ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి కేబినెట్ ఆమోదం.. ఎలక్ట్రానిక్స్ సరఫరా శ్రేణిలో భారత్ ను ఆత్మనిర్భరగా నిలపడమే లక్ష్యం
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో భారీగా పెట్టుబడులను (అంతర్జాతీయ/ దేశీయ) ఆకర్షించడం ద్వారా అనుకూల వాతావరణాన్ని నెలకొల్పనున్న పథకం
రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రూ. 4,56,500 కోట్ల విలువైన ఉత్పత్తులు
అదనంగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి
Posted On:
28 MAR 2025 4:09PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.22,919 కోట్ల నిధులతో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సరఫరాలో భారత్ ను ఆత్మనిర్భర్ గా నిలపడమే దీని లక్ష్యం.
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో భారీగా పెట్టుబడులను (అంతర్జాతీయ/దేశీయ) ఆకర్షించడం ద్వారా వాటి తయారీకి అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతోపాటు.. సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించుకుని దేశీయంగా ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడం ద్వారా వాటి విలువను పెంచడం, ఉత్పత్తికి సంబంధించిన ప్రతీ దశలోనూ భారత కంపెనీలను అంతర్జాతీయంగా అనుసంధానించడం ఈ పథకం లక్ష్యం.
ప్రయోజనాలు:
రూ.59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రూ.4,56,500 కోట్ల ఉత్పత్తి సాధించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా కూడా అనేక మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
పథకంలోని ముఖ్యాంశాలు:
i. విడిభాగాల తయారీలోని వివిధ కేటగిరీల్లో, విడిభాగాల కూర్పు (సబ్ అసెంబ్లీ)లో భారతీయ తయారీదారులు ఎదుర్కొంటున్న నిర్దిష్ట అవరోధాలను అధిగమించేలా విభిన్నమైన ప్రోత్సాహకాలను ఈ పథకం అందిస్తుంది. వారి సమస్యల పరిష్కారానికి తగిన విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా వారు సాంకేతిక సామర్థ్యాలను అందిపుచ్చుకోవడంతోపాటు ఆర్థికంగానూ పురోగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం పరిధిలోని విభాగాలు, వాటికి అందించే ప్రోత్సాహకాల స్వభావం కింది విధంగా ఉంటుంది:
క్ర.సం.
|
లక్ష్యిత విభాగాలు
|
ప్రోత్సాహకం రకం
|
A
|
ఉప కర్మాగారాలు
|
1
|
డిస్ప్లే మాడ్యూల్
|
టర్నోవర్ ఆధారిత ప్రోత్సాహకం
|
2
|
కెమెరా పరికరాలు
|
B
|
పూర్తి విడి భాగాలు
|
3
|
ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ల కోసం నాన్ సర్ఫేస్ మౌంట్ డివైజ్ ల విడిభాగాలు
|
టర్నోవర్ ఆధారిత ప్రోత్సాహకం
|
4
|
ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల కోసం ఎలక్ట్రో మెకానికల్స్
|
5
|
మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)
|
6
|
డిజిటల్ అప్లికేషన్ల కోసం లిథియం- అయాన్ ఘటాలు (స్టోరేజీ, మొబిలిటీ మినహా)
|
7
|
మొబైళ్ల కోసం ఎన్ క్లోజర్లు, ఐటీ హార్డ్ వేర్ ఉత్పత్తులు, సంబంధిత పరికరాలు
|
C
|
ఎంపిక చేసిన విడి భాగాలు (సెలెక్టెడ్ బేర్ కాంపొనెంట్స్)
|
8
|
హై-డెన్సిటీ ఇంటర్ కనెక్ట్ (హెచ్ డీఐ)/ మోడిఫైడ్ సెమీ అడిటివ్ ప్రాసెస్ (ఎంఎస్ఏపీ)/ ఫ్లెక్సిబుల్ పీసీబీ
|
మిశ్రమ ప్రోత్సాహకాలు
|
9
|
ఎస్ఎండీ నిష్క్రియాత్మక (ప్యాసివ్) విడిభాగాలు
|
D
|
ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం సరఫరా వ్యవస్థ, ముఖ్యమైన ఉపకరణాలు
|
10
|
సబ్ అసెంబ్లీ తయారీలో ఉపయోగించే భాగాలు/విడిభాగాలు (A), పూర్తి విడిభాగాలు (B) & (C)
|
మూలధన వ్యయ ప్రోత్సాహకం
|
11
|
ఉప విడిభాగాల కూర్పు (సబ్ అసెంబ్లీ), విడిభాగాలు సహా ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగించే ఉత్పాదక వస్తువులు
|
ii. ఈ పథకం వ్యవధి ఆరేళ్లు. ఏడాదిపాటు ప్రాథమిక దశగా పరిగణిస్తారు.
iii. నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా ఉద్యోగాల సంఖ్య ఉన్న పక్షంలో ప్రోత్సాహకాల్లో కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.
నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాణిజ్యం జరుగుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఎలక్ట్రానిక్స్ ఒకటి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ఒక దేశ ఆర్థిక, సాంకేతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో విస్తరించి ఉన్న ఎలక్ట్రానిక్స్ కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యం ఉంది. భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత దశాబ్ద కాలంలో విశేషమైన వృద్ధిని సాధించింది. దేశీయంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 2014-15లో రూ.1.90 లక్షల కోట్ల నుంచి.. 17 శాతం కన్నా ఎక్కువ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2023-24లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు కూడా 2014-15లో రూ.0.38 లక్షల కోట్ల నుంచి.. 20 శాతం కన్నా ఎక్కువ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2023-24లో రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయి.
***
(Release ID: 2116495)
Visitor Counter : 22