పర్యటక మంత్రిత్వ శాఖ
వివాహ పర్యాటకం
Posted On:
24 MAR 2025 4:05PM by PIB Hyderabad
పెళ్లిళ్లు చేసుకోదలచిన వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తూ పర్యాటక స్థలాలను తీర్చిదిద్దడం సహా.. పర్యాటక స్థలాలను, తత్సంబంధిత ఉత్పాదనలను అభివృద్ధి పరచడానికీ, ప్రోత్సహించడానికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత పాలనాయంత్రాంగాలు చర్యలు తీసుకొంటున్నాయి. భారత్‌లో వెడ్డింగ్ టూరిజం సహా వేర్వేరు పర్యాటక సంబంధ ఉత్పాదనలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత పాలనా యంత్రాంగాలు చేస్తున్న ప్రయత్నాలకు తోడు పర్యాటక మంత్రిత్వ శాఖ కూడా తన వంతు కార్యక్రమాలను చేపడుతోంది.
‘‘ఇండియా సేస్ ఐ డూ’’ పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ప్రారంభించింది. ప్రపంచ వేదికపై భారత్‌ను ఒక ప్రతిష్ఠాత్మక పెళ్లిళ్ల ప్రధాన కేంద్రంగా నిలపాలనేదే ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశం. డిజిటల్ మాధ్యమంలో మార్కెటింగ్ నిర్వహణ, వెబ్సైట్, సామాజిక మాధ్యమాల ఆధారిత ప్రచారం, విశేష ప్రభావాన్ని కలిగించగల ప్రముఖుల సేవలు, ఆన్లైన్ యాక్టివేషన్ల ద్వారా ముందుకు దూసుకుపోవాలనేదే ఈ ప్రచార ఉద్యమం ధ్యేయం.
పర్యాటక మంత్రిత్వ శాఖ.. రాజస్థాన్ ప్రభుత్వ పర్యాటక విభాగం, భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) సహకారంతో 2024 మే 5న జైపూర్‌లో గ్రేట్ ఇండియా ట్రావెల్ బజార్‌తోపాటే ‘వెడ్ ఇన్ ఇండియా’ ఎక్స్‌పోను కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత్‌తోపాటు విదేశాల వెడింగ్ ప్లానర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు, దేశీయ టూర్ ఆపరేటర్లు, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు పాల్గొన్నాయి.
పెళ్లిళ్ల నమోదు ప్రక్రియను వేర్వేరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థానిక పాలనా యంత్రాంగాలు నిర్వహిస్తాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2114474)
Visitor Counter : 34