వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
లీగల్ మెట్రాలజీ (సాధారణ) నియమాలు-2011 ప్రకారం వాహనాల వేగాన్ని అంచనా వేయడానికి రాడార్ పరికరాల’ నియమాలను ప్రకటించిన కేంద్రం
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నియమాలు; రహదారి భద్రతను బలోపేతం చేయడం, సక్రమంగా ట్రాఫిక్ నిబంధనల అమలు లక్ష్యం
Posted On:
18 APR 2025 12:34PM by PIB Hyderabad
రహదార్ల భద్రతను బలోపేతం చేయడంతోపాటు ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా అమలు చేయడం లక్ష్యంగా ‘వాహనాల వేగాన్ని అంచనా వేయడానికి రాడార్ పరికరాల’ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ నియమాలను ప్రకటించింది. లీగల్ మెట్రాలజీ (సాధారణ) నియమాలు- 2011 ప్రకారం వీటిని రూపొందించారు. పరిశ్రమలు, ఆ నిబంధనలను అమలు చేసే సంస్థలకు తగినంత సమయాన్నిస్తూ.. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ నియమాలు అమల్లోకి వస్తాయి.
ఈ నియమాల ప్రకారం, అన్ని రాడార్ ఆధారిత వేగ అంచనా పరికరాలకు లీగల్ మెట్రాలజీ అధికారుల ధ్రువీకరణ తప్పనిసరి. ఆ పరికరాలు కచ్చితత్వంతో, ప్రామాణిక కొలతతో, చట్టబద్ధంగా ఉన్నాయని దీని ద్వారా స్పష్టమవుతుంది. అది పారదర్శకతను, ప్రజల్లో నమ్మకాన్ని, అమలులో సమగ్రతను పెంచుతుంది. ట్రాఫిక్ వేగాన్ని పర్యవేక్షించడం, ప్రమాదాల నివారణ, రోడ్లు పాడవడాన్ని తగ్గించడం వంటి అంశాల్లో ధ్రువీకృత రాడార్ వ్యస్థలు కీలకమైనవి.
అంతర్జాతీయంగా ప్రామాణికమైన ఓఐఎంఎల్ ఆర్ 91 ప్రాతిపదికగా సాంకేతిక సలహాలనందించే కమిటీ ఈ నిబంధనల రూపకల్పన బాధ్యతలను చేపట్టింది. ఈ నిబంధనలను ఖరారు చేయడానికి ముందే- ప్రదర్శనలు, ప్రజాభిప్రాయ సేకరణల ద్వారా రాష్ట్రాల లీగల్ మెట్రాలజీ విభాగాలు, ప్రాంతీయ రిఫరెన్సు ప్రామాణిక ప్రయోగశాలలు (ఆర్ఆర్ఎస్ఎల్), తయారీదారులు, వినియోగదారు సంస్థలు సహా సంబంధిత సంస్థలన్నింటినీ సంప్రదించారు.
ఈ నియమాల అమలు ద్వారా బోర్డులో భాగమైన సంస్థలన్నింటికీ గణనీయమైన ప్రయోజనాలున్నాయి. సాధారణ పౌరుల విషయంలో- రాడార్ ఆధారిత వేగ అంచనా పరికరాలకు ధృవీకరణ తప్పనిసరి చేయడం ద్వారా వేగ పరిమితులను కచ్చితంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అన్యాయంగా జరిమానాల విధింపు తగ్గడంతోపాటు రహదారి భద్రత విశేషంగా మెరుగుపడుతుంది. శాస్త్రీయంగా, చట్టబద్ధంగా ధ్రువీకరణ పొందిన సాధనాలే వేగాన్ని అంచనా వేస్తాయి కాబట్టి ప్రజలు మరింత నమ్మకంగా వాహనాలను నడపవచ్చు.
పరిశ్రమలకు, అందునా రాడార్ ఆధారిత వేగ అంచనా పరికరాల తయారీ పరిశ్రమలకు ఈ కొత్త నిబంధనలు ఓఐఎంఎల్ ఆర్ 91 వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్పష్టమైన సాంకేతిక, నియంత్రణ నియమావళిని అందిస్తాయి. ఇది దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం మాత్రమే కాదు.. నాణ్యతలోనూ పనితీరులోనూ స్థిరత్వాన్ని పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ తయారీదారుల ఎగుమతి పోటీతత్వాన్ని పెంచుతుంది.
ధ్రువీకరణ పొందిన పరికరాలను ప్రవేశపెట్టడం వల్ల చట్టాన్ని అమలు చేసే సంస్థల పనితీరులో సమర్థత, వాటి విశ్వసనీయత మెరుగవుతాయి. ఈ పరికరాల వల్ల విశ్వసనీయమైన, కచ్చితమైన అమలు సాధ్యమవుతుంది. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి, వేగ నిబంధనల ఆమోదయోగ్యతను మెరుగుపరచడానికి ఇది కీలకమైనది. ధృవీకృత, ప్రామాణిక కొలతలు గల పరికరాల లభ్యత అధికారులు నమ్మకంగా, కచ్చితత్వంతో వ్యవహరించడానికి వీలు కల్పిస్తుంది.
ట్రాఫిక్ నిర్వహణలో డేటా ఆధారిత నిర్వహణ దిశగా జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం ఒక కీలకమైన ముందడుగు. ఇది రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడంలో సహాయపడుతుంది, రహదారులపై క్రమశిక్షణను పెంచుతుంది. మరోవైపు రోడ్డు ప్రమాదాలు, వాహనాల మరమ్మతులు, మౌలిక సదుపాయాలకు నష్టం వంటి వివిధ సామాజిక, ఆర్థిక వ్యయాలను తగ్గించడం ద్వారా సుస్థిర/ దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. మొత్తంమీద, ఈ నియమాలు దేశంలో సురక్షితమైన, అధునాతన సాంకేతిక రవాణా వ్యవస్థను నెలకొల్పడానికి ఉపయోగపడతాయి.
రాడార్ పరికరాలు డాప్లర్ రాడార్ వంటి సాంకేతికతల ద్వారా పనిచేస్తాయి. ఇవి వాహన వేగాన్ని అత్యంత కచ్చితత్వంతో కొలుస్తాయి. వివరణాత్మకమైన సాంకేతిక, భద్రతాపరమైన నిర్దేశాలను ఈ నియమాలు పేర్కొంటాయి. ప్రామాణిక కొలతల్లో కచ్చితత్వం ఉండేలా చూస్తాయి, వివిధ పర్యావరణ పరిస్థితుల్లో స్థిరంగా పనిచేయగలవు, టాంపరింగ్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ చర్యలు సాంకేతిక విశ్వసనీయత, చట్టపరమైన జవాబుదారీతనాన్ని పెంపొందిస్తాయి.
లీగల్ మెట్రాలజీ మౌలిక సదుపాయాల ఆధునికీకరణ దిశగా భారత్ చేపడుతున్న సంస్కరణల్లో ఇదొ ముఖ్యమైన ముందడుగు. ఈ వేగ అంచనా సాధనాలు అత్యంత శాస్త్రీయంగా, చట్టబద్ధంగా ధ్రువీకరణ పొందినవిగా ఉండేలా ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయి.
కింది లింకులో నిబంధనలను చూడవచ్చు:
https://consumeraffairs.nic.in/sites/default/files/uploads/legal-metrology-acts-rules/Radar%20Equipment%20Gen%20Rules%20Amendment.pdf
(Release ID: 2122815)
Visitor Counter : 54