హోం మంత్రిత్వ శాఖ
సైబర్ నేరాల పోర్టల్
Posted On:
12 MAR 2025 4:15PM by PIB Hyderabad
భారత రాజ్యాంగంలోని ఏడో అధికరణ ప్రకారం ‘పోలీసు వ్యవస్థ’, ‘శాంతిభద్రతల నిర్వహణ’ రాష్ట్రాల జాబితాలోని అంశాలు. రాష్ట్రాలు తమ శాంతిభద్రతల పరిరక్షణ వ్యవస్థల (లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు-ఎల్ఈఏ లు) ద్వారా సైబర్ నేరాలు సహా అన్ని రకాల నేరాల నివారణ, గుర్తింపు, పరిశోధన, విచారణలను చేపట్టవలసిన బాధ్యతతో పాటూ పోలీసు స్టేషన్ల సామర్థ్యాన్ని మెరుగుపరచవలసి ఉంటుంది. ఎల్ఈఏల సామర్థ్య పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, మార్గదర్శకాల జారీ వంటి చర్యలతో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు మద్దతుగా నిలుస్తుంది.
సైబర్ నేరాలను సమగ్రంగా అడ్డుకునే వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో కొన్ని:
i. అన్ని రకాల సైబర్ నేరాలను సమగ్రంగా ఎదుర్కొనేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ‘భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని’ (14సి), అదనపు కార్యాలయ హోదాలో ఏర్పాటు చేసింది.
ii. సైబర్ నేరాలు... ముఖ్యంగా మహిళలు, బాలల పట్ల జరిగే నేరాల గురించి ఫిర్యాదు చేసేందుకు అనువుగా 14సి కింద ‘జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్’ (https://cybercrime.gov.in) ను ప్రారంభించారు. పోర్టల్ పై నమోదైన ఫిర్యాదులను సంబంధిత రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల శాంతిభద్రతల పరిరక్షణ వ్యవస్థలు ఎఫ్ఐఆర్ ల కింద పరిగణించి, తదుపరి చర్యలను చట్టాల్లో పేర్కొన్న విధంగా చేపడతాయి. అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ పోర్టల్ ను వినియోగించుకుంటున్నాయి.
iii. 2021లో 14సి కింద ‘పౌరుల ఆర్థిక నేరాల ఫిర్యాదు, నిర్వహణ వ్యవస్థ’ను ప్రారంభించారు. ఈ సదుపాయం వల్ల ఆర్థిక మోసాల బారిన పడ్డవారు తక్షణమే ఫిర్యాదు చేసిన పక్షంలో మోసగాళ్ళ చేతికి డబ్బు చిక్కకుండా అడ్డుకునే వీలు కలుగుతుంది. ఇప్పటివరకూ 13.36 లక్షల ఫిర్యాదుల పరిష్కారం వల్ల రూ.4,386 కోట్ల మేర సొమ్మును కాపాడగలిగారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సహాయం అందించే ‘1930’ టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నంబరును కూడా ఏర్పాటు చేశారు.
iv. 14సి కింద న్యూఢిల్లీలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ‘జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్’ ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విచారణ అధికారులకు పరిశోధన తొలి దశలో సైబర్ ఫోరెన్సిక్ పరమైన సహాయాన్ని అందిస్తుంది. ఇంతవరకూ ఈ ల్యాబ్ 11,835 సైబర్ నేరాల కేసుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిశోధన అధికారులకు సహాయాన్ని అందించింది.
v. 14సి ప్రారంభించిన ‘ఎంఓఓసీ’ వేదిక-‘సై ట్రైన్’, సైబర్ నేర పరిశోధన, ఫోరెన్సిక్స్, నేర విచారణలకు సంబంధించి ముఖ్యమైన అంశాలను ఆన్లైన్ కోర్సుల ద్వారా పోలీసు అధికారులు, న్యాయ అధికారులకు అందించి, వారి సామర్థ్య పెంపుకు దోహదపడుతోంది. ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 1,02,276 మంది పోలీసు అధికారులు పోర్టల్ పై నమోదవగా, 79,904 మందికి సర్టిఫికెట్లను అందజేశారు.
vi. ‘మహిళలు, బాలల విషయంలో సైబర్ నేరాల నివారణ పథకం’ కింద కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సామర్థ్య పెంపు కోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సొమ్మును సైబర్ ఫోరెన్సిక్ శిక్షణ ల్యాబ్ ల ఏర్పాటు, జూనియర్ సైబర్ కన్సల్టెంట్ల నియామకం, ఎల్ఈఏలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయ అధికారుల శిక్షణ నిమిత్తం ఖర్చు చేస్తారు. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటవగా, ఇప్పటివరకూ 24,600 ఎల్ఈఏలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయ అధికారులకు సైబర్ నేరాల గురించిన అవగాహన, పరిశోధన, ఫోరెన్సిక్స్ వంటి అంశాల్లో శిక్షణను అందించారు.
vii. భవిష్యత్తులో ఎదురయ్యే సైబర్ సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకు శాంతిభద్రతల అధికారులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ప్రతివారం ‘పీర్ లెర్నింగ్ సెషన్స్’ పేరిట ఆన్లైన్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరగతుల్లో సైబర్ నేరాల తీరుతెన్నులు, పరిశోధన పద్ధతుల్లో మెళకువలు, నివారణ చర్యలు వంటి అంశాల్లో అవగాహన కలిగిస్తున్నారు. ఇప్పటివరకూ 98 సెషన్లను నిర్వహించారు.
viii. ఎల్ఈఏలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయ అధికారులు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు సహా మొత్తం 3,785 మందికి రెసిడెన్షియల్ పద్ధతిలో (ప్రత్యక్షంగా) శిక్షణను అందించారు.
రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ వివరాలను అందించారు.
***
(Release ID: 2111211)