బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు, లిగ్నైట్ ప్రభుత్వం రంగ సంస్థల ద్వారా గని జలం నిర్వహణ
Posted On:
24 MAR 2025 1:03PM by PIB Hyderabad
గనుల్లో వచ్చే నీటిని వ్యయసాయానికి ఉపయోగించేందుకు- బొగ్గు, లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్ సీఐల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) చర్యలు తీసుకున్నాయి. ఈ నీటిని సాగు, గృహ వినియోగాలతో సహా పారిశ్రామిక, సామాజిక అవసరాల నిమిత్తం ఉపయోగిస్తున్నారు. తద్వారా ఈ తరహా అవసరాలకు భూగర్భ జల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఈ నీరు సాగు, గృహ వినియోగ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్దారించేందుకు గుర్తింపు పొందిన ప్రయోగశాలల ద్వారా క్రమం తప్పకుండా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గని జలాన్ని ఉపయోగించుకోవడంతో సహా భూగర్భ నీటిని పరిరక్షించేందుకు వర్షపు నీటిని నిల్వ చేయడం తదితర చర్యలు అమలు చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2024-25 (ఫిబ్రవరి, 2025 వరకు) నాటికి బొగ్గు, లిగ్నైట్ పీఎస్‌యూలు సుమారుగా 3963 లక్షల కిలో లీటర్ల (ఎల్కేఎల్) గనిజలాన్ని శుద్ధి చేశాయి. ఈ నీటిని గృహ, సాగు అవసరాల కోసం బొగ్గు, లిగ్నైట్ గనుల పరిసర ప్రాంతాల్లోని స్థానిక సమూహాలకు సరఫరా చేశాయి.
గనిజలాన్ని శుద్ధి చేసే మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులను కోల్, లిగ్నైట్ పీఎస్‌యూలు మైనింగ్ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా అందిస్తున్నాయి. పర్యావరణ, మైనింగ్ ప్రాజెక్టుల ఏర్పాటు, నిర్వహణ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం గనుల కార్యకలాపాల్లో నీటి శుద్ధి మౌలిక సదుపాయాలు అంతర్భాగంగా ఉన్నాయి. దీనిలో పారిశ్రామిక వ్యర్థాలను శుభ్రం చేసేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గనిజలాన్ని శుద్ధి చేసేందుకు వడపోత కేంద్రాలు, వ్యర్థాల వడపోతకు అవక్షేప ట్యాంకులు, ఇప్పటికే ఉన్న నీటి శుద్ధి మౌలిక సదుపాయాల నిర్వహణ, ఆధునికీకరణతో పాటుగా వాటి సామర్థ్యాన్ని విస్తరించడం తదితరమైనవి భాగమే.
భానేగావ్ ఓపెన్ కాస్ట్ గనుల నుంచి కాపాఖేడా థర్మల్ విద్యుత్ కేంద్రం వరకు శుద్ధి చేసిన గనుల నీటిని సరఫరా చేసేందుకు వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్), మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య అవాగాహన ఒప్పందం కుదిరింది. తద్వారా గతంలో నీటిపారుదల విభాగం నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఉపయోగించే నీటిని ఇప్పుడు గృహ, సాగు అవసరాలకోసం వినియోగిస్తున్నారు.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా అందించారు.
***
(Release ID: 2114411)