అంతరిక్ష విభాగం
భారతీయ వ్యోమగామి పాల్గొననున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్ర వచ్చే నెల్లోనే: డాక్టర్ జితేంద్ర సింగ్
. రోదసీ ప్రస్థానంలో ఓ ప్రధానాధ్యాయాన్ని లిఖించడానికి భారత్ సిద్ధం
. ఇస్రో పరిశోధనల్లో కొత్త రంగాల్లోకి ముందంజ వేస్తున్న నేపథ్యంలో... చరిత్రాత్మక స్పేస్ మిషన్‌లో భారతీయ వ్యోమగామికి ప్రాతినిధ్యం
. గగన్‌యాన్ సన్నాహాలు, ఐఎస్ఎస్ మిషన్, వేసవి ప్రయోగాలు...
ఒకటొకటిగా సాకారమవుతున్న భారత అంతరిక్ష స్వప్నాలు
Posted On:
18 APR 2025 4:28PM by PIB Hyderabad
భారత్ తన అంతరిక్ష యాత్రలో ప్రధానాధ్యాయాన్ని లిఖించబోతోంది... వచ్చే నెలలో భారతీయ వ్యోమగామితోపాటు ఓ అంతర్జాతీయ స్పేస్ మిషన్ బయలుదేరేందుకు సిద్ధమవుతోంది.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భావి ప్రణాళికలను సమీక్షించడానికి నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), భూ విజ్ఞానశాస్త్రాలు, ప్రధాన మంత్రి కార్యాలయ (పీఎంఓ) సహాయ మంత్రి, అంతరిక్ష విభాగం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు మొదటి భారతీయ వ్యక్తి పయనించడానికి ఈ స్పేస్ మిషన్ దోహదపడనుందని మంత్రి అభివర్ణించారు. 1984లో సోవియట్‌కు చెందిన సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో రాకేశ్ శర్మ పాల్గొని ఇప్పటికి నాలుగు దశాబ్దాలకు పైగానే అయింది. ఇక మళ్లీ భారతీయ వ్యోమగామి ఒకరు రోదసిలోకి వెళ్లే ఘట్టం కూడా ఇదే.
రాబోయే నెలల్లో అంతరిక్ష రంగంలో అభివృద్ధి కోసం భారత్ తపిస్తూ అనేక యాత్రలకు జోరుగా సన్నాహాలు సాగిస్తుండగా ఈ ప్రకటన వెలువడింది.
భావి అంతరిక్ష యాత్రల తాజాస్థితిని అంతరిక్ష విభాగం కార్యదర్శి, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ వివరించారు.
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వచ్చే నెలలో ఎక్సియోమ్ స్పేస్2కు చెందిన ఏఎక్స్-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారని ఇస్రో చైర్మన్ తెలిపారు.
ఈ ఏడాది మే నెలలో గ్రూప్ కెప్టెన్ శుక్లా పాల్గొననున్న ఈ యాత్ర, భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సహకారాన్ని పెంచుకొంటూ ఉన్న క్రమంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలవనుంది. ఐఏఎఫ్‌లో సన్మాన పతకాలను పొందిన టెస్ట్ పైలట్ శ్రీ శుక్లాను ఇస్రో మానవ అంతరిక్షయాన కార్యక్రమం (హ్యూమన్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రోగ్రాం- హెచ్ఎస్పీ)లో భాగంగా తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఆయన భారత తొలి స్వదేశీ మానవసహిత ఆర్బిటల్ ఫ్లయిట్ ‘గగన్‌యాన్ మిషన్’లో పాలుపంచుకోవడానికి పోటీపడుతున్న అగ్రగామి అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు. ఏఎక్స్-4 మిషన్‌లో ఆయన భాగం పంచుకోవడం వల్ల అంతరిక్ష యానం, లాంచ్ ప్రోటోకాల్స్, మైక్రోగ్రావిటీకి అలవాటుపడడం, అత్యవసర స్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలన్న అంశాల్లో కీలక అనుభవాన్ని సంపాదించగలరని భావిస్తున్నారు. ఈ అనుభవం భారతీయ వ్యోమగాముల అంతరిక్ష రంగ మహత్త్వాకాంక్షలు సాకారం కావడానికి ఎంతో అవసరం.
శుక్లా పాల్గొనబోతున్న మిషన్ దీని వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని చాటుతోంది. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యానంలో ఇమిడిఉన్న ప్రతీకాత్మకతకు భిన్నంగా, కర్తవ్య నిర్వహణకు సన్నద్ధం కావడం, ప్రపంచంతో సమన్వయం అన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. అంతరిక్షంలో అంతకంతకు పెరుగుతున్న ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యాల్లో భారత్ అనుబంధం విస్తరిస్తున్న తీరును, రోదసీలో మానవులు నిర్వహిస్తున్న అన్వేషణ ప్రాజెక్టుల్లో ఒక సీరియస్ పోటీదారుదేశంగా ఎదగాలన్న భారత్ దృఢసంకల్పాన్ని ఆయన ప్రాతినిధ్యం తెలియజెబుతోంది.
