రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైల్వేల ఆర్థిక పరిస్థితి బాగుంది, ప్రయాణీకులకు మరిన్ని రాయితీలు ఇస్తున్నాం: కేంద్ర రైల్వే మంత్రి


* రైలులో కి.మీ. ప్రయాణానికయ్యే ఖర్చు రూ.1.38, ప్రయాణీకుల నుంచి 73 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నాం

* ఈ ఏడాది 1,400 లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేశాం, ఇది అమెరికా, ఐరోపాల మొత్తం ఉత్పత్తితో సమానం

* రైల్వేల ద్వారా మార్చి 31 నాటికి 1.6 బిలియన్ టన్నుల సరకు రవాణా పూర్తి చేసి ప్రపంచంలో మూడు అగ్ర దేశాల్లో ఒకటిగా భారత్ మారనుంది

* న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదం లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముఖ్యమైన చర్యలు చేపట్టాం: కేంద్ర రైల్వే మంత్రి

Posted On: 17 MAR 2025 8:28PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై రాజ్యసభలో ఈ రోజు జరిగిన చర్చలో భాగంగా భారతీయ రైల్వేలు సాధిస్తున్న విజయాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరించారు. భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూనే, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయని తెలిపారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్‌లో రైల్వే ఛార్జీలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో ఈ ధరలు 10 నుంచి 20 రెట్లు అధికంగా ఉన్నాయన్నారు.

రైలు ప్రయాణీకులకు అందిస్తున్న రాయితీ గురించి వివరిస్తూ, ప్రస్తుతం ఒక కి.మీ. దూరం రైలులో ప్రయాణించడానికి అయ్యే ఖర్చు రూ.1.38గా ఉంటే ప్రయాణీకుల నుంచి 73 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నామని, అంటే ప్రయాణీకులకు 47 శాతం రాయితీ లభిస్తోందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకులకు అందించిన మొత్తం రాయితీ విలువ రూ. 57,000 కోట్లు. ఈ మొత్తం 2023-24 నాటికి రూ. 60,000 కోట్లకు (అంచనా) చేరుకుంది. తక్కువ ధరల్లో సురక్షితమైన, మెరుగైన సేవలు అందించాలన్నదే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

రైల్వేల విద్యుద్దీకరణ వల్ల జరిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ, ప్రయాణీకుల సంఖ్య, సరకు రవాణా పెరుగుతున్నప్పటికీ ఇంధన వ్యయం స్థిరంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. 2025 నాటికి ‘స్కోప్ 1 నెట్ జీరో’, 2030 నాటికి ‘స్కోప్ 2 నెట్ జీరో’ లక్ష్యాలను సాధించేందుకు రైల్వేలు కృషి చేస్తున్నాయి. బీహార్‌లోని మాధేపుర కర్మాగారంలో తయారయ్యే లోకోమోటివ్‌ల ఎగుమతులు త్వరలోనే ప్రారంభవుతాయని అన్నారు. మొజాంబిక్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు ప్యాసింజర్ కోచ్‌లు, మొజాంబిక్, సెనెగల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు లోకోమోటివ్‌లను భారతీయ రైల్వే ఎగుమతి చేస్తోంది. వీటితో పాటుగా, బోగీ అండర్ ఫ్రేములు  యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతుండగా, చోదక భాగాలు ఫ్రాన్స్, మెక్సికో, జర్మనీ, స్పెయిన్, రొమేనియా, ఇటలీకి పంపిస్తున్నారు.

ఈ ఏడాది 1,400 లోకోమోటివ్‌లు భారత్‌లో తయారయ్యాయి. ఇది అమెరికా, ఐరోపాల మొత్తం ఉత్పత్తి కంటే ఎక్కువ. దీనితో పాటు అదనంగా 2 లక్షల కొత్త వ్యాగన్లను రైల్వేల్లో చేర్చారు. మార్చి 31తో పూర్తయ్యే ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు 1.6 బిలియన్ టన్నుల సరకు రవాణా చేస్తాయని, తద్వారా ఈ అంశంలో చైనా, అమెరికాతో కలసి ప్రపంచంలోని మూడు అగ్ర దేశాల్లో ఒకటిగా భారత్ నిలువనుందని తెలిపారు. పెరుగుతున్న రైల్వేల సామర్థ్యానికి, రవాణా రంగంలో దాని ముఖ్యమైన పాత్రకు ఇది నిదర్శనమని అన్నారు.

రైల్వేల్లో భద్రత గురించి మాట్లాడుతూ, 41,000 ఎల్‌హెచ్‌బీ కోచులను సిద్ధం చేశామని, అన్ని ఐసీఎఫ్ కోచులను ఎల్‌హెచ్‌బీ కోచులుగా మారుస్తామని కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. రైలు పట్టాలు, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, పొగమంచు వల్ల ఎదురయ్యే ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే పరికరాలు, కవచ్ వ్యవస్థలను త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో రైల్వేలకు రూ. 25,000 కోట్ల ఆర్థిక సాయం మాత్రమే లభించేదని, ఇప్పుడది రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుందన్న శ్రీ వైష్ణవ్ తద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని వివరించారు. ఈ అంశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్వల్ప దూరాలకు ఏసీ, నాన్ ఏసీ ప్రయాణాన్ని అందించే 50 నమో భారత్ రైళ్లు తయారవుతున్నాయని తెలిపారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని కేంద్ర రైల్వే మంత్రి సభకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, డేటా మొత్తాన్ని భద్రపరిచామని, 300 మందితో మాట్లాడి వాస్తవాలను పరిశీలిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

నిరుపేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. అందుకే ఏసీ కోచులతో పోలిస్తే సాధారణ కోచుల సంఖ్య 2.5 రెట్లు పెంచుతున్నామని తెలిపారు. ప్రస్తుత ఉత్పత్తి ప్రణాళిక ప్రకారం 17,000 నాన్ ఏసీ కోచులను తయారు చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే భారతీయ రైల్వేల ఆర్థిక పరిస్థితి బాగుందని, అభివృద్ధి కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. కొవిడ్ సంక్షోభానికి సంబంధించిన సవాళ్లను రైల్వేలు విజయవంతంగా అధిగమించాయి. రైల్వేల్లో ప్రయాణీకుల సంఖ్యతో పాటు సరకు రవాణా కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రైల్వేల ఆదాయం రూ. 2.78 లక్షల కోట్లు, ఖర్చులు రూ. 2.75 లక్షల కోట్లు. అన్ని ప్రధాన ఖర్చులను తన ఆదాయం నుంచే భరిస్తోంది. రైల్వేల మెరుగైన పనితీరు వల్లే ఇది సాధ్యమైంది.

రాజ్యసభలో తన ప్రసంగాన్ని ముగిస్తూ.. భవిష్యత్తులో రైల్వేలు మరింత ఆధునికమైన, భద్రమైన, పర్యావరణహిత రవాణా వ్యవస్థగా మారుతుందని శ్రీ వైష్ణవ్ హామీ ఇచ్చారు.

 

***


(Release ID: 2112281) Visitor Counter : 7