సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: పీఎమ్-అజయ్ స్కీముకు సంబంధించిన కార్యక్రమాలు, విజయాలు
Posted On:
19 MAR 2025 2:14PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎమ్-అజయ్) అనేది కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఒకటి. ఈ పథకాన్ని 2021-22 నుంచి అమలు చేస్తున్నారు. ఈ పథకంలో మూడు భాగాలు ఉన్నాయి. వాటిలో మొదటిది, ‘ఆదర్శ గ్రామం’, రెండోది షెడ్యూల్డు కులం (ఎస్‌సీ) కమ్యూనిటీల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ఉద్దేశించిన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులకు ‘గ్రాంట్స్-ఇన్-ఎయిడ్’, మూడోది వసతిగృహాల (హాస్టల్) సదుపాయాన్ని కల్పించడం.
ఈ పథకం ఉద్దేశాలు, ఈ పథకం పోషించే పాత్ర ఈ కింది విధంగా ఉన్నాయి:
(i) షెడ్యూల్డు కులాల సంఖ్యాధిక్యత ఉన్న పల్లెలలో చాలినన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం, కావలసిన సేవలను సమకూర్చడం ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం.
(ii) నైపుణ్యాలను అభివృద్ధిపరచి, ఆదాయాన్ని ఆర్జించే పథకాలు, ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయావకాశాలను కల్పించి షెడ్యూల్డు కులాలు (ఎస్‌సీ) కమ్యూనిటీలలో పేదరికాన్ని తగ్గించడం.
(iii) మంచి నాణ్యత కలిగిన సంస్థల్లో నివాస సదుపాయాలను తగినంతగా అందుబాటులో ఉంచి పాఠశాలల్లో, ఉన్నత విద్యా సంస్థలలో ఎస్‌సీలు చేరేటట్లు ప్రోత్సహించి అక్షరాస్యతను పెంచడంతోపాటు అవసరమైన చోట్ల ముఖ్యంగా దేశంలో అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాలు, ఎస్‌సీ జనాభా అధికంగా ఉన్న బ్లాకులు, తదితర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా పెంచడం.
2024-25 ఆర్థిక సంవత్సరంలో, 4,928 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు. దీంతో 4,25,821 మందికి ప్రయోజనం కలిగింది. అంతేకాక ఎస్‌సీలది పైచేయిగా ఉన్న గ్రామాలలో సరిపడిన స్థాయిలో మౌలిక సదుపాయాలను, కావలసిన సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో సామాజిక, ఆర్థిక అభివృద్ధి చోటుచేసుకొంది.
నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఆదాయాన్ని ఆర్జించే పథకాలు, ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయావకాశాలను కల్పించి షెడ్యూల్డు కులాలు (ఎస్‌సీ) కమ్యూనిటీలలో పేదరికాన్ని తగ్గించాలన్నది ‘గ్రాంట్స్-ఇన్-ఎయిడ్’ కంపోనంట్ ధ్యేయం. ఈ కంపోనంట్‌లో భాగంగా, 2021-22 మొదలు 9,549 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 2,01,006 మంది ఎస్‌సీ లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా రూ.1,219.80 కోట్ల కేంద్ర సాయాన్ని విడుదల చేశారు.
ఇంతవరకు, పీఎం-అజయ్ లో హాస్టల్ కంపోనంట్‌లో 866 వసతిగృహాలను మంజూరు చేశారు. 69,212 మందికి లబ్ధి చేకూర్చడానికి రూ.936.27 కోట్లు విడుదల చేశారు. దీంతో షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. మంజూరైన మొత్తం వసతిగృహాలలో 96 వసతిగృహాలను నిర్మించే పనులు జరుగుతున్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అఠవాలే ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2112777)
Visitor Counter : 18