అంతరిక్ష విభాగం
పార్లమెంట్‌లో ప్రశ్న: అంతరిక్ష సాంకేతికత రంగంలో అంకుర సంస్థలకు ఆర్థిక సహాయం
Posted On:
20 MAR 2025 2:52PM by PIB Hyderabad
తొలి దశకు చెందిన అంతరిక్ష సాంకేతికతలను వాణిజ్య సరళిలో అభివృద్ధిపరచే దిశగా భారతీయ పరిశ్రమను, ప్రత్యేకించి అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)ను ప్రోత్సహించడానికి టెక్నాలజీ అడాప్షన్ ఫండ్ (టీఏఎఫ్) ను ఇన్-స్పేస్ (IN-SPACe) ప్రారంభించింది.
ఈ నిధి ఉద్దేశం ఏమిటంటే:
i. వాణిజ్యీకరణ దిశగా ప్రస్తుత అంతరిక్ష సాంకేతికతలను టీఆర్ఎల్-3/4 నుంచి టీఆర్ఎల్ 7/8 (లేదా అంతకన్నా ఎక్కువ) స్థాయి వరకు ఉన్నతీకరించడం.
ii. కొత్త కొత్త ఉత్పాదనలను అభివృద్ధిచేయడం.
iii. భారతీయ పారిశ్రామిక రంగంలో పరిపక్వ స్థితికి చేరని టెక్నాలజీతో ముడిపడ్డ కంపోనంట్ల కోసం దిగుమతులను ఆశ్రయించే కన్నా వాటిని దేశంలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం.
అంకుర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందుకోవడానికి అర్హతగా నిర్ణయించిన ప్రమాణాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
i. అంకుర సంస్థ భారతీయ నిర్వహణలోనిదీ, భారతీయ నియంత్రణలోనిదీ అయి ఉండాలి.
ii. అంకుర సంస్థ ప్రతిపాదన వాణిజ్య విలువతో కూడినదై ఉండాలి.
iii. అంకుర సంస్థ తాను ప్రతిపాదించే ప్రాజెక్టు(ల) కోసం వేరే ఏ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి గాని, లేదా మంత్రిత్వ శాఖల నుంచి గాని ఎలాంటి ధనసహాయాన్ని తీసుకోకూడదు.
భారత్‌ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ భాగాలతో కూడి ఉండే అంతరిక్ష సాంకేతికతలను దిగుమతి చేసుకొనే బదులు దేశంలోనే తయారు చేసుకొనేటట్లు చూడడం ఈ పథకం ఉద్దేశం. స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను పెంచుతూ విశిష్ట అంతరిక్ష సాంకేతికతలను అభివృద్ధిచేయడంలో నిమగ్నమై ఉన్న అంకుర సంస్థలకు మద్దతునివ్వడం కూడా ఈ పథకం ఉద్దేశమే.
ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, భూవిజ్ఞానశాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, అణు ఇంధన విభాగం, అంతరిక్ష విభాగ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2113289)
Visitor Counter : 38