సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దక్షిణ భారత చలనచిత్ర సంఘాలతో వర్చువల్ గా సమావేశమైన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్: వేవ్స్
2025లో చేరాలని సాంకేతిక నిపుణులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులకు విజ్ఞప్తి
ప్రధాని శ్రీ మోదీ దార్శనికత కింద మీడియా విభాగాలన్నింటిని ఏకం చేయడమే వేవ్స్ 2025 లక్ష్యం:
దక్షిణ భారతదేశం నుంచి బలమైన ప్రాతినిధ్యం కోసం కేంద్ర సహాయమంత్రి డాక్టర్ మురుగన్ పిలుపు
ప్రముఖ నిర్మాణ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ వేవ్స్ లో దక్షిణ భారత సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా పెవిలియన్ ఏర్పాటు అవసరమన్న డాక్టర్ మురుగన్
Posted On:
02 APR 2025 6:47PM by PIB Hyderabad
తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చలనచిత్ర సంఘాల ప్రతినిధులతో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ రోజు వర్చువల్ సమావేశం నిర్వహించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సంయుక్త కార్యదర్శి (ఐపి) శ్రీ సి సెంథిల్ రాజన్, సంయుక్త కార్యదర్శి (చలనచిత్రాలు) డాక్టర్ ఎం.ఎన్.అజయ్ నాగభూషణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వేవ్స్ 2025 లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ భాగస్వామ్యం
ఈ ఏడాది మే 1 నుంచి 5 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) పురోగతిపై సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో సహా దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నుంచి విస్తృత భాగస్వామ్యం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. అలాగే, ప్రముఖ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో వేవ్స్ ప్రాంగణంలో ప్రత్యేక పెవిలియన్ లేదా బూత్ ఏర్పాటు చేయడంపై కూడా చర్చ జరిగింది.
సృజనాత్మకతలో భారత్ ను అంతర్జాతీయ నాయకత్వ స్థాయిలో నిలబెట్టాలి
ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా అన్ని మీడియా విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని వేవ్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్ మురుగన్ తెలిపారు. సృజనాత్మకత రంగంలో భారత్ ను అంతర్జాతీయ నాయకత్వ స్థాయిలో నిలబెట్టే దిశగా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన పునరుద్ఘాటించారు.
వేవ్స్ 2025 గురించి
ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) మొదటి సదస్సును మీడియా, వినోద రంగాలలో ఒక కొత్త అధ్యాయంగా భారత ప్రభుత్వం 2025 మే 1 నుంచి 4 వరకు మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించనుంది.
ఈ చారిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు ప్రపంచ నాయకులు, మీడియా నిపుణులు, కళాకారులు, విధానకర్తలు, పరిశ్రమ భాగస్వాములను ఏకతాటిపైకి తెస్తుంది. ప్రస్తుత డిజిటల్ యుగం సవాళ్లను, అవకాశాలను కూడా అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్ట్రీమింగ్ లో విప్లవాలు, మేధో సంపత్తి హక్కులు, తప్పుడు సమాచారం, మీడియా సుస్థిరత ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రప్రధమంగా జరుగుతున్న ఈ ప్రత్యేక వేవ్స్ శిఖరాగ్ర సదస్సు సాంస్కృతిక వైవిధ్యాన్ని, నవ్యతను ప్రోత్సహించడం ద్వారా మీడియా వేదికలన్నింటికి సమాన అవకాశాలను అందించి ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఈ సదస్సు డిజిటల్ యుగంలో దేశాలు-దేశాలు, ప్రజలు-ప్రజలు, సంస్కృతులు-సంస్కృతుల మధ్య అతిపెద్ద ఐక్య కారకంగా మీడియా, వినోద పరిశ్రమ పాత్రను మరింత బలపర్చే కీలక అడుగుగా నిలుస్తుంది. ఐక్యతా శక్తిని ముందుంచుతూ, పంచుకోగలిగిన అంశాలు, మానవజాతి ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉమ్మడి అవకాశాలు, సహకార వృద్ధి, పురోగతిపై వేవ్స్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ దృష్టికోణం వేవ్స్ ను సౌహార్దత కోసం ఒక ప్రపంచ వేదికగా నిలబెడుతుంది, సరిహద్దులను దాటి అర్థవంతమైన సంభాషణలకు, కార్యాచరణకు దారితీసేలా చేస్తుంది.
వేవ్స్ 2025ను ముంబయిలో నిర్వహించడం ద్వారా, ఈ శిఖరాగ్ర సమావేశం ఆలోచనాపరులైన నాయకులకు ఒక వేదికను అందిస్తుంది. శరవేగంగా మారుతున్న ప్రపంచంలో మీడియా రంగం ఐక్యతకు అతిపెద్ద ప్రేరణగా ఎలా వ్యవహరించగలదో వారు చర్చిస్తారు. ప్రజలు, సంస్కృతులు, దేశాల మధ్య అంతరాలను పూడ్చడానికి, సాంస్కృతిక దౌత్యానికి ఈ రంగం శక్తిమంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
* * *
(Release ID: 2118092)
Visitor Counter : 9