ప్రధాన మంత్రి కార్యాలయం
పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
* భారతదేశంలో మతపరమైన ఆచారాలు నిత్య జీవితంతో పెనవేసుకుని ఉంటాయన్న ప్రధాని
*ఉపవాసం ఆలోచనల పదును పెంచి, కొత్త దృక్పథాలను, విలక్షణమైన యోచనలను ప్రేరేపిస్తుందన్న ప్రధానమంత్రి
* సవాళ్ళు జీవితంలో భాగమైనప్పటికీ లక్ష్యాన్ని ప్రభావితం చేయరాదు: ప్రధానమంత్రి
* అనేకమంది స్వాతంత్ర్య సమర యోధుల పోరు గట్టి ప్రభావాన్ని చూపినప్పటికీ, సత్యం ఆధారంగా మహాత్మాగాంధీ చేపట్టిన మహోద్యమం దేశాన్ని జాగృతం చేసింది: ప్రధాని
* సఫాయీ కార్మికులు, ఉపాధ్యాయులు, నేత పనివారు, ఆరోగ్య కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరినీ స్వాతంత్ర్య పోరులో భాగమయ్యేలా చేసిన గాంధీజీ నాయకత్వ తీరు అసామాన్యమైనది: ప్రధానమంత్రి
* నేను ప్రపంచ నేతలతో కరచాలనం చేసినప్పుడు, ఆ చేయి కలుపుతున్నది మోదీ కాదు, 140 కోట్ల భారతీయులన్నది గుర్తెరగాలి : ప్రధాని
* మేం శాంతి గురించి మాట్లాడితే, ప్రపంచం శ్రద్ధగా ఆలకిస్తుంది.. మా ఘన సంస్కృతి, చరిత్రలే అందుకు కారణం: ప్రధానమంత్రి
* విభిన్న నేపథ్యాలు, ప్రాంతాల ప్రజలను ఏకం చేసే సామర్థ్యం క్రీడల సొంతం: శ్రీ మోదీ
* ప్రపంచ శాంతి సుస్థిరతల కోసం భారత్, చైనాల మధ్య సహకారం అత్యవసరం: ప్రధాని
* కృత్రిమ మేధ
Posted On:
16 MAR 2025 10:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.
ఉపవాస సమయంలో ఇంద్రియాలన్నీ చురుకుగా మారతాయని, దాంతో పరిసరాల పట్ల అవగాహన పెరుగుతుందని చెబుతూ, ఆ సమయంలో సున్నితమైన వాసనలను కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతామని చెప్పారు. ఉపవాసం ఆలోచనల పదును పెంచి, కొత్త దృక్పథాలను, విలక్షణమైన యోచనలను ప్రేరేపిస్తుందని చెప్పారు. ఉపవాసం అంటే కేవలం ఆహారానికి దూరంగా ఉండటమే కాదని, శాస్త్రీయ విధానమనీ, శరీరంలోని విషాలను బయటకు పంపే ప్రక్రియ అని చెప్పారు. ఉపవాసం చేపట్టే కొద్దిరోజుల ముందు నిర్దిష్టమైన ఆయుర్వేద, యోగా పద్ధతులను పాటించడం ద్వారా తన శరీరాన్ని సిద్ధం చేసుకుంటానని, ఆ సమయంలో నీరు అధికంగా తాగడం ద్వారా శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకుంటానని శ్రీ మోదీ వెల్లడించారు. తదనంతరం మొదలుపెట్టే ఉపవాసాన్ని భక్తి, క్రమశిక్షణలకు అంకితమయ్యే సమయంగా భావిస్తానని, లోతైన చింతనకు, సంపూర్ణమైన దృష్టి కేంద్రీకరణకు వెచ్చిస్తానని చెప్పారు. తాను పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటన వల్ల, మహాత్మా గాంధీ ఉద్యమం వల్ల ఉపవాసాలను అలవాటు చేసుకున్నానని శ్రీ మోదీ వెల్లడించారు. తొలిసారి ఉపవాసం చేసినప్పుడు శక్తి, అవగాహనలు పెరిగిన భావన కలిగిందని, దాంతో ఈ ప్రక్రియ వల్ల పరివార్తనాత్మక శక్తి అనుభవంలోకి వచ్చిందని చెప్పారు. ఉపవాసం తనని మందకొడిగా చేసే బదులు తనలో వేగాన్ని, చురుకునీ, సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. దీక్ష సమయంలో తన ఆలోచనలు వేగంగా సాగుతాయని చెబుతూ ఉపవాసాన్ని మెరుగైన సృజన ద్వారా తన భావనలను పంచుకునే దివ్యమైన అవకాశంగా భావిస్తానని ప్రధాని అన్నారు.
ఉపవాసాలు, కొన్నిసార్లు తొమ్మిది రోజుల పాటు కొనసాగే దీర్ఘ ఉపవాసాలతో ప్రపంచ వేదికపై నాయకుడిగా తన పాత్రను ఎలా నిర్వర్తించగలుగుతారని అడిగినప్పుడు, శ్రీ మోదీ ప్రాచీన భారతీయ సంప్రదాయమైన చాతుర్మాస దీక్ష గురించి ప్రస్తావించారు. వర్షాకాలంలో జీర్ణక్రియ సహజంగానే మందగిస్తుందని, ఆ సమయంలో చాలా మంది భారతీయులు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసే విధానాన్ని అనుసరిస్తారని వ్యాఖ్యానించారు. ఈ సంప్రదాయం జూన్ మధ్యలో ప్రారంభమై నవంబర్‌లో దీపావళి తర్వాత వరకూ – అంటే, దాదాపు నాలుగు నుండి నాలుగున్నర నెలల వరకు కొనసాగుతుందని చెప్పారు. సెప్టెంబర్ లేదా అక్టోబరులో నిర్వహించే దసరా పండుగ సమయంలో, శక్తి, భక్తి క్రమశిక్షణకు మారుపేరైన నవరాత్రి పర్వదినాల తొమ్మిది రోజుల పాటూ తాను ఎటువంటి ఆహారాన్ని స్వీకరించనని, కేవలం వేడి నీటిని మాత్రమే తాగుతానని చెప్పారు. ఇక మార్చి, ఏప్రిల్ మాసాల్లోని చైత్ర నవరాత్రిళ్ళలో రోజుకో పండుని మాత్రమే భుజించే విలక్షణమైన ఉపవాసాన్ని పాటిస్తానని చెప్పారు. ఉదాహరణకు, బొప్పాయిని ఎంచుకుంటే, మొత్తం ఉపవాస కాలంలో బొప్పాయి మాత్రమే తింటానని చెప్పారు. ఈ ఉపవాస పద్ధతులు తన జీవితంలో అంతర్భాగమయ్యాయని, 50 - 55 సంవత్సరాలుగా వీటిని అనుసరిస్తున్నానని శ్రీ మోదీ తెలియజేశారు.
తన ఉపవాస పద్ధతుల గురించి మొదట్లో ఎవరికీ పెద్దగా తెలిసేది కాదని, తాను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులను స్వీకరించిన తరువాత వీటి గురించి ఇతరులకు తెలియడం మొదలయ్యిందని వ్యాఖ్యానించారు. తాను పాటించే పద్ధతులు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండవచ్చు కాబట్టి, ఇతరుల శ్రేయస్సు కోసం పనిచేయాలన్న తన ఆశయనికి అనుగుణంగా ఉంది కాబట్టి తన అనుభవాలను గురించి పంచుకోవడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రధాని పేర్కొన్నారు. ఉపవాస దీక్ష చేస్తున్న సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామాతో వైట్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా జరిగిన ఒక ఉదాహరణను శ్రీ మోదీ పంచుకున్నారు.
