బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల తవ్వకం పనుల్లో పేస్ట్ ఫిల్ టెక్నాలజీని ఉపయోగించనున్న బొగ్గు రంగ తొలి పీఎస్‌యూగా ఎస్ఈసీఎల్
• రూ.7040 కోట్ల ఒప్పందంపై ఎస్ఈసీఎల్‌కు, టీఎంసీ మినరల్ రిసోర్సెస్ సంతకాలు
Posted On:
18 APR 2025 3:01PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు గని తవ్వకం పనుల్లో పేస్ట్ ఫిల్ టెక్నాలజీని ఉపయోగించనున్న మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)గా సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్‌స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) నిలిచిపోనుంది... దీర్ఘకాలం మనుగడలో ఉండే గనితవ్వవకం పద్ధతులను, పర్యావరణానుకూల మైనింగు పద్ధతులను అనుసరించే దిశలో ఒక ప్రధానమైన అడుగు పడిందని కూడా ఇది సూచిస్తోంది.
భూగర్భ గనులలో తవ్వకం కార్యకలాపాల్లో ఈ వినూత్న సాంకేతికతను అమలు చేయడానికి టీఎంసీ మినరల్ రిసోర్సెస్ ప్రయివేట్ లిమిటెడ్‌తో ఎస్ఈసీఎల్ రూ.7,040 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా, ఎస్ఈసీఎల్‌కు కోర్బా ప్రాంతంలో ఉన్న సింఘాలీ భూగర్భ గనిలో పేస్ట్ ఫిల్ టెక్నాలజీని ఉపయోగించి పెద్ద ఎత్తున బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు. 25 సంవత్సరాల్లో, ఈ ప్రాజెక్టు దాదాపు 8.4 మిలియన్ (84.5 లక్షల) టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు.
ఏమిటి ఈ పేస్ట్ ఫిల్ టెక్నాలజీ...?
భూగర్భ గని తవ్వకాల్లో ‘పేస్ట్ ఫిల్లింగ్’ ఒక ఆధునిక పద్ధతి. బయట భూములను సేకరించాల్సిన అవసరం లేదు. బొగ్గు నిలవలను వెలికితీసిన తరువాత, గని తవ్వకం కార్యకలాపాల కారణంగా ఏర్పడ్డ ఖాళీ స్థానాలను ఫ్లై యాష్ తో, ఓపెన్క్యాస్ట్ గనుల నుంచి తీసి పగలగొట్టిన ఓవర్బర్డెన్, సిమెంటు, నీళ్లు, కలిపి ఉంచే రసాయనిక పదార్థాలతో ప్రత్యేకంగా తయారు చేసిన పేస్టుతో నింపివేస్తారు. ఈ ప్రక్రియ భూమి కుంగిపోకుండా గని నిర్మాణక్రమాన్ని స్థిరపరుస్తుంది.
ప్రధానంగా, ఈ పేస్టు తయారీలో పారిశ్రామిక వ్యర్థాలను వినియోగిస్తారు కాబట్టి... దీంతో ఈ ప్రక్రియ పర్యావరణ దృష్ట్యా నిలకడగా ఉంటూ, వ్యర్థాల పునర్వినియోగానికి సైతం ప్రోత్సాహాన్నందిస్తుంది.
సింఘాలీ గని నేపథ్యం...
ఒక్కొక్క సంవత్సరంలోనూ 0.24 మిలియన్ టన్ననుల ఉత్పాదక సామర్థ్యం ఉండేటట్లుగా సింఘాలీ భూగర్భ గనికి 1989లో ఆమోదముద్ర వేశారు. 1993లో దీని నిర్వహణ కార్యకలాపాలను మొదలుపెట్టారు. ప్రస్తుతం, ఈ గనిలో జి-7 గ్రేడుకు చెందిన 84.5 మిలియన్ టన్నుల నాన్-కోకింగ్ బొగ్గు నిలవలున్నాయి. దీనిని బోర్డు, పిల్లర్ పద్ధతిని ఉపయోగించి అభివృద్ధిచేశారు. దీనిలో, భూమి లోపల చేపట్టే కార్యకలాపాల కోసం లోడ్ హాల్ డంపర్లను (ఎల్‌హెచ్‌డీలు), యూనివర్సల్ డ్రిల్లింగ్ యంత్రాలను (యూడీఎంలు) వాడారు.
ఏమైనా, గనికి పైభాగంలోని ఉపరితల ప్రాంతం దట్టమైన జన సాంద్రతను కలిగి ఉంది...దీనిలో పల్లెలు, హై-టెన్షన్ ఎలక్ట్రిసిటీ లైన్లు, ప్రజాపనుల విభాగం (పీడబ్ల్యూడీ) వేసిన ఒక రహదారి వంటివి నెలకొన్నాయి. దీంతో భద్రత, పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో పెట్టుకొంటే ఇక్కడ గుహల్లా తొలుచుకుంటూ ముందుకుపోయే సాంప్రదాయక పద్ధతులను అనుసరించడానికి కుదరదు.
సింఘాలీ గనికి ఒక కొత్త అవకాశం
పేస్ట్ ఫిల్ సాంకేతికతను తెర మీదకు తీసుకు రావడంతో, ఈ ప్రాంతంలో ఉపరితల మౌలిక సదుపాయాల జోలికి పోకుండా గనుల తవ్వకం కార్యకలాపాలను చేపట్టే సౌలభ్యం ఏర్పడుతోంది.
సింఘాలీలో ఈ సాంకేతికతను అమలుచేయడంలో విజయం చేజిక్కితే ఇవే తరహా భూ సంబంధ సమస్యలు నెలకొన్న ఇతర భూగర్భ గనులలో కూడా గని తవ్వకం కార్యకలాపాలను మళ్లీ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నారు.
హరిత మైనింగు బాటలో వేస్తున్న ఓ అడుగు
మొత్తం రూ.7,040 కోట్ల పెట్టుబడితో, ఈ ప్రాజెక్టు భారత్‌లో పర్యావరణ హితకర గనితవ్వక సాంకేతికతలకు దన్నుగా నిలిచే ఒక ప్రధాన కార్యక్రమం కానుంది. పర్యావరణంపై ప్రసరించే ప్రభావాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించి వేస్తూనే బొగ్గు ఉత్పాదనను పెంచాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
ఈ సందర్భంగా ఎస్ఈసీఎల్ సీఎండీ శ్రీ హరీశ్ దుహాన్ మాట్లాడుతూ, ‘‘పేస్ట్ ఫిల్ టెక్నాలజీ భూమి లోపల గనితవ్వక కార్యకలాపాల భవితను సురక్షితంగా నిలపడం ఒక్కటే కాకుండా, వినూత్న పర్యావరణానుకూల పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్టు గ్రీన్ మైనింగు దిశలో ఒక ముఖ్యమైన అడుగు, అంతేకాదు...రాబోయే సంవత్సరాల్లో బొగ్గు పరిశ్రమకు ఈ ప్రాజెక్టు కొత్త రూపురేఖలను కూడా తీర్చిదిద్దనుంద’’న్నారు.
***
(Release ID: 2122817)
Visitor Counter : 22