హోం మంత్రిత్వ శాఖ
డిజిటల్ అరెస్టు సంఘటనలు
Posted On:
25 MAR 2025 1:41PM by PIB Hyderabad
భారత రాజ్యాంగ ఏడో షెడ్యూలు ప్రకారం పోలీసు, ప్రజారక్షణ రాష్ట్ర అంశం. సైబర్ నేరంతోపాటు డిజిటల్ అరెస్టు కుంభకోణాలు సహా నేరాల నివారణ, పరిశోధన, దర్యాప్తు, విచారణ.. వీటికి పోలీసుల వ్యవస్థల ద్వారా బాధ్యత తీసుకోవాల్సింది ప్రధానంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యక్రమాలకు సలహాలందించడం ద్వారా, రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలుచేసే వేర్వేరు పథకాలకు ఆర్థిక సహాయాన్నివ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అదనపు ఊతాన్నిస్తుంది.
నేరాలకు సంబంధించిన గణాంక సమాచారాన్ని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సేకరించి ‘‘క్రైం ఇన్ ఇండియా’’లో తెలియజేస్తోంది. ఎన్‌సీఆర్‌బీ 2022లో ప్రచురించిన నివేదికే తాజా నివేదిక. అయితే ఎన్‌సీఆర్‌బీ డిజిటల్ అరెస్టులకు సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని విడిగా ఏమీ నిర్వహించడంలేదు.
డిజిటల్ అరెస్టు నేరాలు సహా సైబర్ నేరాలను ఎదుర్కొని పరిష్కరించే యంత్రాంగాన్ని సమగ్రంగా, సమన్వయభరితంగా పటిష్టపరచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలలో ఇతరత్రా అంశాలతోపాటు ఈకింది చర్యలు కలిసి ఉన్నాయి:
i. దేశంలో అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయపూర్వక, సమగ్ర పద్ధతిలో ఎదుర్కొని పరిష్కరించడానికి హోం మంత్రిత్వ శాఖ ‘భారతీయ సైబర్ నేర సమన్వయ కేంద్రం’ (‘ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్’..I4C)ని ఒక అనుబంధ కార్యాలయంగా ఏర్పాటు చేసింది.
ii. డిజిటల్ అరెస్టు నేరాలపై కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో ఇతర అంశాలతో పాటు వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రకటనలు చేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రముఖులచేత సందేశాలను అందించడం, ప్రసార భారతి ద్వారానూ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానూ ప్రచార ఉద్యమాన్ని నిర్వహించడం, ఆకాశవాణిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం, గతేడాది నవంబరు 27న న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో రాహ్‌గిరి కార్యక్రమంలో పాలుపంచుకోవడం వంటి చర్యలను చేపట్టింది.
iii. గౌరవనీయ ప్రధానమంత్రి ‘‘మన్ కీ బాత్’’ కార్యక్రమంలో భాగంగా కిందటి ఏడాది అక్టోబరు 27నాటి ఎపిసోడ్‌లో డిజిటల్ అరెస్టులపై మాట్లాడారు. అలాంటి సందర్భాల్లో ఎలా నడుచుకోవాలో కొన్ని జాగ్రత్తలను దేశ పౌరుల దృష్టికి ఆయన తీసుకువచ్చారు.
iv. టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) I4C సహకారంతో ఒక కాలర్ ట్యూన్ ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టింది. సైబర్ నేరాల విషయంలో చైతన్యాన్ని పెంపొందించడంతోపాటు సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబరు 1930, ‘నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్’ (ఎన్‌సీఆర్‌పీ).. వీటిపై బహుముఖ ప్రచారం నిర్వహించడం ఈ ప్రచార ఉద్యమ ఉద్దేశాలు. ప్రాంతీయ భాషల్లో కూడా ఈ కాలర్ ట్యూనును ప్రసారం చేస్తున్నారు. టెలికాం సేవలను అందిస్తున్న సంస్థలు (టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్.. ‘టీఎస్‌పీస్’) ఒక రోజులో ఏడెనిమిది సార్లు ఈ తరహా కాలర్ ట్యూనును వినిపిస్తున్నాయి.