భావి మానవ సహిత అంతరిక్ష యానం, ఇస్రో ముఖ్య మిషన్ల పరంపరకు ఉన్న ప్రాముఖ్యాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా చెబుతూ, ‘‘భారత్ తన తదుపరి అంతరిక్ష రంగ సంబంధిత ముఖ్య ఘట్టానికి సన్నద్ధమైంద’’న్నారు. గగన్‌యాన్ వంటి ప్రాజెక్టుల్లో వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న వేగం, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో అనుబంధం అంతరిక్ష సాంకేతిక రంగంలో ఒక గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న ఇండియా నిబద్ధతకు అద్దం పడుతున్నాయని ఆయన అభివర్ణించారు. ఈ ప్రయత్నాలు విజ్ఞానశాస్త్రపరమైన స్వభావం అనే ఒక్క అంశంలోనే కాకుండా, ‘అభివృద్ధి చెందుతున్న భారత్’, ‘స్వయంసమృద్ధి సహిత భారత్ (‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’) దార్శనికతకు అనుగుణంగా కూడా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశం కొనసాగిన క్రమంలో, ఈ సంవత్సరం జనవరి నునంచి చోటుచేసుకొన్న అనేక కీలక పరిణామాలను మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దృష్టికి ఇస్రో తీసుకువచ్చింది. వీటిలో...ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ అందించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రకటించడం, విజయవంతమైన డాకింగ్, అన్‌డాకింగ్ సాంకేతికతల ప్రదర్శన, మన దేశంలో అభివృద్ధిపరిచిన అత్యున్నత థ్రస్ట్ లిక్విడ్ ఇంజిన్‌ను పరీక్షించడంతోపాటు శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్15ను వందోసారి ప్రయోగించి చరిత్ర సృష్టించడం వంటివి ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఏడాది కుంభ మేళా వంటి జాతీయ స్థాయి కార్యక్రమాలకు కూడా ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఇస్రో దన్నుగా నిలిచింది. అలాగే, రాబోయే కాలంలో ప్రయోగ నౌకల రికవరీ మిషన్లకు కీలకంగా ఉన్న ‘వికాస్ ఇంజిన్’ను పున:ప్రారంభించవచ్చని విజయవంతంగా నిరూపించినట్లు వెల్లడించింది.
ఈ ఏడాది మే మొదలు జులై మధ్య కాలంలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్న ప్రధాన మిషన్లలో భాగంగా, అత్యంత ఆధునిక ఈఓఎస్-09 ఉపగ్రహాన్ని తీసుకువెళ్లే పీఎస్ఎల్‌వీ-సీ61 మిషన్‌ను ఇస్రో ప్రయోగించనుంది. సీ-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను అమర్చిన ఈఓఎస్-09 అన్ని రకాలైన వాతావరణ స్థితుల్లోనూ, రాత్రయినా పగలయినా, భూ ఉపరితలాన్ని అధిక స్పష్టతతో కూడిన చిత్రాలు తీయగలగుతుంది. మరో ముఖ్య సన్నివేశం... టెస్ట్ వెహికిల్-డీ2 (టీవీ-డీ2) మిషన్. దీనిని ఒక అబార్ట్ సినారియోను అనుకరించడంతోపాటు గగన్‌యాన్ సిబ్బంది తప్పించుకోగలిగే వ్యవస్థ (గగన్‌యాన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్)ను ప్రదర్శించడానికి గాను రూపొందించారు. క్రూ మాడ్యూల్ కోసం చేపట్టే ‘సీ రికవరీ ఆపరేషన్స్’ను ఈ మిషన్‌లో ఒక అంశంగా చేర్చారు. ఇది భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యానానికిగాను పథకరచన చేసిన ప్రక్రియలను పోలి ఉంది.
ఎప్పుడెప్పుడా అని చాలాకాలంగా ఎదురు చూస్తూవస్తున్న జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 అనుబంధిత ‘నిసార్’ ఉపగ్రహ ప్రయోగం జూన్‌లో నెరవేరబోతోంది. నాసా, ఇస్రోల ఈ సమన్వయ ప్రాజెక్టు ఉద్దేశం... నాసాకు చెందిన ఎల్-బ్యాండు పేలోడ్‌లను ఇస్రోకు చెందిన ఎస్-బ్యాండు తోడ్పాటులతో మేళవించి, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్ డేటా ద్వారా భూమి మీద పర్యావరణ వ్యవస్థలోనూ, ప్రాకృతిక విపత్తులను అధ్యయనం చేయడం. జులైలో చేపట్టనున్న ఎల్‌వీఎం3-ఎం5 మిషన్ అనేది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన వాణిజ్య ప్రధాన కాంట్రాక్టులో భాగంగా, బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ... అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ ఇన్‌కార్పొరేషన్ తో కుదుర్చుకున్న ఒక వాణిజ్య ప్రధాన కాంట్రాక్టుకు కార్యరూపాన్ని ఇవ్వనుంది.
భారత అంతరిక్ష వ్యూహం పరిణితి చెందుతున్న కొద్దీ, గ్రూప్ కెప్టెన్ శుక్లా త్వరలో పాల్గొనబోతున్న మిషన్ ఒక ఆత్మవిశ్వాసపూర్వక, భవిష్యత్తు కేసి ఆశగా చూస్తున్న దేశానికి ఒక ప్రతీకగా నిలుస్తోంది. ఇది రోదసి రంగంలో ప్రపంచం తీస్తున్న పరుగులో తన స్థానాన్ని మళ్లీ ఒకసారి చేజిక్కించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఆయన చేసే యాత్ర కేవలం ఓ అంతరిక్షయానం కాదు... అంతకు మించింది... భారత్ అంతరిక్ష అన్వేషణలో ఓ సరికొత్త శకానికి శ్రీకారం అవుతుంది.
***
(Release ID: 2122974)
Visitor Counter : 16