జీవితపు తొలి రోజుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఉత్తర గుజరాత్, మెహసానా జిల్లా వడ్ నగర్ లో తాను జన్మించానని, ఆ ప్రాంతపు చారిత్రక ప్రాముఖ్యం గురించి వివరించారు. వడ్ నగర్ చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ వంటి వారిని ఆకర్షించిన బౌద్ధ క్షేత్రమని, 1400 కాలంలో ప్రముఖ బౌద్ధ విద్యాకేంద్రంగా విలసిల్లిందని చెప్పారు. తన బాల్యంలో వడ్ నగర్లో బౌద్ధ, జైన, హిందూ సంస్కృతులు ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా మనుగడ సాగించాయని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. తన ఊరి చరిత్ర పుస్తకాలకు పరిమితమవలేదని, వడ్ నగర్లోని ప్రతి గోడ, ప్రతి రాయీ ఒక కథ చెప్పేదని నెమరువేసుకున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పురావస్తు తవ్వకాలను పెద్దయెత్తున ప్రోత్సహించానని, నగరం మనుగడ కొనసాగించింది అనేందుకు గుర్తుగా 2,800 సంవత్సరాల నాటి చారిత్రక ఆధారాలు ఆ తవ్వకాలలో బయటపడ్డాయని చెప్పారు. ఈ ఆధారాల వల్ల తదనంతరం అక్కడ అంతర్జాతీయ-స్థాయి మ్యూజియం ఏర్పాటయ్యిందని, ముఖ్యంగా పురావస్తు విభాగానికి చెందిన విద్యార్థులకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉందని చెప్పారు. ఘనమైన చారిత్రక ప్రాముఖ్యమున్న ప్రాంతంలో పుట్టడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. కిటికీలు కూడా లేని చిన్న ఇంట్లో తమ నిరుపేద కుటుంబం నివసించేదని, అయితే ఇతరులతో పోల్చుకునే అవకాశం లేకపోవడంతో పేదరికం ఎన్నడూ బాధించలేదని బాల్యపు జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ తండ్రి క్రమశిక్షణ కల్గిన కష్టజీవిగా, సమయపాలన పాటించేవారిగా గుర్తింపు పొందారని చెప్పారు. తన తల్లి ఎంతో శ్రమించేదని, ఇతరుల పట్ల ఎంతో ప్రేమ కనపరచేదని, ఇతరుల పట్ల సానుభూతి, సేవాభావాన్ని తల్లి వద్ద నుంచే నేర్చుకున్నానని చెప్పారు. రోజూ ఉదయాన్నే పిల్లలందరినీ ఒక చోటికి చేర్చి వారికి సాంప్రదాయికంగా వస్తున్న చిట్కాలతో చికిత్స చేసేదని, ఈ అనుభవాలన్నీ తనకు విలువలని తెలియజెప్పాయని, తన వ్యక్తిత్వాన్ని మలచాయని చెప్పారు. రాజకీయ ప్రవేశం తన నిరుపేద మూలాలను వెలుగులోకి తెచ్చిందని, తాను ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న సమయంలో జరిగిన మీడియా కవరేజీ ప్రజలకు తన నేపథ్యాన్ని పరిచయం చేసిందని చెప్పారు. తన జీవితానుభవాలను అదృష్టకరమనుకున్నా, దురదృష్టకరమైనదనుకున్నా, అవి బహిర్గతమై ప్రజలకు తన గురించి తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
యువతకు ఇచ్చే సందేశం గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, యువత ఓపిక, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, సవాళ్ళు జీవితంలో భాగమైనప్పటికీ అవి వ్యక్తి లక్ష్యాన్ని ప్రభావితం చేయరాదని చెప్పారు. కష్టాలు సహనానికి పరీక్షలని, అవి మనిషిని ఓడించడానికి కాక, బలోపేతం చేయడం కోసం ఎదురావుతాయని అంటూ ప్రతి సంక్షోభం అభివృద్ధికి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. జీవితంలో దగ్గరి దోవలు పనిచేయవని చెబుతూ రైల్వేట్రాక్‌ల ఉదాహరణతో విపులీకరించారు. పట్టాలు దాటవద్దంటూ రైల్వే స్టేషన్లలో కనపడే హెచ్చరికలను ఉటంకిస్తూ, "షార్ట్‌కట్స్ విల్ కట్ యూ షార్ట్" – షార్ట్ కట్లు మిమ్మల్ని అర్థాంతరంగా ఆపేస్తాయి అని వివరించారు. విజయం సాధించడంలో సహనం, పట్టుదల ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూ ప్రతి బాధ్యతనూ మనఃస్ఫూర్తిగా చేపట్టాలని, ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని అభిరుచితో గడపాలని ఉద్బోధించారు. సమృద్ధి మాత్రమే విజయానికి హామీ ఇవ్వదని, వనరులు ఉన్నవారు కూడా ప్రతిరోజూ ఎదుగుతూ, సమాజ సంక్షేమానికి దోహదపడాలి కాబట్టి, వ్యక్తిగత ఎదుగుదల జీవితాంతం అవసరమని, నేర్చుకోవడం ఎప్పటికీ ఆపరాదని చెప్పారు. తన తండ్రి టీ దుకాణంలో పని చేసేటప్పుడు ఇతరులతో మసలే పద్ధతిని నేర్చుకున్నానని, నిరంతర అభ్యాసం, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం ఎంత కీలకమో అర్ధం చేసుకున్నానని చెప్పారు. చాలా మంది ప్రజలు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని, అవి విఫలమైనప్పుడు నిరాశకు గురవుతారని అంటూ, ఏదో ఒక గుర్తింపు కోసం పాకులాడకుండా ఏదైనా పనిని గొప్పగా చేయడంపైనే దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. ఇటువంటి దృక్కోణం నిరంతర సాధన, లక్ష్యాల వైపు పురోగమించడంలో సహాయపడుతుందన్నారు. మనకు దక్కేదానికన్నా ఇతరులకు ఇవ్వడంలోనే సిసలైన తృప్తి ఉంటుందని, యువత పరులకు సహాయం, సేవలపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.
ఆయనను హిమాలయాలకు వెళ్లడాన్ని గురించి అడిగినప్పుడు, శ్రీ మోదీ ఒక చిన్న పట్టణంలో తాను పెరిగిన సంగతిని తెలిపారు. అక్కడ సమష్టి జీవనానికి పెద్దపీట వేశారన్నారు. తాను తరచు స్థానిక గ్రంథాలయానికి వెళ్లేవాడినని, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి వారిని గురించి పుస్తకాలలో చదివి ప్రేరణను పొందేవాడినన్నారు. ఇది తన జీవనాన్ని కూడా అదే ప్రకారంగా మలచుకోవాలన్న అభిలాషను కలిగించిందనీ, తాను తన శారీరక పరిమితులు, మనోనిబ్బరం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఆరుబయట చల్లని వాతావరణంలో పడుకునేవాడిననీ చెప్పారు. స్వామి వివేకానంద బోధనలు తనపై కలగజేసిన ప్రభావాన్ని ఆయన వివరించారు. అనారోగ్యం పాలబడ్డ తన తల్లికి సహాయం చేయాల్సిన అవసరం వివేకానందకు ఉన్నప్పటికీ ధ్యాన సమయంలో కాళీమాతను ఏమయినా అడగడానికీ నోరు కదపలేక పోయిన అనుభవాన్ని గురించి శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అనుభూతే తరువాత తరువాత వివేకానందునిలో ఎదుటి వారికి ఇవ్వాలన్న భావనకు అంకురార్పణ చేసింది. ఈ ఘట్టం తనను ప్రభావితుడిని చేసిందని శ్రీ మోదీ అన్నారు. సిసలైన సంతృప్తి అనేది ఇవ్వడం నుంచి, ఇతరులకు సేవ చేయడం నుంచే కలుగుతుందని స్పష్టం చేశారు. కుటుంబంలో పెళ్లి జరిగిన వేళ, తాను ఒక సాధువు బాగోగులు చూసుకోవడానికి వెనుకపట్టునే ఉండిపోవాలని నిర్ణయించుకొన్న సందర్భాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ ఘటన ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల మొదట్లో తాను ఎలా మొగ్గిందీ చెబుతోంది. సైనికులు తన ఊరికి రావడం చూసినప్పుడు దేశానికి సేవ చేయాలన్న ప్రేరణ తనలో కలిగిందని, అయితే ఆ సమయంలో అందుకు ఏం చేయాలో తనకు స్పష్టంగా తెలియలేదన్నారు. జీవనానికి అర్థం ఏమిటో కనుక్కోవాలన్న ప్రగాఢ కోర్కె తనకు కలిగి, దీనిని అన్వేషించడానికి తాను... యాత్రను మొదలుపెట్టానని ప్రధాని చెప్పారు. స్వామి ఆత్మస్థానందజీ వంటి సాధువులతో సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకోవడాన్ని, ఆ స్వామీజీయే సమాజ సేవ ప్రాముఖ్యాన్ని గురించి తనకు చెప్పి, మార్గదర్శనం చేశారన్నారు. మిషన్‌లో తాను గడిపిన కాలంలో, ప్రముఖ సాధువులతో భేటీ అయినట్లు, వారు వారి ప్రేమను, ఆశీస్సులను తనపై కురిపించినట్లు శ్రీ మోదీ చెప్పారు. హిమాలయాలలో ఉండగా లభించిన ఏకాంతం, తాపసులతో తాను మాట్లాడడం.. ఇవి తనను తాను తీర్చిదిద్దుకోవడానికి, తన అంతర్గత శక్తిని తాను గుర్తించడానికి తోడ్పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. వ్యక్తిగతంగా తాను ఎదగడంలో ధ్యానం, సేవ, భక్తి.. వీటి పాత్ర ఎంతో ఉందన్నారు.
రామకృష్ణ మిషన్‌లో స్వామి ఆత్మస్థానందజీతో తనకు ఎదురైన అనుభవాన్ని శ్రీ మోదీ పంచుకొంటూ, దీని కారణంగానే తాను ప్రతి స్థాయిలో సేవే ప్రధానమైన జీవనాన్ని గడపాలని నిర్ణయించుకొన్నానన్నారు. ఇతరులు తననను ప్రధానిగానో, లేదా ముఖ్యమంత్రిగానో చూస్తే చూడవచ్చు కానీ తాను ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానన్నారు. తన అంతర్గత స్థిరత్వం ఇతరులకు సేవ చేయడంలో ఇమిడి ఉందని, అది పిల్లలను సంరక్షించడంలో మాతృమూర్తికి సాయపడే రూపంలో కావచ్చు, లేదా హిమాలయాల్లో సంచరించడం కావచ్చు, లేదా తన ప్రస్తుత బాధ్యతాయుత పదవిలో పనిచేయడం కావచ్చు.. వీటి అన్నింటిలోనూ అది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. తన దృష్టిలో, ఒక సాధువుకు ఒక నేతకు మధ్య ఎలాంటి వాస్తవమైన వ్యత్యాసం లేదని, ఎందుకంటే ఈ రెండు పాత్రలకు సమానమైన విలువల మార్గదర్శనం లభిస్తుందన్నారు. దుస్తులు, చేసే పని వంటి బయటకు కనిపించే దృష్టికోణాలు మారితే మారవచ్చు గాని సేవ చేయాలన్న అంకితభావం మాత్రం మారదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి బాధ్యతను తాను శాంతంగా, ఏకాగ్రతతో, అంకితభావంతో నెరవేరుస్తానని ఆయన చెప్పారు.
