ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రూ-9 అంతరిక్ష యాత్రికులకు ప్రధానమంత్రి అభినందనలు


* పట్టుదలతో ఉండడం అంటే సిసలైన అర్థం ఏమిటో సునీతా విలియమ్స్‌ సహా క్రూ9 వ్యోమగాములు మనకు మరో మారు ప్రత్యక్షంగా చూపారు: ప్రధాని

Posted On: 19 MAR 2025 11:31AM by PIB Hyderabad

భారతీయ మూలాలున్న అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్ సహా క్రూ-9 వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రూ-9 రోదసీ యాత్రికుల సాహసాన్ని, దృఢ సంకల్పాన్ని, అంతరిక్ష అన్వేషణకు వారు అందించిన తోడ్పాటును శ్రీ మోదీ ప్రశంసించారు.  

అంతరిక్షాన్ని అన్వేషించడమంటే అది మానవ శక్తియుక్తుల హద్దులను విస్తరించడం, కలలుగనడానికి సాహసించడం, ఆ కలలలను నెరవేర్చుకోగల గుండెధైర్యాన్ని కలిగి ఉండడమే అంటూ శ్రీ మోదీ అభివర్ణించారు. సునీతా విలియమ్స్ ఒక మార్గదర్శి, ఒక స్ఫూర్తిమూర్తి (ఐకాన్), ఆమె ఇదే స్వభావాన్ని తన వృత్తిజీవనంలో చాటి ఆదర్శవంతంగా నిలిచారని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘క్రూ9 (#Crew9), మీకు ఇదే స్వాగతం. ఈ నేల మీద జీవిస్తున్నవారంతా మీరు ఎప్పుడెప్పుడు తిరిగివస్తారా అని ఎదురుచూశారు.

ఇది వారి దృఢత్వానికి, నిర్భయత్వానికి, మనిషిలోని అంతులేని సాహస గుణానికి ఎదురైన ఓ అగ్నిపరీక్ష. అసలు సిసలు ధీరత్వం అంటే ఏమిటో సునీతా విలియమ్స్‌తో పాటు క్రూ9 (#Crew9) వ్యోమగాములు మనకందరికి మరోసారి చాటిచెప్పారు. విశాల విశ్వంలో ఎప్పుడేమి జరుగుతుందో అంతుపట్టని స్థితిలో జంకు అనేదే ఎరుగక, వారు నిశ్చితంగా ఉండడం లక్షల మందికి ఎప్పటికీ ప్రేరణనిస్తూనే ఉంటుంది.

అంతరిక్షంలోకి చేరుకొని కొత్త కొత్త విషయాలను కనుగొనడమంటే అది మనిషి శక్తిసామర్థ్యాల పరిమితులను విస్తరించడం, కలలుగనేందుకు సాహసించడంతోపాటు ఆయా కలలను పండించుకోవడానికి తెగింపును కనబరచడమే. మార్గదర్శి, స్ఫూర్తిమూర్తి అయిన సునీతా విలియమ్స్, తన వృత్తి జీవన మంతటా ఈ స్వభావానికొక నిదర్శనంగా నిలుస్తూవస్తున్నారు.  

వారు అందరూ సురక్షితంగా తిరిగి భూమికి వచ్చేటట్లు జాగ్రత్తచర్యలు తీసుకోవడంలో అలుపెరుగక పాటుపడ్డ వారందరని చూసి మేం చాలా గర్వపడుతున్నాం. వారు ఉద్వేగానికి కచ్చితత్వం తోడయితే, సాంకేతికతకు వజ్రసంకల్పం జతపడితే కాగల కార్యం నెరవేరితీరుతుందని రుజువుచేశారు.

@Astro_Suni
@NASA”

****

MJPS/ST


(Release ID: 2112656) Visitor Counter : 44