జౌళి మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: పట్టు పరిశ్రమ అభివృద్ధి
Posted On:
01 APR 2025 10:09AM by PIB Hyderabad
దేశంలో పట్టు పరిశ్రమ సమగ్రాభివృద్ధికి 2021-22 నుంచి 2025-26 వరకు కేంద్ర పట్టు బోర్డు ద్వారా రూ. 4,679.85 కోట్ల వ్యయంతో సిల్క్ సమగ్ర – 2 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఈ పథకం ద్వారా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే ముఖ్యమైన కార్యక్రమాల అమలుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రం రాష్ట్రాలకు అందిస్తుంది. తద్వారా పట్టు సాగుకు ముందు దశలో... కిసాన్ నర్సరీలు, పట్టుపురుగుల పెంపకం ప్యాకేజీలు ( గూళ్ళ పెంపకం, నీటి పారుదల, షెడ్ల నిర్మాణం, చంద్రికలు, వ్యాధి నిరోధక చర్యలతో సహా), పట్టు పురుగుల పెంపకం కేంద్రాల ఏర్పాటుకు ఈ సాయం అందిస్తారు. పట్టు సాగు తదనంతర దశలో.. పట్టు గుడ్ల పెంపకం, రీలింగ్, వడక, నేత, ప్రాసెసింగ్ పరికరాలను సమకూర్చుకోవడం వంటి మౌలిక సదుపాయాలకు అవసరమైన ఆర్థిక సాయం లభిస్తుంది.
సిల్క్ సమగ్ర – 2 పథకం ద్వారా 78,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,075.58 కోట్ల సాయం అందించింది. పట్టు పరిశ్రమ పురోభివృద్ధి దృష్ట్యా సాగుకు ముందు, తర్వాతి దశలకు అవసరమైన పనులు చేపట్టడానికి/సామాగ్రిని సమకూర్చుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
వీటికి తోడు, పట్టు రంగంలో చేపట్టిన పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాల వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగుపడ్డాయి. ఇది పట్టు రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడింది.
రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా, సిల్క్ సమగ్ర -2 పథకం ద్వారా గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.72.50 కోట్లు, తెలంగాణకు రూ.40.66 కోట్ల కేంద్ర సాయం లభించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ముడి సరకుల పంపిణీ పథకం (ఆర్ఎంఎస్ఎస్), జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా అర్హత ఉన్న చేనేత సంస్థలు/కార్మికులకు ముడి సరకు, ఆధునిక మగ్గాలు, ఉపకరణాలు, సోలార్ లైటింగ్ యూనిట్లు, వర్క్ షెడ్ నిర్మాణం, ఉత్పత్తుల వైవిధ్యీకరణ, వినూత్న డిజైన్ల ఆవిష్కరణ, సాంకేతిక, సాధారణ మౌలిక సదుపాయాలు, దేశీయ, విదేశీ మార్కెట్లలో చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ తదితరమైన వాటికి ఆర్థిక సాయం లభిస్తుంది. అలాగే ముద్ర పథకం ద్వారా రాయితీతో రుణాలు, సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. వీటికి అదనంగా చేనేతతో సహా వస్త్ర పరిశ్రమలోని ఇతర విభాగాలకు చెందిన వారికి విస్తృత అవకాశాలను కల్పించేందుకు ప్రదర్శనలు/మేళాలు, ఎగ్జిబిషన్లు, ఎక్స్‌పోల రూపంలో మార్కెటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిని జౌళి మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో సీఎస్‌బీ, జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ), భారతీయ పట్టు ఎగుమతి ప్రోత్సాహక మండలి సహా జౌళి రంగంలోని ఇతర ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు (ఈపీసీ) వీటిని నిర్వహిస్తున్నాయి.
రాజ్యసభలో ఈ రోజు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గరీటా ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
***
(Release ID: 2117245)
Visitor Counter : 21