శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఔషధావిష్కరణ.. జన్యు విశ్లేషణలలో హైదరాబాద్‌లోని ‘సీఎస్‌ఐఆర్‌’ సంస్థల కీలక పాత్ర: డాక్టర్ జితేంద్ర సింగ్

· హైదరాబాద్‌లోని ‘సీఎస్‌ఐఆర్‌’ ప్రయోగశాలల శాస్త్ర విజ్ఞాన పరిశోధనలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సమీక్ష

· హైదరాబాద్‌ ‘సీఎస్‌ఐఆర్‌’ ప్రయోగశాలలు సంయుక్తంగా ‘అంకుర సంస్థల సదస్సు-2025’ నిర్వహిస్తాయని ప్రకటన

Posted On: 06 APR 2025 3:43PM by PIB Hyderabad

సరికొత్త ఔషధాల ఆవిష్కరణ, జన్యు విశ్లేషణతోపాటు చౌకగా మూల ఔషధ ఉత్పత్తుల (ఏపీఐ) రూపకల్పనలో హైదరాబాద్‌లోని శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యతల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. గడచిన దశాబ్దంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా చూపిన ప్రత్యేక శ్రద్ధ, ఆయన అందించిన ప్రోత్సాహంతో హైదరాబాద్‌ ‘సీఎస్‌ఐఇర్‌’ ప్రయోగశాలలు సాధించిన ఇటీవలి విజయాలపై సమీక్షలో భాగంగా మంత్రి ఈ సమావేశం నిర్వహించారు.

 

 

హైదరాబాద్‌ నగరంలోని మూడు అత్యుత్తమ ‘సీఎస్‌ఐఆర్‌’ ప్రయోగశాలలు... ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, (సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీటీ), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌జీఆర్‌ఐ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీఎస్‌ఐఆర్‌ – సీసీఎంబీ) డైరెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు డైరెక్టర్లు... డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ ప్రకాష్ కుమార్, డాక్టర్ వినయ్ నందికూరి తమ ఆధ్వర్యంలోని ప్రయోగశాలలు సాధించిన ఇటీవలి విజయాలను, వాటిద్వారా అందించిన వ్యూహాత్మక శాస్త్రీయ ప్రయోగ ఫలితాలను ప్రదర్శించడంతోపాటు మంత్రికి వాటి గురించి విశదీకరించారు.

ఈ మేరకు జాతీయ రసాయన-ఔషధ రంగాల పురోగమనంలో తమ దార్శనిక పాత్రను ‘సీఎస్‌ఐఆర్‌ – ఐఐసీటీ’ డైరెక్టర్‌ డి.శ్రీనివాస రెడ్డి మంత్రికి సంక్షిప్తంగా వివరించారు.

ఇందులో భాగంగా సురక్షిత, మరింత ప్రభావశీల వ్యవసాయ రసాయనాలకు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పారిశ్రామిక వినియోగ ఉత్ప్రేరకాలపై పరిశోధనల ద్వారా హైడ్రోజెనేషన్‌, ఆక్సిడేషన్‌, పాలిమరైజేషన్‌ ప్రక్రియలకు ఉపయోగపడే వినూత్న ఉత్ప్రేరకాలను రూపొందించగలిగామని ఆయన వివరించారు.

 

గ్రీన్‌వర్క్స్‌ బయో సంస్థతో సంయుక్తంగా ‘కంపోస్టబుల్ ప్లాస్టిక్‌’ల రూపకల్పన సహా తమ సంస్థ సాధించిన కీలక విజయాలను డాక్టర్ రెడ్డి ప్రముఖంగా వివరించారు. గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జీఏసీఎల్‌) సహకారంతో హైడ్రాజైన్ హైడ్రేట్ తయారీ గురించి తెలిపారు. సుస్థిర సాంకేతికతల రంగానికి సంబంధించి వాయురహిత గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ (ఏజీఆర్‌) ఒకటని, బయో డిగ్రేడబుల్ వ్యర్థాలను ఇది బయోగ్యాస్, బయో-ఎరువుగా మార్గగల సామర్థ్యం ఈ సాంకేతికతకు ఉందని చెప్పారు.

 

 

మాలిక్యూలర్‌ బయాలజీ, జెనెటిక్‌ డయాగ్నసిస్‌, బయోటెక్నలాజికల్‌ ఆవిష్కరణలలో తమ సంస్థ సాధించిన విజయాలను ‘సీఎస్‌ఐఆర్‌ – సీసీఎంబీ’ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి వివరించారు. ఇందులో భాగంగా దేశంలో డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింట్‌ సాంకేతికతను రూపొందించిన తొలి సంస్థ తమదేనని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ పరిశోధనలు, చట్టబద్ధ చర్యల విషయంలో ఇది శాశ్వత ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఇక దేశీయ రోగనిర్ధారణ కిట్‌లు, నిఘా వ్యవస్థలు, వర్ధమాన ‘ఎంఆర్‌ఎన్‌ఎ’ టీకా సాంకేకతల రూపకల్పన వగైరాల ద్వారా కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో తమ సంస్థ శరవేగంగా స్పందించిందని గుర్తుచేశారు. తమ సంస్థ చేపట్టిన అత్యంత ప్రభావశీల కార్యక్రమాల్లో సికిల్ సెల్ అనీమియాపై ప్రయోగాలు కీలకమైనవని తెలిపారు. ‘నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్‌’లో భాగంగా ఈ పరిశోధనల కింద అత్యంత సున్నిత, చౌక రోగనిర్ధారణ కిట్‌ను రూపొందించామన్నారు.