తొలి రోజుల్లో తనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చూపిన ప్రభావాన్ని చర్చిస్తూ, దేశభక్తిపూరిత గేయాలంటే తనకు చిన్నప్పటి నుంచీ ఎంతో మక్కువ ఉండేదని, ముఖ్యంగా మకోషి అనే అతను ఒక డప్పు తీసుకుని తమ ఊరికి వచ్చి పాడే పాటలు తనకు బాగా నచ్చేవన్నారు. ఆ పాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, అవే తరువాత తరువాత ఆర్ఎస్ఎస్‌తో తాను అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో అవి ప్రభావాన్ని చూపించాయని ఆయన అన్నారు. ఏ పనిని అయినా సరే.. అది చదువుకోవడం, లేదా వ్యాయామం చేయడం, లేదా దేశం కోసం పాటుపడడం.. ఇలా ఏదయినా, ఒక ప్రయోజనం ఉండే పని చేయాలనే కీలక విలువల్ని తనలో పాదుగొల్పింది ఆర్ఎస్ఎస్ అని ఆయన వివరించారు. జీవనంలో ఒక పరమార్థంతో ముందుకు సాగడానికి ఆర్ఎస్ఎస్ ఒక స్పష్టమైన దిశను అందిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడం అంటే అది దైవానికి సేవ చేయడంతో సమానం అని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవానికి చేరువ అవుతోందని, ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ స్వయంసేవకులున్న భారీ సంస్థ అని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణగా నిలవడంతో, అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.. ఉదాహరణకు సేవా భారతి మురికివాడల్లో, 1,25,000కు పైచిలుకు సేవాపథకాలను ప్రభుత్వ సహాయం లేకుండానే నడుపుతోందని శ్రీ మోదీ వెల్లడించారు. వన్‌వాసీ కల్యాణ్ ఆశ్రమ్ గిరిజన ప్రాంతాల్లో 70,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలను ఏర్పాటు చేసిందని కూడా శ్రీ మోదీ చెప్పారు. విద్యాభారతి సుమారు 25,000 పాఠశాలలను నిర్వహిస్తూ 30 లక్షలమంది విద్యార్థులకు చదువు చెబుతోందని తెలిపారు. విద్యకు, విలువలకు ఆర్ఎస్ఎస్ పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు నేల విడచి సాముచేయకుండా, సమాజానికో గుదిబండలా మారకుండా ఉండటానికి నైపుణ్యాలను నేర్చుకొనేటట్లు శ్రద్ధ తీసుకొంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో సభ్యులు ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ సాంప్రదాయక కార్మిక ఉద్యమాలకు భిన్నంగా ‘‘కార్మికులు ప్రపంచాన్ని ఏకం చేయాల’’నే విషయంపై దృష్టిని సారించి, ఒక విశిష్ట దృక్పథాన్ని అవలంబిస్తోందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి తాను పొందిన జీవన విలువలు, ప్రయోజనాలతోపాటు స్వామి ఆత్మస్థానంద వంటి సాధువుల నుంచి అందుకొన్న ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికిగాను ప్రధాని తన కృతజ్ఞతలను తెలియజేశారు.
భారత్ గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ భారత్‌కంటూ ఒక సాంస్కృతిక గుర్తింపు ఉందని, భారత్ నాగరికత వేల సంవత్సరాల నాటిదన్నారు. వందకు పైగా భాషలు, వేల కొద్దీ మాండలికాలతో విలసిల్లుతున్న భారత్ సువిశాలత్వాన్ని ఆయన ప్రధానంగా చాటిచెబుతూ, ప్రతి ఇరవై మైళ్లకు భాష, ఆచారాలు, వంట పద్ధతులు, వస్త్రధారణ మారిపోతూ ఉంటాయని, ఇంతటి వైవిధ్యం నెలకొన్నప్పటికీ ఈ దేశాన్ని ఒక ఉమ్మడి బంధం కలిపి ఉంచుతోందన్నారు. భగవాన్ రాముని కథలు భారత్ నలుమూలల ప్రతిధ్వనిస్తుంటాయి, భగవాన్ రాముని ప్రేరణతో ప్రతి ప్రాంతంలోనూ వ్యక్తులకు పేర్లు పెట్టుకోవడాన్ని గమనించవచ్చన్నారు. గుజరాత్‌లో రాంభాయి అని ఉంటే, తమిళ నాడులో రామచంద్రన్ అని, మహారాష్ట్రలో రాం భావూ అనే పేరు చలామణిలో ఉంటాయని వివరించారు. ఈ అద్వితీయ సాంస్కృతిక బంధమే ఇండియాను ఒకే నాగరికతగా పెనవేస్తోందని ఆయన అభివర్ణించారు. స్నానమాచరించే సమయంలో, దేశంలో అన్ని నదుల పేర్లను స్మరించుకొనే ఆచారమంటూ ఉందని, ప్రజలు ఆ వేళ గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరీ అంటూ నదుల నామాలను ఉచ్చరిస్తారన్నారు. భారతీయ సంప్రదాయాల్లో ఈ ఏకత్వ భావన లోతుగా పాతుకుపోయిందని, ముఖ్య కార్యక్రమాలు, అనుష్ఠానాలలో చెప్పుకొనే సంకల్పాలలో ఈ భావన ప్రతిబింబిస్తూ ఉంటుందని ఆయన అన్నారు. వీటిని చారిత్రక రికార్డుల్లా కూడా భావించవచ్చన్నారు. జంబూద్వీపం మొదలు కులదేవత పేరు చెప్పుకొనేదాకా కార్యక్రమాలలో విశ్వమంతటికీ ఆహ్వానం పలికే సంప్రదాయాలకు భారతీయ ధార్మిక గ్రంథాలు అత్యంత సావధానపూర్వకంగా మార్గదర్శనం వహిస్తూ వచ్చాయని, ఈ ఆచారాలు సజీవంగా నిలిచి నేటీకీ వీటిని దేశంలో నిత్యం ఆచరిస్తున్నాన్నారు. పశ్చిమ, ప్రపంచ నమూనాలు దేశాలను పరిపాలన వ్యవస్థలుగానే చూస్తుంటే, భారత్‌లో ఏకత్వం దాని సాంస్కృతిక బంధాలలో ఒక దండగా రూపుదాల్చిందన్నారు. భారత్‌లో చరిత్ర పొడవునా విభిన్న పాలక వ్యవస్థలంటూ మనుగడ సాగించాయని, కానీ దీని ఏకత్వం సాంస్కృతిక సంప్రదాయాల మాధ్యమం ద్వారా చెక్కుచెదరకుండా ఉందన్నారు. భారతదేశం ఏకత్వాన్ని నిలబెట్టడంలో తీర్థయాత్ర సంప్రదాయాలు పోషించిన పాత్ర ఎంతో ఉందని కూడా శ్రీ మోదీ స్పష్టం చేశారు. శంకరాచార్యులు నాలుగు తీర్థ స్థలాలను నెలకొల్పారని ప్రధాని పేర్కొన్నారు. నేటికీ లక్షల మంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు. రామేశ్వరం నుంచి కాశీకి, కాశీ నుంచి రామేశ్వరానికి జలాన్ని తీసుకువస్తుంటారని తెలిపారు. భారతదేశ క్యాలెండర్‌ను చూస్తే చాలు... దేశంలో విభిన్న సంప్రదాయాలు ఎంత సమృద్ధంగా ఉన్నదీ తెలిసిపోతుందని ఆయన అన్నారు.