v. డిజిటల్ అరెస్టు కోసం ఉపయోగించిన 3,962 కన్నా ఎక్కువ స్కైప్ ఐడీలతోపాటు 83,668 వాట్సాప్ ఖాతాలను I4C గుర్తించి వాటిని రద్దు చేసింది.
vi. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్సీబీ, సీబీఐ, ఆర్బీఐ, ఇతర చట్ట అమలు ఏజెన్సీలకు చెందిన వారిమని చెప్పుకొంటూ సైబర్ నేరగాళ్లు ‘బెదిరించి సంపాదించడం’, ‘డిజిటల్ అరెస్టు చేయడం’ వంటి ఘటనల విషయాల్లో అప్రమత్తంగా ఉండండి అని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనను తీసుకువచ్చింది.
vii. భారత్‌లో నుంచే వస్తున్నాయనే అపోహను కల్పిస్తూ భారతీయ మొబైల్ నంబర్లను చూపిస్తూ దేశం బయటి నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను గుర్తించి వాటిని అడ్డగించడానికి ఒక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వంతోపాటు టీఎస్‌పీస్ రూపొందించాయి. ఆ తరహా ఇన్‌కమింగ్ ఇంటర్నేషనల్ స్పూఫ్ కాల్స్‌ను అడ్డుకోవాల్సిందిగా టీఎస్‌పీస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
viii. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 28 వరకు పోలీసు అధికార యంత్రాంగాలు ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం 7.81 లక్షలకు పైగా సిమ్ కార్డులను, 2,08,469 ఐఎంఈఐలను ఆపివేసింది.
ix. అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన, ముఖ్యంగా మహిళలు, పిల్లలపై ఒడిగట్టే నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి వీలుగా ‘జాతీయ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టల్’ (https://cybercrime.gov.in) ను I4Cలో భాగంగా ప్రారంభించారు. ఈ పోర్టల్‌లో నమోదు చేసిన సైబర్ నేరాలు, వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లను నమోదు చేయడం, ఆ తరువాత తీసుకొన్న తదుపరి చర్యలు.. వీటిని చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన చట్ట అమలు ఏజెన్సీలు చూసుకొంటాయి.
x. ఆర్థిక మోసాలు చోటుచేసుకొన్నట్లు వెనువెంటనే తెలియజేయడానికీ, మోసగాళ్లు నిధులను స్వాహా చేయకుండా ఉండడానికీ ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ను I4C పరిధిలో 2021లో ప్రారంభించారు. ఇంతవరకు 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులకు సంబంధించి రూ.4,386 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని విముక్తం చేశారు. సైబర్ ఫిర్యాదులను ఆన్‌లైన్ మాధ్యమంలో దాఖలు చేసే ప్రక్రియలో సాయాన్ని పొందడానికి ‘1930’ అనే సుంకాన్ని చెల్లించనక్కరలేని (టోల్-ఫ్రీ) హెల్ప్‌లైన్ నంబరును ప్రవేశపెట్టారు.
xi. సైబర్ నేరాలపై అవగాహనను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలలో ఇతర అంశాలకు తోడు, ఈ కింది చర్యలు కూడా కలిసి ఉన్నాయి:
• ఎస్ఎమ్ఎస్ మాధ్యమం ద్వారా, I4C సోషల్ మీడియా అకౌంటు ‘ఎక్స్’ (ఇదివరకటి ట్విటర్) (@CyberDost), ఫేస్‌బుక్(CyberDostI4C), ఇన్‌స్టాగ్రామ్ (cyberDostI4C), టెలిగ్రామ్(cyberdosti4c), రేడియో ప్రచార ఉద్యమం ద్వారా.. ఇలా పలు మార్గాలలో సందేశాలను పంపుతున్నారు. • అనేక మాధ్యమాలలో ప్రచారాన్ని నిర్వహించాలంటూ మైగవ్ (MyGov)ను ఆదేశించారు. • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో సైబర్ భద్రత వారం, భద్రత విషయాల్లో చైతన్య వారం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. • కౌమార దశలో ఉన్న వారి కోసం, విద్యార్థుల కోసం చిన్న పుస్తకాలను ప్రచురిస్తున్నారు. • రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయాల్లో, ఇతరత్రా డిజిటల్ బోర్డులలో సూచనలను అందిస్తున్నారు.
ఈ విషయాలను హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2114922)
Visitor Counter : 27