అంతేకాకుండా క్షయ, ఎన్‌కెఫలైటిస్‌ వంటి వ్యాధులపై పరిశోధనలోనూ సీసీఎంబీ చురుగ్గా కృషి చేస్తోంది. అసాధారణ రుగ్మతల జన్యు ప్రాతిపదికపై మెరుగైన అవగాహన దిశగా దేశంలోనే తొలి ‘అరుదైన వ్యాధుల రిజిస్ట్రీ’ని సంస్థ ప్రారంభించింది. మరోవైపు తన పరిధిలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎఐసీ-సీసీఎంబీ ) ద్వారా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణ సుస్థిరతలకు సంబంధించి బయోటెక్ ఆవిష్కరణలపై కృషి చేసే 160కిపైగా అంకుర సంస్థలకు చేయూతనిచ్చింది. పర్యావరణ పరిరక్షణ రంగానికి సబంధించి పులులు, ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వంటి అంతరించే జాతుల జన్యు వైవిధ్యంపై అధ్యయనాలకు సీసీఎంబీ నాయకత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వాటి అక్రమ వేట, వాణిజ్యాన్ని అరికట్టే దిశగా వన్యప్రాణుల ఫోరెన్సిక్‌ కార్యకలాపాలకు మద్దతిస్తోంది. ప్రాథమిక పరిశోధన, వాటి ఫలితాల సామాజిక అనువర్తనంపై తమ సంస్థ ద్వంద్వ నిబద్ధతతో కృషి చేస్తున్నదని, తద్వారా అత్యాధునిక శాస్త్ర విజ్ఞానాలకు, వాస్తవిక ఫలితాలకు మధ్య వారధిగా తనవంతు పాత్ర పోషిస్తున్నదని డాక్టర్ నందికూరి స్పష్టం చేశారు.

   అనంతరం ‘సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌జీఆర్‌ఐ’ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ తమ సంస్థ విజయాలను విశదీకరించారు. భూవిజ్ఞాన శాస్త్రాల్లో... ప్రత్యేకించి భూకంప ముప్పు గుర్తింపు, వనరుల అన్వేషణ, మౌలిక సదుపాయాలకు చేయూత వంటి రంగాలలో సత్ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. హిమాలయాలు, ఇండో-గంగ ప్రాంతాల్లో భూకంప ముప్పును అంచనా వేయడంలో భాగంగా దేశంలోనే తొలి ‘స్ట్రెయిన్ మ్యాప్‌’ను రూపొందించామని తెలిపారు. ఇది జాతీయ విపత్తుల నిర్వహణ సంసిద్ధతలో ఇదొక కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు. మధ్య భారతంలో టెక్టానిక్‌ ఫలకాలపై అధ్యయనాలు, ఖనిజాన్వేషణ సంబంధిత సమస్యల గుర్తింపు దిశగా భూగర్భ పొరల స్వరూప విశ్లేషణ లక్ష్యంగాగల జాతీయ కార్యక్రమం కింద భూకంప ప్రాంతాల మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. ముఖ్యంగా లద్దాఖ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో భూగర్భ ఉష్ణ శక్తిపై తమ పరిశోధనలు కాలుష్యరహిత, పునరుత్పాదక ఇంధనం దిశగా కొత్త అవకాశాలకు బాటలు పరచిందని చెప్పారు.

 ఈ సమీక్ష చివరన డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ- శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణల ముందంజకు నాయకత్వం, జాతీయ లక్ష్యాలకు మద్దతుసహా దేశం స్వావలంబిత విజ్ఞానార్థిక వ్యవస్థగా రూపొందాలనే సంకల్ప సాకారానికి దోహదం చేయడంలో ‘సీఎస్‌ఐఆర్‌’ ప్రయోగశాలలు అనుపమాన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. జాతీయాభివృద్ధి దిశగా... ప్రత్యేకించి సామాజిక సవాళ్ల పరిష్కారం, సుస్థిరతకు ప్రోత్సాహంలో శాస్త్రవిజ్ఞాన ఆధారిత మార్గాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణ, వ్యవస్థాపనలకు హైదరాబాద్ వర్ధమానావరణ వ్యవస్థగా రూపొందుతున్నదని మంత్రి అన్నారు.

 

ఈ నేపథ్యంలో మూడు ‘సీఎస్‌ఐఆర్‌’ సంస్థలు పోషిస్తున్న పాత్రను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో ‘సిఎస్‌ఐఆర్‌’ అంకుర సంస్థల సదస్సు-2025ను ఏప్రిల్ 22–23 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు. పరిశోధన సంస్థలు, అంకుర సంస్థల మధ్య సహకార సౌలభ్యం, దేశవ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఈ సదస్సు లక్ష్యాలని పేర్కొన్నారు. ఈ మేరకు “సీఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ, సీసీఎంబీ”లు సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తాయని ప్రకటించారు.

అంతిమంగా... శాస్త్ర-సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు, వాణిజ్యీకరణ, స్వావలంబన సంస్కృతిని ప్రోత్సహించడంపై మోదీ ప్రభుత్వ నిబద్ధతను డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.


(Release ID: 2119710) Visitor Counter : 9


Read this release in: English , Urdu , Hindi , Tamil