గాంధీ మహాత్ముని వారసత్వం, స్వాతంత్ర్యం కోసం భారత్ పోరాడిన తీరును ప్రధానమంత్రి చర్చిస్తూ- మహాత్మాగాంధీ మాదిరిగా- తాను గుజరాత్‌లో పుట్టానని, తన మాతృభాష కూడా గుజరాతీయేనని వివరించారు. గాంధీకి ఒక న్యాయవాదిగా విదేశాల్లో అవకాశాలకు కొదవ లేకపోయినప్పటికీ, కర్తవ్య పరాయణత్వం, కుటుంబ విలువల పట్ల మక్కువ.. ఇవి ఆయనకు మార్గదర్శనం చేయగా ఆయన తన జీవనాన్ని భారతదేశ ప్రజలకు సేవ చేయడానికే అంకితం చేయాలని సంకల్పించుకొన్నారని శ్రీ మోదీ అన్నారు. గాంధీ సిద్ధాంతాలు, చేతలు ఈ నాటికీ భారత్‌లో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛత ముఖ్యమని గాంధీ చెబుతూ వచ్చారు... ఆయన దీనిని స్వయంగా ఆచరించి చూపెట్టారు. అంతేకాదు ఆయన పాల్గొన్న చర్చలలో కూడా స్వచ్ఛతకు ప్రాధాన్యాన్ని ఇచ్చారని శ్రీ మోదీ అన్నారు. భారత్ స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం కోసం దీర్ఘకాలం పోరాడిందని, ఆ కాలంలో వలసవాద పాలన వందల సంవత్సరాల తరబడి కొనసాగినా స్వాతంత్ర్య జ్వాల దేశవ్యాప్తంగా ఉజ్వలంగా మండుతూ వచ్చిందన్నారు. లక్షల కొద్దీ జనం వారి ప్రాణాలను త్యాగం చేశారు. జైళ్లలో మగ్గారు. అమరత్వాన్ని పొందారనీ శ్రీ మోదీ గుర్తు చేశారు. అనేక మంది స్వాతంత్ర్యయోధులు శాశ్వత ప్రభావాన్ని కలగజేసినా, మహాత్మాగాంధీ సత్యంపై ఆధారపడ్డ ఒక భారీ జనాందోళనకు సారథ్యం వహించి జాతిని మేల్కొలిపారని శ్రీ మోదీ చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తినీ స్వాతంత్స్య సమరంలో పాలుపంచుకొనేటట్లు చేయగలిగిన దక్షత గాంధీలో ఉంది.. వీధిని ఊడ్చి శుభ్రపరిచే పారిశుధ్య కార్మికులు మొదలు ఉపాధ్యాయులు, నేతకారులు, సంరక్షకులు.. ఇలా ప్రతి సాధారణ పౌరులను స్వాతంత్ర్య సాధన కోసం సైనికులుగా గాంధీ మార్చివేశారు. అలా ఒక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మించారు. బ్రిటిషు వారు దీనిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దండి సత్యాగ్రహానికున్న ప్రాధాన్యం ఎంతటిదో.. ఒక చిటికెడు ఉప్పు ఎలా మహోద్ధృత విప్లవ జ్వాలను రగిలించివేసిందో ఆయన వివరించారు. కొల్లాయి కట్టుకొని రౌండ్‌టేబుల్ సమావేశానికి గాంధీ వెళ్లి బకింగ్‌హామ్ రాజమహలులో కింగ్ జార్జ్‌తో భేటీ అయిన ఉదంతాన్ని ప్రధానమంత్రి పంచుకొన్నారు. ‘‘మీ రాజు మన ఇద్దరికీ సరిపోయేటంత దుస్తులను ధరించి ఉన్నారు’’ అంటూ గాంధీ జీ సమయస్ఫూర్తిగా మాట్లాడి, తన హాస్య చతురతను వెల్లడించారని ప్రధాని అన్నారు. అంతా ఐకమత్యంతో ఉండాలని, ప్రజలకున్న శక్తిని చాటాలని గాంధీ పిలుపునివ్వడాన్ని గురించి శ్రీ మోదీ చెబుతూ, ఈ నినాదం ఈనాటికీ మార్మోగుతూనే ఉందన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ సామాన్య మానవుడిని భాగస్వామిని చేయాలని, పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడి ఉండటానికి బదులు సామాజిక మార్పును ప్రోత్సహించాలనే తన స్వీయ నిబద్ధతను ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నేటి కాలమాన పరిస్థితుల్లోనూ మహాత్మా గాంధీ ఔచిత్యాన్ని ప్రస్తావిస్తూ- ఆయన వారసత్వం కాలాన్ని జయించిందని శ్రీ మోదీ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తన కర్తవ్య నిబద్ధతను గుర్తుచేస్తూ- తన ధైర్యం తన పేరుతో కాకుండా 140 కోట్ల మంది దేశవాసుల మద్దతు, అనాదిగా వస్తున్న వేల ఏళ్ల సంస్కృతి-వారసత్వాలతో ముడిపడి ఉన్నదని వివరించారు. “నేనొక ప్రపంచ నాయకుడితో కరచాలనం చేస్తున్నానంటే, అది మోదీ ఒక్కడు కాదు... 140 కోట్ల మంది భారతీయులు చేయి కలుపుతున్నారని అర్థం” అని సవినయంగా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2013లో తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పుడు తలెత్తిన విస్తృత విమర్శలను గుర్తుచేస్తూ- భారత విదేశాంగ విధానం, ప్రపంచ భౌగోళిక-రాజకీయ స్థితిగతులపై తన అవగాహనను వారు ప్రశ్నించారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆ సమయంలో తన స్పందనను వివరిస్తూ- “భారత్ తనను చిన్నచూపు చూడటాన్ని ఎన్నడూ అనుమతించదు... ఎవరినీ ఎప్పుడూ చిన్నచూపు చూడదు. ఇతర ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తుంది” అని చెప్పానన్నారు. ఈ విశ్వాసమే తన విదేశాంగ విధానానికి కీలకమని పునరుద్ఘాటిస్తూ- దేశమే సదా ప్రధానమని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, సౌభ్రాత్రాలకు భారత్ ప్రాధాన్యం ‘వసుధైవ కుటుంబకం’ అనే దృక్పథంలో అనాదిగా వేళ్లూనుకున్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పునరుత్పాదక ఇంధనం దిశగా “ఒకే సూర్యుడు-ఒక ప్రపంచం-ఒక గ్రిడ్” సహా సకల జీవజాలానికీ వర్తించే “ఒకే ప్రపంచం-ఒకే ఆరోగ్యం” వంటి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దాకా అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాల్లో భారత్ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ సౌభాగ్యం ఇనుమడింపజేయాల్సిన బాధ్యతను స్పష్టం చేస్తూ, ఈ దిశగా అంతర్జాతీయ సమాజం సమష్టి కృషికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇక “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” నినాదంతో భారత్ జి-20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ- భారత ప్రాచీన విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. నేటి ప్రపంచ పరస్పర సంధాన స్వభావాన్ని వివరిస్తూ- “నేడు ఏ దేశమూ ఒంటరిగా ముందంజ వేయజాలదు... మనమంతా పరస్పరం ఆధారపడి ఉన్నాం” అన్నారు. ఆ మేరకు అంతర్జాతీయ కార్యక్రమాల పురోగమనంతోపాటు సమకాలీకరణ-సహకారం ఆవశ్యకతను స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థల ఔచిత్యాన్ని కూడా ప్రస్తావిస్తూ- కాలానుగుణ పరిణామ వైఫల్యం ఫలితంగా ప్రపంచంపై వాటి ప్రభావం అంతర్జాతీయంగా చర్చకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన మార్గాన్వేషణపై శ్రీ మోదీ మాట్లాడుతూ- బుద్ధుడు, మహాత్మా గాంధీలకు జన్మనిచ్చిన భరతభూమికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని గుర్తుచేశారు. ఆ మహనీయుల బోధనలు, కార్యాచరణ పూర్తిగా శాంతికి అంకితమయ్యాయని గుర్తుచేశారు. బలమైన సాంస్కృతిక-చారిత్రక నేపథ్యంగల భారత్ శాంతి గురించి మాట్లాడితే ప్రపంచం తప్పక వింటుందని ఆయన స్పష్టం చేశారు. భారతీయులు ఎన్నడూ సంఘర్షణను కోరుకోరని, సామరస్యాన్ని సమర్థించే శాంతి ప్రియులని పేర్కొన్నారు. తదనుగుణంగా సాధ్యమైన ప్రతి సందర్భంలోనూ శాంతి స్థాపన బాధ్యతను చిత్తశుద్ధితో స్వీకరిస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ రెండు దేశాలతో తనకుగల సన్నిహిత సంబంధాలను ప్రధానమంత్రి గుర్తుచేస్తూ- యుద్ధానికిది సమయం కాదని స్పష్టం చేయడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి కృషి చేయగలనన్నారు. అదేవిధంగా... సమస్యలకు పరిష్కారాలు యుద్ధభూమిలో కాకుండా చర్చల ద్వారా సాధ్యం కాగలవని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కూడా నచ్చజెప్పగలనని పేర్కొన్నారు. చర్చలు సఫలం కావాలంటే ఉభయ పక్షాలూ అందులో భాగస్వాములు కావాలని, ఉక్రెయిన్-రష్యాల మధ్య అర్థవంతమైన చర్చలకు ప్రస్తుతం అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఈ రెండు దేశాల సంఘర్షణ పర్యవసానంగా ఆహారం, ఇంధనం, ఎరువుల వంటి రంగాల్లో తలెత్తిన సంక్షోభం వర్ధమాన దేశాలపై దుష్ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అందుకే ఘర్షణ వల్ల తలెత్తే కష్టనష్టాలను స్పష్టం చేస్తూ శాంతి సాధనకు అంతర్జాతీయ సమాజం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు “నేను తటస్థంగా లేను... నాకొక విస్పష్ట వైఖరి ఉంది- అదే శాంతి... ఆ శాంతి స్థాపనకు శాయశక్తులా కృషి చేస్తున్నాను” అని పునరుద్ఘాటించారు.
భారత్-పాక్ సంబంధాల అంశాన్ని ప్రస్తావిస్తూ- దేశ విభజన సందర్భంగా 1947నాటి బాధాకర వాస్తవికతను వివరించారు. ఆనాటి హింస, రక్తపాతం, విషాదాలను కళ్లకు కడుతూ- పాక్ నుంచి క్షతగాత్రులు, శవాలు నిండిన రైళ్లు రావడం వంటి బీభత్స దృశ్యాలను గుర్తుచేశారు. సామరస్యపూర్వక సహజీవనాన్నే భారత్ సదా అభిలషిస్తున్నా, పాక్ మాత్రం ప్రచ్ఛన్న యుద్ధంతో శత్రుమార్గాన్నే ఎంచుకున్నదని విచారం వ్యక్తం చేశారు. రక్తపాతం, ఉగ్రవాదం కేంద్రకంగా పెరుగుతున్న భావజాలం ప్రయోజనమేమిటని ప్రధానమంత్రి ప్రశ్నించారు. ఉగ్రవాదం భారత్‌కు మాత్రమేగాక, యావత్ ప్రపంచానికీ ముప్పేనని స్పష్టం చేశారు. ఉగ్రవాద మూలాలు తరచూ పాక్ వైపే దారితీస్తాయని, అక్కడ ఆశ్రయం పొందిన ఒసామా బిన్ లాడెన్ ఉదంతాన్ని ఉటంకిస్తూ- పాకిస్తాన్ కల్లోల కేంద్రంగా మారిందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను ఇకనైనా విడిచిపెట్టాలని హితవు పలికారు. “మీ దేశాన్ని అరాచక శక్తులకు ఆలవాలం చేసి మీరు సాధించేదేమిటి?” అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన లాహోర్ పర్యటన, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి పాక్‌ను ఆహ్వానించడం వంటి తన శాంతికాముక కృషిని శ్రీ మోదీ గుర్తుచేశారు. మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ జ్ఞాపకాల్లో పేర్కొన్నట్టుగా, శాంతిసామరస్యాలపై భారత్ నిబద్ధతకు ఈ దౌత్యపరమైన చర్యలే నిదర్శనమని స్పష్టం చేశారు. కానీ, ఈ కృషికి బదులుగా మనకు లభించింది శత్రుత్వం, వంచన మాత్రమేని ప్రధాని వ్యాఖ్యానించారు.
