జల శక్తి మంత్రిత్వ శాఖ
2025 పోషణ పక్షోత్సవం (పోషణ్ పఖ్వాడా) లో భాగమైన “స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం ద్వారా ఆరోగ్యకరమైన బాల్యం సాధ్యం” ప్రచారోద్యమం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖతో చేతులు కలిపిన డీడీడబ్ల్యూఎస్
· ఏప్రిల్ 8 నుంచి 23 వరకు 7వ పోషణ పక్షోత్సవం: ప్రచారోద్యమం ఉపశీర్షికగా “స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం ద్వారా సంపూర్ణ పోషణ మొదలు”
· బాలల పోషణ, సంపూర్ణ ఆరోగ్యానికి కీలకమైన అంశాలుగా స్వఛ్చమైన నీటి పద్ధతులు, పారిశుద్ధ్యంపై ప్రచారం దృష్టి
· అవగాహన పెంపు కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
Posted On:
08 APR 2025 2:57PM by PIB Hyderabad
ఏప్రిల్ 8 నుంచి 23 వరకు కొనసాగే 7వ పోషణ పక్షోత్సవంలో జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) చురుగ్గా పాల్గొంటోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టిన సక్షం అంగన్వాడీ పథకానికి అనుగుణంగా, ఈ విభాగం చేపట్టిన ప్రచారోద్యమానికి “స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం ద్వారా ఆరోగ్యకరమైన బాల్యం” అనే శీర్షికను పెట్టారు. “స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం ద్వారా సంపూర్ణ పోషణ మొదలు” అనే ప్రచారోద్యమం ఉపశీర్షిక బాలల పోషణ, సంపూర్ణ ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన నీటి నిర్వహణ, పారిశుద్ధ్య పద్ధతులు కీలకమని తెలుపుతోంది.

వ్యక్తులు, కుటుంబం, సమాజ స్థాయుల్లో ప్రవర్తనాపరమైన మార్పుల ద్వారా పౌష్టికాహార లోపాలని సరిదిద్దాలన్నది పోషణ పక్షోత్సవ లక్ష్యం. ఈ దిశగా నాలుగు కీలక రంగాలను గుర్తించారు:
· పసికందు తొలి వెయ్యి రోజులపై ప్రత్యేక దృష్టి
· పోషణ్ ట్రాకర్ యాప్ లోని లబ్ధిదారు సౌలభ్యం గురించి విస్తృత ప్రచారం
· సీఎంఏఎం ద్వారా పోషకాహార లోపాలను సరిదిద్దడం
· బాల్యంలో ఊబకాయ నివారణ కోసం ఆరోగ్యకర జీవనశైలి పద్ధతులకు ప్రోత్సాహం
పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల కట్టడికి పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్య పద్ధతుల ప్రాముఖ్యాన్ని చాటే క్షేత్ర స్థాయి కార్యక్రమాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విస్తృతంగా చేపడతాయి.

కార్యక్రమాల వివరాలు:
· పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛత ఉద్యమం: పరిశుభ్రమైన తాగునీరు, సరైన పారిశుద్ధ్య పద్ధతులు, చేతుల శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, వంటింటి వ్యర్థాలతో సహజ ఎరువుల తయారీ వంటి అంశాలపై సమాజ చైతన్య కార్యక్రమాల ఏర్పాటు
· అంగన్వాడీ కార్యకర్తల అవగాహన పెంపు: పసిబిడ్డల తల్లులకు సరైన శౌచాలయ పద్ధతులు, స్వచ్ఛమైన తాగునీటి గురించి అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాల ఏర్పాటు
· పాలిచ్చే తల్లులకు అవగాహన పెంపు: సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య అలవాట్ల గురించి అంగన్వాడీ, ఆశా కార్యకర్తల కోసం ఐఈసీ కార్యక్రమాలు.. తద్వారా సమాజ ఆరోగ్య పరిరక్షణ
· స్మార్ట్ పోషణ్ అంగన్వాడీ సర్టిఫికెట్: ఉన్నతస్థాయి పరిశుభ్రత, పోషణ ప్రమాణాలను నెలకొల్పడంలో కృషి చేసిన అంగన్వాడీ కేంద్రాలకు తగిన గుర్తింపు
· పరిశుభ్రమైన నీరు, అందమైన ప్రాంగణం పథకం: అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన, స్వయం సహాయక బృందాల సహకారంతో బాలలు సులభంగా వినియోగించగలిగే తాగునీటి వనరులు, అవగాహన పెంచే ఆకర్షణీయమైన చిత్రాలు
· అవగాహన ర్యాలీలు: సరైన పారిశుద్ధ్యం, పరిశుభ్రత అలవాట్లను పాటించడంలో పౌరుల భాగస్వామ్యం పెంపొందించడం, అపరిశుభ్రమైన నీటి వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధుల నిరోధానికి కృషి
మహిళా శిశు సంక్షేమ శాఖ కృషికి చేదోడు వాదోడుగా డీడీడబ్ల్యూఎస్ విభాగం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేపడుతుంది. అత్యధిక స్థాయిలో ప్రజలను చేరుకునేందుకు అనువుగా #DDWSJoinsPoshanPakhwada, #PoshanPakhwada వంటి హ్యాష్ టాగ్ ల వినియోగం సహా విరివిగా ప్రచారం.
జల జీవన మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, వాష్ (నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత) పథకం వంటి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లో దీర్ఘకాలిక అవగాహనను కలిగించాలని, గ్రామీణ సమూహాల్లో ప్రవర్తనాపరమైన పరివర్తనను సాధ్యం చేయాలని పోషణ పక్షోత్సవం భావిస్తోంది – తద్వారా మెరుగైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, బాలల్లో మెరుగైన పోషణ సాధించాలని ఆశిస్తోంది.
మరింత సమాచారం ఇక్కడ : https://www.jalshakti-ddws.gov.in
***
(Release ID: 2120343)