బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు సరఫరా వ్యవస్థ బలోపేతం
Posted On:
02 APR 2025 6:10PM by PIB Hyderabad
బొగ్గు తరలింపునకు తక్కువ ఖర్చుతో కూడిన, దృఢమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ కింది చర్యలను అమలుచేస్తున్నారు:
· i. బొగ్గు మంత్రిత్వ శాఖ కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో‘బొగ్గు రవాణా ప్రణాళిక-విధానా’న్ని (కోల్ లాజిస్టిక్ ప్లాన్ అండ్ పాలసీ) ప్రారంభించింది. సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఖర్చులను తగ్గించడం, దీర్ఘకాలికత్వాన్ని ప్రోత్సహించడం ఈ చర్య ముఖ్యోద్దేశం.
· ii. బొగ్గును గనుల నుంచి రవాణా స్థలాల వరకు చేరవేయడంలో సామర్థ్యాన్ని పెంచడానికి ‘ఫస్ట్ మైల్ కనెక్టివిటీ’ (ఎఫ్ఎంసీ) ప్రాజెక్టులను అభివృద్ధిపరచడం. ఈ ప్రాజెక్టులు తక్కువ మానవ జోక్యంతోను, కన్వేయర్ బెల్టులు, క్రషర్ల వంటి యంత్రపరికరాల సాయాన్ని తీసుకొంటూ బొగ్గును లోడ్ చేసే మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడంపై దృష్టిని కేంద్రీకరించి ఈ ప్రక్రియను మరింత తక్కువ ఖర్చయ్యే విధంగా తీర్చిదిద్దుతాయి.
· iii. బొగ్గును సాఫీగా, వేగవంతంగా తరలించాలన్న ఉద్దేశంతో రైల్ నెట్ వర్కును విస్తరించాలని సంకల్పించి, రైల్వే మౌలిక సదుపాయాలకు మెరుగులు దిద్దుతున్నారు.
iv. దేశంలో బొగ్గు రవాణా ప్రక్రియను సులభతరంగా మార్చడం కోసం ముఖ్యంగా కోస్తాప్రాంతాల సమీపంలో ఉన్న విద్యుత్తు ప్లాంటులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని బొగ్గు తరలింపునకు రైలుమార్గాలు లేదా రోడ్డు మార్గాలకు తోడు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా రైలు-సముద్రం-రైలు మార్గాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తున్నారు.
బొగ్గు కంపెనీలు మొత్తం 386 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్న 39 ఎఫ్ఎంసీ ప్రాజెక్టులను పూర్తి చేశాయి.
గత రెండు సంవత్సరాల్లో, రైలు-సముద్రం-రైలు మార్గం గుండా బొగ్గు రాకపోకలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 28 మిలియన్ టన్నుల స్థాయిలో ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 54 మిలియన్ టన్నులకు పెరిగాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2118207)
Visitor Counter : 12