క్రీడల ఏకీకరణ శక్తి గురించి స్పష్టం చేస్తూ- ప్రజానీకం మధ్య విస్తృత అనుసంధానానికి దోహదం చేయడమేగాక ప్రపంచాన్ని శక్తిమంతం చేయగలవని శ్రీ మోదీ అన్నారు. “మానవాళి పరిణామంలో క్రీడలకు కీలక పాత్ర ఉంది. అవి కేవలం ఆటలు కాదు... అవి దేశాల మధ్య, ప్రజల మధ్య ఐక్యభావనను ప్రోదిచేస్తాయి” అన్నారు. తనకు క్రీడా నైపుణ్యం లేనప్పటికీ, ఇటీవలి భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ఫలితం వంటివి క్రీడల ప్రాధాన్యాన్ని చాటిచెబుతాయన్నారు. భారత్‌ల ఫుట్‌బాల్ సంస్కృతి కూడా వేళ్లూనుకున్నదని ప్రస్తావిస్తూ, మన మహిళల అద్భుత ప్రతిభా నైపుణ్యాలను కొనియాడటంతోపాటు పురుషుల జట్టు పురోగమనాన్ని కూడా ఆయన ప్రశంసించారు. గతకాలపు అనుభవాలను నెమరువేసుకుంటూ- 1980ల తరానికి మారడోనా ఒక హీరో కాగా, నేటి తరానికి లయోనల్ మెస్సీ ఆరాధ్యుడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని గిరిజన జిల్లా షాడోల్‌కు వెళ్లినప్పటి అనుభవం తనకెంతో చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు. అక్కడి ప్రజలకు ఫుట్‌బాల్ క్రీడతో అవినాభావ సంబంధం ఉందని, ఓ గ్రామం యువ ఆటగాళ్లు తమ ఊరిని “మినీ బ్రెజిల్” అని సగర్వంగా చాటుకున్నారని ఆయన గుర్తుచేశారు. నాలుగు తరాల ఫుట్‌బాల్ సంప్రదాయం, దాదాపు 80 మంది జాతీయస్థాయి ఆటగాళ్ల ప్రతిభాపాటవాలతో ఆ గ్రామానికి అంతటి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. వారు ఏటా నిర్వహించే ఫుట్‌బాల్ పోటీలకు సమీప గ్రామాల నుంచి 20-25,000 వేల మంది ప్రేక్షకులు వెల్లువెత్తడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేశంలో ఫుట్‌బాల్పై మక్కువ ఆశావహ రీతిలో పెరుగుతున్నదని, ఇదెంతో ఉత్సాహభరిత క్రీడ మాత్రమేగాక వాస్తవిక జట్టు స్ఫూర్తికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ డొనాల్డ్ ట్రంప్ గురించి అడిగినప్పుడు- హ్యూస్టన్‌లో నిర్వహించిన “హౌడీ మోడీ” సభను, ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ప్రసంగించడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ వినమ్రతను ప్రస్తావిస్తూ- తన ప్రసంగ సమయంలో ప్రేక్షకులలో కూర్చోవడాన్ని... తర్వాత స్టేడియంలో తనతో నడుస్తూ ప్రజలకు అభివాదం చేయడాన్ని, పరస్పర విశ్వాసం-బలమైన స్నేహబంధం ప్రదర్శించిన తీరును ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ధైర్యం-నిర్ణయాత్మకతలను వివరిస్తూ- ఓ ప్రచార కార్యక్రమంలో తనపై కాల్పుల తర్వాత కూడా ఆయన పుంజుకున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వైట్ హౌస్‌కు తన తొలి సందర్శనను శ్రీ మోదీ ఉటంకిస్తూ- అధ్యక్షుడు ట్రంప్ అక్కడి విధివిధానాలకు భిన్నంగా స్వయంగా తనకు భవనమంతా చూపించారని చెప్పారు. అలాగే తమ దేశ చరిత్రపై ట్రంప్ అవగాహన, గౌరవం అపారమన్నారు. లిఖితపూర్వక సమాచారం, సహాయకుల తోడ్పాటు వంటివేవీ లేకుండా మునుపటి అధ్యక్షుల విశేషాలను, కీలక ఘట్టాలను ఆయన ఏకరవు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇక ట్రంప్ పదవిలో లేని సమయంలోనూ తమ మధ్య బలమైన విశ్వాసం, సంబంధాలు చెక్కుచెదరలేదని గుర్తుచేశారు. అధ్యక్షుడు ట్రంప్ తననొక గొప్ప సంధానకర్తగా అభివర్ణించడం ఆయన హుందాతనాన్ని, వినమ్రతను చాటాయని ప్రధానమంత్రి అన్నారు. ఏ చర్చల్లోనైనా భారత్ ప్రయోజనాలకు మాత్రమే తాను సదా ప్రాధాన్యమిస్తానని చెప్పారు. అవతలి పక్షం మనోభావాలకు ఎలాంటి భంగం కలగకుండా సానుకూల రీతిలో తన వాదన వినిపించడం తన నైజమన్నారు. ఈ దేశమే తనకు అధిష్ఠానమని, భారతీయులు తనకప్పగించిన బాధ్యతను శిరసావహిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్, తులసి గబ్బర్డ్, వివేక్ రామస్వామి, జె.డి.వాన్స్ వంటి వ్యక్తులతో తన ఫలవంతమైన సమావేశాలను ఉటంకించారు. ఈ సందర్భంగా వెల్లివిరిసిన సౌహార్దతను, కుటుంబ వాతావరణాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ఎలాన్ మస్క్‌తో తన చిరకాల పరిచయాన్ని వివరించారు. ‘డోజ్’ కార్యక్రమంపై మస్క్ ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ- భారత ప్రధానిగా 2014లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాలనలో లోపాలను, హానికర విధానాలను తొలగించే దిశగా తాను చేసిన కృషి కూడా ఇలాంటిదేనని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల నుంచి 10 కోట్ల మందికిపైగా అనర్హుల ఏరివేతతో భారీగా ప్రజాధనం ఆదా కావడం వంటి పాలన సంస్కరణలను ప్రధాని ఉదాహరించారు. పారదర్శకతకు భరోసా ఇస్తూ, దళారీ వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) విధానం ప్రవేశపెట్టడంతో దాదాపు రూ.3 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ‘జిఇఎం’ పోర్టల్‌ను ప్రారంభించడంతో వ్యయం తగ్గడంతోపాటు నాణ్యత మెరుగుపడిందని గుర్తుచేశారు. అంతేగాక 40,000దాకా అనవసర నిబంధనలను తొలగించడమే కాకుండా కాలం చెల్లిన 1,500 పాత చట్టాల రద్దుతో పాలనను క్రమబద్ధీకరించామని తెలిపారు. నేడు ‘డోజ్’ వంటి వినూత్న వ్యవస్థ ప్రపంచాన్ని ఆకర్షించిన రీతిలోనే తాను చేపట్టిన సాహసోపేత మార్పుచేర్పులు భారత్‌ను అంతర్జాతీయ చర్చలకు కేంద్రంగా మార్చాయని ఆయన అన్నారు.
భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావించగా- పరస్పర అనుభవాల నుంచి పాఠాలు స్వీకరించడం, ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడటంలో రెండు దేశాలకుగల ఉమ్మడి చరిత్రను ప్రధాని ఉటంకించారు. ఒకనాడు ప్రపంచ ‘జిడిపి’ 50 శాతం వాటా భారత్-చైనాలదేనని, ఈ విషయంలో రెండు దేశాలు పోషించిన పాత్రకు ఇది నిదర్శనమని చెప్పారు. భారత్‌లో పుట్టిన బౌద్ధం చైనాపై విస్తృత ప్రభావం చూపడాన్ని ప్రస్తావిస్తూ- లోతైన సాంస్కృతిక సంబంధాలకు ఇదే రుజువని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు, బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు మధ్య వాదసంవాదాలు సహజమే అయినా, అవి వివాదాలుగా ముదరకుండా నిరోధించాల్సిన అవసరం ఎంతయినా ఉందని పునరుద్ఘాటించారు. “ఉభయతారక ప్రయోజనాల కోసం సుస్థిర, సహకారాత్మక బంధం ఏర్పరచుకోవడంలో చర్చలు అత్యంత కీలకం” అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రస్తుత సరిహద్దు వివాదాలను ప్రస్తావిస్తూ- 2020లో ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇటీవలి తన సమావేశం సరిహద్దులో సాధారణ స్థితిగతులు నెలకొనేందుకు దోహదం చేసిందన్నారు. తదనుగుణంగా 2020 మునుపటి పరిస్థితుల పునరుద్ధరణ కృషి కొనసాగుతున్నదని చెప్పారు. దీంతో పరస్పర విశ్వాసం, ఉత్సాహం, ఉత్తేజం క్రమంగా మెరుగవుతున్నాయని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రపంచ స్థిరత్వం, శ్రేయస్సుకు భారత్-చైనా మధ్య సహకారం అవశ్యమని, ఘర్షణకన్నా ఆరోగ్యకర పోటీయే ఉత్తమమని స్పష్టం చేశారు.
