ఆయుష్
azadi ka amrit mahotsav

థాయిలాండ్ బిమ్స్ టెక్ సదస్సులో సంప్రదాయ వైద్య విధానానికి సంబంధించి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ప్రకటించిన ప్రధానమంత్రి

* బిమ్స్ టెక్ దేశాల్లో క్యాన్సర్ చికిత్స శిక్షణ, సామర్థ్య పెంపుపరమైన మద్దతుకు భారత్ సిద్ధం: ప్రధానమంత్రి

* పరిశోధన, అభివృద్ధి, విద్యారంగాల్లో సహకారాన్ని ప్రోత్సహించనున్న నూతన కార్యక్రమం

Posted On: 04 APR 2025 8:28PM by PIB Hyderabad

బ్యాంకాక్ లో జరిగిన బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్ (బిమ్స్ టెక్) సదస్సులో సాంప్రదాయిక వైద్య పరివ్యాప్తి, పరిశోధనల నిమిత్తం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను స్థాపించనున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.  

 

“మన ఉమ్మడి సామాజిక అభివృద్ధిలో ప్రజారోగ్యం మూలస్తంభం వంటిది. బిమ్స్ టెక్ దేశాల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి శిక్షణ, సామర్థ్య పెంపుపరమైన మద్దతునందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఆరోగ్యం పట్ల మా సమగ్ర వైఖరికి సూచనగా సంప్రదాయ వైద్య పరివ్యాప్తి, ఆ రంగంలో పరిశోధనల నిమిత్తం ఉన్నత స్థాయి సంస్థ- సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తాం” అని ప్రధానమంత్రి అన్నారు.

 

అటు భారత్, ఇటు థాయిలాండ్... రెండు దేశాల్లోనూ సారూప్యంగల బలమైన సాంప్రదాయిక వైద్య విధానాలున్నాయి. ప్రధానమంత్రి ప్రకటనతో ఈ రంగంలో పరిశోధనకీ, అభివృద్ధికీ గట్టి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. పురాతన వైద్య విధానాల్లో విద్య, పరిశోధన సహకారాన్ని పెంపొందించేందుకు, రెండు దేశాలూ కృషి చేస్తున్నాయి.

 

గత ఏడాది న్యూఢిల్లీ హైదరాబాద్ హౌజ్ వేదికగా జరిగిన 10వ భారత్-థాయిలాండ్ జాయింట్ కమిషన్ సమావేశంలో ఆయుర్వేదం, థాయి సాంప్రదాయ వైద్య విధానాలతో కూడిన విద్యారంగ సహకారం గురించిన అవగాహన ఒప్పందం కుదిరింది. భారత ప్రభత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జైపూర్ జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ, థాయిలాండ్ ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోని థాయి సాంప్రదాయిక, ప్రత్యామ్నాయ వైద్య శాఖల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

 

విద్యారంగ సహకారం విషయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ అందించే ఆయుష్ స్కాలర్షిప్ పథకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) అందిస్తుంది. ఆయుర్వేదం, యునానీ, సిద్ధా, హోమియోపతి వైద్య విధానాలని అభ్యసిస్తున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, యోగాలో బీయెస్సీ, యోగశాస్త్రంలో బియ్యే, యోగా, ఆయుర్వేదాల్లో పీహెచ్డీ చేస్తున్న వారికి ఈ ఉపకార వేతనాన్ని అందిస్తారు. గత అయిదేళ్ళలో బిమ్స్ టెక్ ప్రాంతానికి చెందిన 175 మంది విద్యార్థులు ఈ ఉపకార వేతనాన్ని పొందారు.

సాంప్రదాయిక వైద్యం సహా భారత్ థాయిలాండ్ దేశాలు సుదీర్ఘ కాలంగా అనేక రంగాల్లో సహకరించుకుంటున్నాయి. సంప్రదాయ వైద్య విధానాల పరివ్యాప్తి, పరిశోధనలకు నిమిత్తం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటన ఇరుదేశాల బంధాలను మరింత పటిష్టపరుస్తుంది.

 

 


(Release ID: 2119703) Visitor Counter : 5