎస్ఏ 2024 లో ఎనిమిది చరిత్రాత్మక సంకల్పాలను ఆమోదించిన ఘట్టం డిజిటల్ భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దడంలో భారత్ పాత్ర అంతకంతకూ పెరుగుతోందని స్పష్టం చేస్తోంది.

ఐటీయూను గురించి:
ఐటీయూ అనేది డిజిటల్ సాంకేతికతల (ఐసీటీల)కు సంబంధించిన ఐక్య రాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీ. ఈ సంస్థలో 194 సభ్యదేశాలతోపాటు 1000 కి పైగా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రాంతీయ సంస్థలు భాగంగా ఉన్నాయి. దీని ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. దీని ప్రాంతీయ కార్యాలయాలు ప్రతి ఒక్క ఖండంలో ఉన్నాయి. ఐ.రా.స. కుటుంబంలో అన్నింటి కంటే పాత ఏజెన్సీ ఐటీయూనే. ఇది 1865లో టెలిగ్రాఫ్ ఆరంభమైనప్పటి నుంచి ప్రపంచంలో అన్ని దేశాలను సంధానిస్తూ వస్తోంది.
ఐటీయూ తన మూడు రంగాలైన... ఐటీయూ-టీ (ప్రమాణీకరణం), ఐటీయూ-డీ (అభివృద్ధి), ఐటీయూ-ఆర్ (రేడియో కమ్యూనికేషన్)..లను సమన్వయపరుస్తుంటుంది. వీటిలో రేడియో కమ్యూనికేషన్ బ్యూరో గ్లోబల్ రేడియో-ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌తోపాటు ఉపగ్రహ కక్ష్య వనరులను నిర్వహిస్తూ, వేర్వేరు దేశాల, టెక్నాలజీలు (5జీ, విమానయానం, అంతరిక్ష సాహస యాత్రల వంటివి) ఒక దానికి మరొకటి సమస్యలను సృష్టించకుండా చూస్తుంది. మొబైల్ నెట్‌వర్కులు మొదలు జీపీఎస్, వాతావరణ ఉపగ్రహాలు, ప్రసారం వరకు ప్రతి ఒక్క పనికీ ఈ సమన్వయ బాధ్యతలు చాలా ముఖ్యం.  


మరింత సమాచారం కోసం ఈ కింద పేర్కొన్న డీఓటీ హ్యాండిళ్లను అనుసరించండి: -

X - https://x.com/DoT_India

Insta - https://www.instagram.com/department_of_telecom?==

Fb - https://www.facebook.com/DoTIndia

YT- https://www.youtube.com/@departmentoftelecom

 

***


(Release ID: 2123634) Visitor Counter : 17