ప్రపంచ ఉద్రిక్తతలను, కోవిడ్-19 నుంచి నేర్చుకున్న పాఠాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రతి దేశానికిగల పరిమితులు తేటతెల్లం కావడమేగాక ఐక్యత అవసరాన్ని ఈ పరిణామాలు విస్పష్టం చేశాయని చెప్పారు. శాంతి వైపు పయనించే బదులు ప్రపంచం మరింత విచ్ఛిన్నం వైపు సాగిందని, ఫలితంగా పరిస్థితులు అనిశ్చితికి, సంఘర్షణల తీవ్రతకు దారితీశాయని వ్యాఖ్యానించారు. సంస్కరణలు ప్రవేశపెట్టకపోవడం, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన వల్ల ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వ్యవస్థల ఔచిత్యమే సందిగ్ధంలో పడిందని ఆయన వివరించారు. మనం ముందడుగు వేయాలంటే అభివృద్ధి ఆధారిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లడమే మార్గమని స్పష్టం చేస్తూ, సంఘర్షణ నుంచి సహకారంవైపు మళ్లాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. పరస్పర అనుసంధానిత-పరస్పర ఆధారిత ప్రపంచంలో విస్తరణవాదం పనికిరాదని ఆయన పునరుద్ఘాటించారు, దేశాల మధ్య పరస్పర మద్దతు ఆవశ్యకతను వివరిస్తూ- నేటి సంఘర్షణలపై ప్రపంచ వేదికల ద్వారా వెల్లడైన తీవ్ర ఆందోళనను ప్రస్తావిస్తూ, శాంతి పునరుద్ధరణపై ఆశాభావం వెలిబుచ్చారు.
గుజరాత్‌లో 2002నాటి అల్లర్ల అంశంపై మాట్లాడుతూ- ఆనాటి కల్లోల వాతావరణం గురించి శ్రీ మోదీ సమగ్రంగా వివరించారు. ఆనాడు కాందహార్ హైజాక్, ఎర్రకోటపై దాడి, 9/11 ఉగ్రవాద దాడులు వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ సంక్షోభాలను గుర్తుచేశారు. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానెదుర్కొన్న ఉద్రిక్త వాతావరణం, సవాళ్లను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా వినాశకర భూకంపం అనంతరం పునరావాసం-సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ, విషాదకరమైన గోధ్రా అనంతర సంఘటనల తర్వాతి పరిస్థితులను చక్కదిద్దడం వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే 2002నాటి అల్లర్లపై అపోహలను ప్రధాని ప్రస్తావించారు, తన పదవీకాలానికి ముందు గుజరాత్‌కు మత హింస సంబంధిత సుదీర్ఘ చరిత్ర ఉందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనను పూర్తి నిర్దోషిగా తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. అయితే, 2002 నుంచి ఇప్పటికి 22 ఏళ్లుగా రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నదని పేర్కొన్నారు. సర్వజన ప్రగతికి పాటుపడుతూ సకలజన విశ్వాసం పొందాలనే పాలన విధానమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. విమర్శల గురించి చెబుతూ- “విమర్శలే ప్రజాస్వామ్యానికి ఆత్మ” అన్నారు. అయితే వాస్తవిక, నిర్దిష్ట సాక్ష్యసహిత విమర్శ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. ఇది మెరుగైన విధాన రూపకల్పనకు దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే, నిరాధార ఆరోపణల వెల్లువపై ఆందోళన వ్యక్తం చేస్తూ- నిర్మాణాత్మక విమర్శలకు ఇది భిన్నమని స్పష్టం చేశారు. “ఆరోపణల వల్ల అనవసర వివాదాలు తలెత్తడమే తప్ప ఎవరికీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు” అన్నారు. ఇక పాత్రికేయ బాధ్యతలలో సమతుల విధానానుసరణే తన దృక్పథమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. జర్నలిజాన్ని తేనెటీగతో పోలుస్తూ- లోగడ ఓ సందర్భంలో తాను చెప్పినట్లు అవి తేనెను సేకరించి మాధుర్యాన్ని పంచేవే అయినా, అవసరమైతే శక్తిమంతమైన కాటుతో తగురీతిన శిక్షించగలవని వ్యాఖ్యానించారు. కానీ, దీనికి భిన్నంగా నేటి జర్నలిజం తనకు నచ్చినవాటికి మాత్రమే ప్రాచుర్యం ఇస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. సంచలనాత్మకను మించి సత్యం, నిర్మాణాత్మక ప్రభావంపై దృష్టి సారించడం ఎంతయినా అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.
రాజకీయాలలో తన విస్తృతమైన అనుభవం గురించి ప్రస్తావిస్తూ, ప్రారంభదశలో సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణ, ప్రచార వ్యూహాలను రూపొందించడంపై దృష్టి సారించడాన్ని శ్రీ మోదీ వివరించారు. గత 24 సంవత్సరాలుగా, గుజరాత్ ప్రజలు, భారతదేశ ప్రజలు తనపై విశ్వాసం ఉంచారని, ఈ పవిత్ర కర్తవ్యాన్ని అప్రమత్తతతో, అచంచల అంకితభావంతో నిర్వహించడానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. కులం, మతం, విశ్వాసం, సంపద లేదా భావజాలం ఆధారంగా వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి పౌరుడికి చేరేలా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నమ్మకాన్ని పెంపొందించడమే తన పాలనా నమూనాకు కీలకమని పేర్కొన్నారు. పథకాల ద్వారా ప్రత్యక్షంగా లబ్ది పొందని వారిలో కూడా భవిష్యత్తులో అవకాశాలు పొందగలమన్న నమూనాను పెంపొందించామని ఆయన చెప్పారు. “మా పరిపాలన ఎన్నికల ఆధారితమైనది కాదు... ప్రజా ఆధారితమైనది. ఇది పౌరుల కోసం, దేశ శ్రేయస్సు కోసం అంకితమైనది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశాన్ని, ప్రజలను దైవస్వరూపంగా భావిస్తూ, వారికి భక్తితో సేవ చేసే అర్చకుడిగా తనను తాను పోల్చుకుంటానని ఆయన తెలిపారు. తనకు ఎలాంటి స్వప్రయోజనాలు, రాగద్వేషాలు లేవని ప్రస్తావిస్తూ, తన పదవిని అడ్డం పెట్టుకొని లాభపడే మిత్రులు, బంధువులు ఎవరూ లేరని ప్రధాని తెలిపారు. ఈ లక్షణం సాధారణ ప్రజలకు దగ్గర చేయడంతో పాటు విశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉండటం తనకు గర్వంగా ఉందని ప్రధాని అన్నారు. ఈ ఘనత అంకితభావంతో అహర్నిశలు పనిచేసే లక్షలాదిమంది కార్యకర్తలదేనని ఆయన ప్రశంసించారు. భారతదేశ సంక్షేమానికి, దాని ప్రజల సంక్షేమానికి అంకితమైన ఈ కార్యకర్తలకు రాజకీయాలలో ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని, వారి నిస్వార్థ సేవకు విశేషమైన గుర్తింపు పొందారని ఆయన అన్నారు. . తమ పార్టీపై ఉన్న నమ్మకం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలిస్తోందని, దీనికి ప్రజల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలను ఉదాహరణగా పేర్కొంటూ, భారతదేశంలో ఎన్నికల నిర్వహణలో ఉన్న ఉన్నతమయిన ప్రామాణీకాలను ప్రధాని ప్రస్తావించారు. దేశంలో 98 కోట్ల మంది ఓటర్లున్నారని, ఇది ఉత్తర అమెరికా, యూరోపియన్ యూనియన్ జనాభాను కలిపినంత కంటే ఎక్కువ అని అన్నారు. వీరిలో 64.6 కోట్ల మంది ఎండ వేడిని సైతం తట్టుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. భారత్ లో పది లక్షలకు పైగా పోలింగ్ బూత్ లు, 2,500కు పైగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్య స్థాయిని తెలియజేస్తోందని అన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, చేరుకోవడం కష్టంగా ఉండే ప్రాంతాలకు కూడా పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం పట్ల భారత్ నిబద్ధతకు నిదర్శనంగా గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ లో కేవలం ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం వంటి విశేషాలను ఆయన పంచుకున్నారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం ప్రపంచస్థాయి కొలమానాన్ని నెలకొల్పిందని ప్రధాని కొనియాడారు. భారతీయ ఎన్నికల నిర్వహణను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఒక కేస్ స్టడీగా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఎందుకంటే ఇందులో అసాధారణమైన రాజకీయ అవగాహన, ప్రామాణీకాలపరంగా అత్యున్నత స్థాయి సమర్థత ఉందని చెప్పారు.
తన నాయకత్వం గురించి చెబుతూ, ప్రధానమంత్రిగా కాకుండా “ప్రధాన సేవకుడిగా” గుర్తింపు పొందడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు, ‘సేవే తన పనిసూత్రం' అని ఆయన అన్నారు. అధికారాన్ని కోరుకోవడం కంటే ఉత్పాదకత, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడమే తన లక్ష్యమని, పేర్కొన్నారు. “నేను రాజకీయాల్లోకి అధికార క్రీడలు ఆడడానికి రాలేదు, సేవ చేసేందుకు వచ్చాను” అని అన్నారు.
ఒంటరితనంపై మాట్లాడుతూ, తనకు ఎప్పుడూ ఒంటరి భావన ఉండదని ప్రధానమంత్రి తెలిపారు. “వన్ ప్లస్ వన్” అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని, అది తనను, పరమాత్మను సూచిస్తుందని అన్నారు. దేశానికి, ప్రజలకు సేవ చేయడం అంటే దైవసేవ చేయడమేనని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో, తాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పరిపాలనా నమూనాకు రూపకల్పన చేయడంలో నిమగ్నమయ్యాయని ప్రధాన మంత్రి తెలిపారు. అలాగే, పార్టీలో 70 ఏళ్ల వయసు పైబడిన కార్యకర్తలతో వ్యక్తిగతంగా సంబంధాలు కొనసాగిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, పాత జ్ఞాపకాలను మళ్లీ తలుచుకున్నానని ఆయన పేర్కొన్నారు.
కష్టపడి పనిచేయడం వెనుక రహస్యం ఏమిటని అడిగినప్పుడు, రైతులు, సైనికులు, కూలీలు, కుటుంబం కోసం నిరంతరం శ్రమించే తల్లుల నుంచి తనకు కష్టపడి పనిచేసే ప్రేరణ లభిస్తుందని శ్రీ మోదీ తెలిపారు. "నేను ఎలా నిద్రపోగలను? ఎలా విశ్రాంతి తీసుకోవగలను? ప్రేరణ నా కన్నుల ముందే ఉంది” అని ఆయన పేర్కొన్నారు. తనపై ప్రజలు ఉంచిన బాధ్యతలు తాను అత్యుత్తమంగా పనిచేయడానికి ప్రేరేపిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం శ్రమించడంలో ఎప్పుడూ వెనుకబడనని, దురుద్దేశాలతో వ్యవహరించనని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదీ చేయనని 2014 ఎన్నికల ప్రచార సమయంలో తాను చేసిన వాగ్దానాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాధినేతగా తన 24 ఏళ్ల పొడవునా ఈ ప్రమాణాలను నిలబెట్టానని ఆయన పునరుద్ఘాటించారు. 140 కోట్ల మందికి సేవ చేయడం, వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవడం, వారి అవసరాలను తీర్చడం ద్వారా తాను స్ఫూర్తి పొందానని ప్రధాని పేర్కొన్నారు. “నేను ఎప్పుడూ వీలైనంత ఎక్కువ చేయడానికి, ఎక్కువగా కష్టపడేందుకు సంకల్పబద్ధుడిని. ఇప్పటికీ ఇదే సంకల్ప శక్తితో ముందుకు సాగుతున్నాను” అన్నారు.
అన్ని కాలాల్లోనూ గొప్ప గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరిగా పేరొందిన శ్రీనివాస రామానుజన్ పట్ల తనకున్న ప్రగాఢ గౌరవాన్ని వ్యక్తం చేసిన శ్రీ మోదీ, రామానుజన్ జీవితం, రచనలు సైన్స్ కు, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న లోతైన అనుసంధానాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. రామానుజన్ తన గణిత సంబంధిత ఆలోచనలను తాను పూజించిన దేవత ప్రేరణగా అందించినట్టు నమ్మేవారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచనలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ నుండి ఉద్భవిస్తాయని అన్నారు. “ క్రమశిక్షణ అనేది కేవలం కష్టపడటమే కాదు, ఒక పనికి పూర్తిగా అంకితమవడం, దానిలో పూర్తిగా లీనమైపోయి, తుదకు మీరే ఆ పనిగా మారిపోవడం” అని ఆయన పేర్కొన్నారు. విభిన్న విజ్ఞాన మార్గాల పట్ల విశాల దృక్పథంతో ఉండే గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ, అటువంటి ఆలోచనాపరమైన విస్తృతి కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని ఆయన తెలిపారు. సమాచారం, విజ్ఞానం మధ్య ఉన్న తేడాను వివరిస్తూ, “కొంతమంది సమాచారాన్ని విజ్ఞానం అనుకుంటారు. అది నిజం కాదు. విజ్ఞానం అనేది లోతైనది - అది విశ్లేషణ, ఆలోచన, అర్థం చేసుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సమాచారం, విజ్ఞానం మధ్య తేడాను అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని, ఎందుకంటే ఈ రెండింటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అవగాహన కీలక మని వివరించారు.
తన నిర్ణయాలపై ప్రభావం చూపిన అంశాల గురించి మాట్లాడుతూ, తన ప్రస్తుత బాధ్యతలను చేపట్టే ముందు భారతదేశంలోని 85-90% జిల్లాల్లో విస్తృతంగా పర్యటించినట్టు ఆయన వివరించారు.ఈ అనుభవాలు గ్రామీణ స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.
“నన్ను దిగజార్చే, లేదా ఒక నిర్దిష్ట మార్గంలో నడవాలని ఒత్తిడి చేసే భారాన్ని నేను తలకెత్తుకోను” అని ప్రధాని మోదీ తెలిపారు. ‘దేశమే తొలి ప్రాధాన్యం‘ అనేది తన మార్గదర్శక సూత్రమని స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిరుపేద వ్యక్తి ముఖాన్ని పరిగణనలోకి తీసుకునే మహాత్మాగాంధీ బోధన నుండి తాను ప్రేరణ పొందానని ఆయన తెలిపారు. తన పరిపాలన వ్యవస్థ బలమైన అనుసంధానాన్ని కలిగి ఉందని ఆయన వివరించారు. తనకు ఉన్న అనేక, క్రియాశీల సమాచార మార్గాలు విభిన్న కోణాలను అందిస్తాయని పేర్కొన్నారు. “ఎవరైనా నాకు ఏదైనా వివరించినప్పుడు, అదే నా ఏకైక సమాచార మార్గం కాదు.” అని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యయన దృక్పథాన్ని కొనసాగించడం ఎంత ముఖ్యమో ప్రధాని మోదీ ప్రస్తావించారు. తాను విద్యార్థి మాదిరిగా ప్రశ్నలు వేసేందుకు, అలాగే వివిధ కోణాల నుంచి విశ్లేషించేందుకు డెవిల్స్ అడ్వకేట్ పాత్ర పోషించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో నిర్ణయాలు తీసుకున్న విధానం గురించి చెబుతూ, ఆర్థిక విషయాల్లో అంతర్జాతీయ సిద్ధాంతాలను కచ్చితంగా అనుసరించాలని వచ్చిన ఒత్తిడిని తాను తట్టుకున్నానని తెలిపారు. “నేను పేదలను ఆకలితో పడుకోనివ్వను. ప్రాథమిక అవసరాల కోసం సామాజిక ఉద్రిక్తతలు తలెత్తడాన్ని అనుమతించను” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సహనం, క్రమశిక్షణతో కూడిన తన విధానం తీవ్ర ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడానికి దోహదపడిందని ఆయన ఉద్ఘాటించారు. అపాయాలకు అవకాశం ఉన్న సవాళ్ళను కూడా స్వీకరించే తన సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “నా దేశానికి, ప్రజలకు మేలైనదైతే, దానిని కష్టమైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాను.” అని తెలిపారు. తాను తీసుకునే నిర్ణయాలకు పూర్తిగా తానే బాధ్యత తీసుకుంటానని, “ఏదైనా తప్పు జరిగితే, నేను దానికి పూర్తి బాధ్యత వహిస్తాను తప్ప ఇతరులపై నెట్టివేయను” అని స్పష్టం చేశారు. తన ఈ విధానం స్వీయసంకల్పాన్ని పెంచడంతో పాటు, తన బృందంలో దృఢమైన నిబద్ధతను కలిగించిందని, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించిందని ప్రధాని మోదీ తెలిపారు. “నేను తప్పులు చేయవచ్చు... కానీ ఎప్పుడూ దురుద్దేశంతో వ్యవహరించను.” అని ఆయన స్పష్టం చేశారు. పరిణామాలు ఎప్పుడూ ఆశించిన విధంగా ఉండకపోయినా, తన ఉద్దేశాల్లోని నిజాయితీని సమాజం అంగీకరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏఐని ప్రోత్సహించడంలో భారత్ పాత్రపై ప్రశ్నించగా.. “కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి ప్రధానంగా సమష్టి కృషి. ఏ దేశమూ ఏఐని పూర్తిగా సొంతంగా అభివృద్ధి చేసుకోలేదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. “ఏఐతో ప్రపంచం ఏదైనా చేయవచ్చు గాక.. కానీ భారత్ లేకుంటే అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్దిష్ట సందర్భాల్లో వినియోగం కోసం కృత్రిమ మేధ ఆధారిత అనువర్తనాలపై భారత్ క్రియాశీల కృషిని, ప్రత్యేకమైన మార్కెట్ ఆధారిత నమూనాతో విస్తృత లభ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ప్రాథమికంగా కృత్రిమ మేధకు మూలం మానవ మేధ. అదే దానిని రూపొందించి, మార్గనిర్దేశం చేస్తుంది. ఆ వాస్తవిక మేధ భారత యువతలో పుష్కలంగా ఉంది” అన్న ప్రధానమంత్రి భారత్ లో పెద్దసంఖ్యలో ఉన్న ప్రతిభావంతులే దేశానికి బలమని పేర్కొన్నారు. 5జీ అమలులో భారత వేగవంతమైన పురోగతిని ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. భారత్ ఇందులో అంతర్జాతీయ అంచనాలను మించి ఎదిగిందన్నారు. హాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ సినిమా కన్నా తక్కువ వ్యయంతోనే చంద్రయాన్ వంటి అంతరిక్ష యాత్రలు చేపట్టడం భారత్ సమర్థతకు, సృజనాత్మకతకు నిదర్శనమన్నారు. ఈ విజయాలు భారతీయ ప్రతిభపై ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పెంచుతాయని, దేశ నాగరిక విలువలను ప్రతిబింబిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో భారత మూలాలున్న నాయకుల విజయాన్ని కూడా ప్రస్తావించిన శ్రీ మోదీ.. దేశ సాంస్కృతిక విలువలైన అంకితభావం, నైతికత, సమష్టితత్వం ఇందుకు కారణమన్నారు. ‘‘భారత్ లో పెరిగిన ప్రజలు.. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన వ్యక్తులు, సామాజిక అనుసంధానం విస్తృతంగా ఉన్నవారు సంక్లిష్టమైన పనులను సులభంగా నిర్వహిస్తూ, పెద్ద బృందాలను సమర్థవంతంగా ముందుకు నడపగలరు’’ అని ఆయన పేర్కొన్నారు. భారతీయ నిపుణుల సమస్యా పరిష్కార సామర్థ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచనా విధానం వారిని ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలుపుతాయని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ మానవుడి స్థానాన్ని భర్తీ చేస్తుందేమోనన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. మానవాళి గమనంలో సాంకేతికత ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉందని, మనుషులు దాన్ని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “మనిషి ఆలోచనే ఇంధనం. దాని ఆధారంగానే అనేక అంశాలను ఏఐ సృజించగలదు. కానీ మానవుడి మనస్సులోని అపరిమితమైన సృజనాత్మకతను, ఊహాశక్తిని ఏ సాంకేతిక పరిజ్ఞానమూ ఎప్పటికీ భర్తీ చేయలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. మనిషిగా ఉండేందుకు వాస్తవిక ప్రాతిపదికలేమిటో గుర్తించేలా మానవులను ఏఐ సవాలు చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పరస్పరం బాగోగులు చూసుకోగల సహజమైన మానవ సామర్థ్యాన్ని ఏఐ ప్రదర్శించలేదని స్పష్టం చేశారు.
విద్య, పరీక్షలు, విద్యార్థుల విజయానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. సమాజపు ఆలోచనా విధానం విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతోందనీ.. పాఠశాలల్లో, కుటుంబాల్లో చాలావరకూ ర్యాంకులతోనే విజయాన్ని అంచనా వేస్తున్నారని శ్రీ మోదీ చెప్పారు. ఈ రకమైన ఆలోచనల వల్లే.. మొత్తం తమ జీవితాలకు పది, పన్నెండో తరగతుల పరీక్షలే మూలమని పిల్లలు భావిస్తున్నారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే భారత నూతన విద్యావిధానంలో విశేషమైన మార్పులను ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. పరీక్షా పే చర్చా వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల భారాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘చాలా మంది చదువుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినా, క్రికెట్ లో సెంచరీ కొట్టగలరు. ఎందుకంటే వారి బలం అందులోనే ఉంది’’ అన్న ప్రధానమంత్రి.. పరీక్షలొక్కటే ఓ వ్యక్తి సామర్థ్యానికి ఏకైక కొలమానం కాకూడదని స్పష్టం చేశారు. తాను బడిలో చదువుకున్నప్పటి విశేషాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సృజనాత్మకమైన బోధన పద్ధతులు అభ్యసనాన్ని ఆహ్లాదకరంగా, ప్రభావవంతంగా మార్చాయని తెలిపారు. కొత్త విద్యావిధానంలో ఇలాంటి మెళకువలను పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతి పనినీ అంకితభావంతో, చిత్తశుద్ధితో చేయాలన్న శ్రీ మోదీ.. నైపుణ్యాలు, సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా విజయానికి మార్గం సుగమమవుతుందన్నారు. యువత నిరుత్సాహపడొద్దని ఆయన సూచించారు. “మీకోసమే నిర్దేశించిన, కచ్చితంగా మీరే చేయాల్సిన పనేదో ఒకటి ఉంది. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టిపెట్టండి, అవకాశాలు వస్తాయి” అని పేర్కొన్నారు. ఓ లక్ష్యం కోసం జీవితాన్ని అంకితం చేయడం గొప్ప విషయమన్నారు. అది స్ఫూర్తిని నింపడంతోపాటు జీవితాన్ని అర్థవంతం చేస్తుందన్నారు. ఒత్తిడి, ఇబ్బందుల సమస్యలను ప్రస్తావిస్తూ.. పిల్లలను తమ ప్రతిష్ఠకు చిహ్నంగా భావించొద్దని తల్లిదండ్రులను కోరారు. జీవితమంటే కేవలం పరీక్షలే కాదని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. తగిన విధంగా సన్నద్ధులు కావాలని, తమ సామర్థ్యాలపై నమ్మకముంచాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే క్రమబద్ధమైన సమయపాలన, క్రమం తప్పకుండా సాధన చేయడం అత్యావశ్యకమన్నారు. ప్రతీ వ్యక్తికీ ప్రత్యేకమైన సామర్థ్యాలుంటాయన్న తన నమ్మకాన్ని ఆయన పునరుద్ఘాటించారు. తమపైన, తమ సామర్థ్యాలపైన నమ్మకం ఉంచి, విజయం సాధించాలని విద్యార్థులను కోరారు.
ఈ క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి.. అభ్యసన విధానాన్ని కూడా వివరించారు. “నేనెవరినైనా కలిస్తే, ఆ క్షణంలో పూర్తిగా లీనమవుతాను. ఇలా పూర్తిగా దృష్టి సారించడం వల్ల కొత్త ఆలోచనలను వెంటనే గ్రహించడానికి నాకు అవకాశముంటుంది” అని ఆయన అన్నారు. అందరూ దీనిని అలవరచుకోవాలని కోరారు. ఇది మెదడుకు పదును పెట్టి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ‘‘గొప్ప డ్రైవర్ల జీవిత గాథలు చదివినంత మాత్రాన డ్రైవింగులో మీరు నిపుణులు కాలేరు. మీరు డ్రైవింగ్ సీటులో కూర్చుని రోడ్డు పైకి వెళ్లాల్సిందే’’ అంటూ సాధన చేయడం ఎంత ముఖ్యమైన అంశమో వివరించారు. మరణం ఎన్నటికైనా తప్పదని, జీవితాన్ని ఆస్వాదించడం ముఖ్యమని, ఓ లక్ష్యంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని శ్రీ మోదీ చెప్పారు. అనివార్యమైన మరణం గురించి భయాన్ని వీడాలన్నారు. ‘‘మీ జీవితాన్ని సుసంపన్నమూ సువ్యవస్థితమూ చేసుకోండి. జీవితాన్ని ఉన్నతీకరించుకోండి. దాంతో, మృత్యువు తలుపు తట్టకమునుపే ఓ లక్ష్యంతో జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
నిరాశావాదం, ప్రతికూలతలు తన మనస్తత్వం కాదన్న ప్రధానమంత్రి.. భవిష్యత్తుపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చరిత్ర నిండా సంక్షోభాలను అధిగమించి, మార్పులను అందిపుచ్చుకుని మానవాళి నిలిచిన తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ప్రతీ యుగంలో నిరంతర స్రవంతిగా సాగే మార్పును అందిపుచ్చుకోవడం మానవ స్వభావం” అని ఆయన వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన ఆలోచన విధానాల నుంచి ప్రజలు బయటపడి మార్పును స్వీకరించగలిగితే అసాధారణ పురోగతి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు.
ఆధ్యాత్మికత, ధ్యానం, సర్వ జనుల సంక్షేమంపై మాట్లాడుతూ.. గాయత్రీ మంత్ర ప్రాశస్త్యాన్ని శ్రీ మోదీ వివరించారు. సూర్యుడి ప్రకాశవంతమైన తేజోశక్తికి సంకేతమైన గాయత్రీ మంత్రం ఆధ్యాత్మిక జాగరణకు శక్తిమంతమైన సాధనమని అభివర్ణించారు. అనేక హిందూ మంత్రాలు శాస్త్రయుతంగా, ప్రకృతితో విశేషంగా ముడిపడి ఉన్నాయని, ప్రతిరోజూ వాటిని జపించడం వల్ల దీర్ఘకాలిక, శాశ్వత ప్రయోజనాలను పొందవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ధ్యానం ద్వారా మనో వ్యాకులతలను అధిగమించి, ఈ క్షణాన్ని ఆస్వాదించేలా చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. హిమాలయాల్లో గడిపిన నాటి ఓ అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అక్కడ ఒక రుషి ఓ గిన్నె మీద పడే నీటి బిందువుల లయబద్ధమైన ధ్వనిపై దృష్టి పెట్టడం నేర్పించారు. ఈ అభ్యాసాన్ని ‘దైవిక ప్రతిధ్వని’గా ఆయన అభివర్ణించారు. ఏకాగ్రతను పెంపొందించడానికి, దానిని ధ్యానంగా మలచుకోవడానికి ఇది ఆయనకు సహాయపడింది. హిందూ తత్వశాస్త్రాన్ని వివరిస్తూ.. జీవితంతో ముడిపడి ఉన్న, సర్వ జనుల సంక్షేమాన్ని ఉద్దేశించే మంత్రాలను శ్రీ మోదీ ఉటంకించారు. “కేవలం తమ శ్రేయస్సుపై మాత్రమే హిందువులు ఎప్పుడూ దృష్టి పెట్టరు. అందరి శ్రేయస్సు, సంక్షేమాలను మనం ఆకాంక్షిస్తాం” అన్నారు. ప్రతి హిందూ మంత్రం శాంతి ప్రార్ధనతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. జీవిత సారాన్ని, రుషుల ఆధ్యాత్మిక అభ్యాసాన్ని అది సూచిస్తుందన్నారు. తన భావాలను పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. తనలో చాలాకాలంగా దాచుకున్న ఆలోచనలను పంచుకోవడానికి, అందరితో వ్యక్తీకరించడానికి ఈ సంభాషణ ద్వారా అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు.
***
(Release ID: 2112104)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam