సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రాచీన భారతీయ జ్ఞాన కేంద్రాల పునరుద్ధరణ
Posted On:
10 MAR 2025 3:20PM by PIB Hyderabad
నలందా, తక్షశిల, విక్రమశిల వంటి ప్రాచీన విద్యాలయాలను ధ్వంసం చేయడానికి విదేశీ ఆక్రమణదారులు ఎన్నెన్నో సార్లు ప్రయత్నాలు చేశారు. ఇన్ని దాడులు జరిగినప్పటికీ అనేక ఉపాయాలను అనుసరించడం ద్వారా జ్ఞానం తనను తాను కాపాడుకోగలిగింది.
1. మౌఖిక, గురు-శిష్య సంప్రదాయం
విద్యాబోధన రంగంలో అనేక పురాతన సంస్థలు జ్ఞాన వ్యాప్తి కోసం మౌఖిక మాధ్యమాన్నే ఎక్కువగా ఆశ్రయించాయి. జ్ఞాన కేంద్రాలను ధ్వంసం చేసినా సరే, పండితులు జ్ఞానాన్ని గురు-శిష్య పరంపర ద్వారా తరువాతి తరానికి అందించారు.
2. పండితుల వలస
నలంద, విక్రమశిల వంటి సంస్థలపై దాడి జరిగిన సమయాల్లో, పండితులు భిన్న ప్రాంతాలకు వలసపోయారు. వారితోపాటే జ్ఞానాన్ని కూడా తీసుకుపోయారు. అనేక మంది దక్షిణ భారతదేశానికి, టిబెట్‌కు, చైనాకు, ఆగ్నేయ ఆసియాకు వలసపోయారు. అలా చేసి వారి బోధన సామర్థ్యాలను స్వయంగా సంరక్షించడంతోపాటు వాటిని విస్తరించారు.
3. ధార్మిక సంస్థలు- మఠాలు
దేవాలయాలతోపాటు బౌద్ధ సంఘారామాలు, హిందూ సన్యాసి మఠాలు ద్వితీయ ప్రాధాన్య జ్ఞాన కేంద్రాల పాత్రను పోషించాయి. సాధువులు, పండితులు వారి పనిని రహస్యంగానో, లేక ఇతరత్రా సురక్షిత స్థలాల్లోనో పూర్తి చేశారు. ఉదాహరణకు, భారత్‌లో బౌద్ధం క్షీణతకు లోనైనప్పుడు భారతీయ మూలగ్రంథాలను, సంప్రదాయాలను టిబెట్‌లోని బౌద్ధ సంఘారామాలు జాగ్రతపరిచాయి.
4. విదేశీ అనువాదాలు, అధికార పత్రాలు
దండెత్తి వచ్చిన వారు గ్రంథాలయాలను దెబ్బతీయగా, హుయాన్ సాంగ్, అల్-బిరూని వంటి విదేశీ యాత్రికులు మన దేశ ప్రాచీన జ్ఞానసారాన్ని గ్రంథస్తం చేశారు. భారతీయ మూల గ్రంథాలనేకం చైనా, అరేబియా, పర్షియా భాషలలోకి అనువాదమై, జ్ఞానం ఇండియా బయటా పరిరక్షణకు నోచుకొంది.
5. తాళపత్రాలు- భూగర్భ గ్రంథాలయాలు
కొంతమంది విద్వాంసులు చేతిరాత పుస్తకాలను మారుమూల ప్రదేశాల్లోనో, భూమి లోపల సురక్షిత స్థానాల్లోనో దాచిపెట్టారు. ఈ కాలంలో సైతం, పురాతన మూల గ్రంథాలు దేవాలయాల్లో గాని, లేదా ప్రభుత్వేతర సేకరణల్లో గాని వెలుగుచూస్తూనే ఉన్నాయి.
6. విద్యాధ్యయనానికి పునర్జీవనం
విధ్వంసకాండ తరువాత సైతం భారత్‌లో విద్యాప్రాప్తి అనేక సార్లు పునరుద్ధరణకు నోచుకొంది. వారణాసి, కాంచీపురం వంటి కొత్త కొత్త జ్ఞానకేంద్రాలు పుట్టుకొచ్చి, మేధోపరమైన సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయాయి.
7. ఇతర సంస్కృతులతో సమైక్యం కావడం
భారతీయ గణితశాస్త్ర, విజ్ఞానశాస్త్ర, తాత్విక జ్ఞానాన్ని ఇస్లామ్, ఐరోపా పండితులు ఆకళింపు చేసుకొన్నారు. ‘సున్న’ పద్ధతి, ఆయుర్వేదం ప్రపంచ నాగరికతలలోకి చొచ్చుకుపోయాయి. దీంతో, సంస్థాగత నాశం చోటుచేసుకొన్నప్పటికీ కూడా ఇవి మాత్రం వాటి అస్తిత్వాన్నీ, ఉనికినీ కోల్పోలేదు.
ఈ తరహాలో, ప్రాచీన జ్ఞాన కేంద్రాలు భౌతిక దాడులకు గురికాగా, వాటి మేధో వారసత్వమూ, సాంస్కృతిక వారసత్వమూ ఈ ఆటుపోటులను తట్టుకొని అనుకూల స్థితులను వెతుక్కొని, రూపాల్ని మార్చుకొని, విస్తృత వ్యాప్తి మాధ్యమంతో నిలదొక్కుకున్నాయి.
భారత ప్రాచీన జ్ఞాన వ్యవస్థలను, కేంద్రాలను పూర్వ స్థితికి తీసుకురాగల అనేక కార్యక్రమాలను ఇందిరా గాంధీ ఆర్ట్స్ నేషనల్ సెంటర్ (ఐజీఎన్‌సీఏ) చేపట్టింది. వాటిలో కొన్ని ఈ కింది విధంగా ఉన్నాయి:
1. వైదిక వారసత్వ పోర్టల్
వైదిక వారసత్వ పోర్టల్‌ను 2023 మార్చి 27న ప్రారంభించారు. ఇది ఐజీఎన్‌సీఏ ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటి. వేదాల సంపన్న వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు వాటి సారాంశాన్ని వ్యాప్తి చేస్తుండడం దీని ఉద్దేశం. ఈ పోర్టల్ 18,000కు పైగా వైదిక మంత్రాలతో సహా 550 గంటలకు పైగా దృశ్య, శ్రవణ సామగ్రిని అందిస్తుంది. దీనిలో వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాల వంటి ప్రాచీన గ్రంథాల నకళ్లు, దృశ్య, శ్రవణ.. రెండు రూపాల్లోనూ వైదిక అనుష్ఠానాల వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం సాంప్రదాయక వైదికజ్ఞానాన్ని పండితులు, అభ్యాసకులు, సాధారణ ప్రజల కోసం సులభతరంగా తీర్చిదిద్ది అందించి, ఈ విధానంలో ఈ జ్ఞానాన్ని పరిరక్షించడంతోపాటు ప్రచారం చేయడంలో సహాయపడుతుంది.
2. భారతీయ జ్ఞాన వ్యవస్థల (ఐకేఎస్) కార్యక్రమం
జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా, విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో భారతీయ జ్ఞాన వ్యవస్థల (ఐకేఎస్) కార్యక్రమానికి ఐజీఎన్‌సీఏ అండదండలను అందిస్తోంది. 2020 అక్టోబరులో ఏర్పాటు చేసిన ఐకేఎస్ విభాగం భారతీయ సాంప్రదాయక జ్ఞానాన్ని ఇప్పటి విద్య వ్యవస్థలో ఓ భాగంగా చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. దీనిలో భాగంగా వైదిక గణితం, ఆయుర్వేదం, యోగా, ప్రాచీన భారతీయ జ్ఞానం వంటి విషయాలను విశ్వవిద్యాలయాల పాఠ్యక్రమంలో చేరుస్తారు. ఐఐటీల వంటి సంస్థలతో సహకారాన్ని ఏర్పరుచుకోవడంతో పాఠ్యక్రమాలను (కోర్సులు), పరిశోధన కార్యక్రమాలను రూపొందించగలిగారు. ఈ పాఠ్యక్రమాలు, పరిశోధన కార్యక్రమాలు భారతీయ సంగీతానికీ, ఇతర స్వదేశీ జ్ఞాన వ్యవస్థలకూ ఉన్న చికిత్సలో సహకరించగల విలువలను అర్థం చేసుకోనిస్తున్నాయి.
3. ప్రాజెక్ట్ ‘మౌసమ్’
ఐజీఎన్‌సీఏ ప్రాజెక్టులలో ఒకటైన ‘మౌసమ్’ బహుళవిషయక కార్యక్రమం. హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల మధ్య ప్రాచీన చారిత్రక, సముద్ర సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పునర్జీవింపచేయడంతోపాటు ఆ సంబంధాలను సుదృఢపరచడం ప్రాజెక్ట్ మౌసమ్ ఉద్దేశం. ఈ మార్గాలలో విస్తరించిన ఉమ్మడి జ్ఞాన వ్యవస్థలకు, ఆలోచనలకు గ్రంథస్తం చేయడంతోపాటు వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా, చాలా కాలం నుంచీ విడిపోయిన బంధాలను మళ్లీ జోడిండంతోపాటు సహకారంలోనూ, ఇచ్చిపుచ్చుకోవడాల్లోనూ కొత్త అవకాశాలను పెంపొందించాలనేది కూడా ఈ ప్రాజెక్టు ఉద్దేశాల్లో ఒకటి.
4. విద్యావిషయక కార్యక్రమాలు, పరిశోధన
ఐజీఎన్‌సీఏ వేర్వేరు విద్యావిషయక పాఠ్యక్రమాలను అందిస్తోంది. వీటిలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు భాగంగా ఉన్నయి. ఇవి మన దేశ కళలు, సంస్కృతి, సాంప్రదాయక జ్ఞాన వ్యవస్థలపై విస్తృత అధ్యయనం చేసేందుకు అవకాశాలను అందిస్తుంది. పరిశోధన, ప్రచురణలు, శిక్షణల మాధ్యమాల ద్వారా ఈ కేంద్రం ప్రాచీన అలవాట్లు, తత్వాలను తెలుసుకొనేందుకూ, వాటిని పునరుద్ధరించేందుకూ అనేక రకాలైన దృష్టికోణాలతో ముందుకు సాగాలని స్పష్టంచేస్తుంది.
ఈ కార్యక్రమాల ద్వారా, ఐజీఎన్‌సీఏ భారత ప్రాచీన జ్ఞాన కేంద్రాలు, వ్యవస్థల పునర్నిర్మాణం, పునరుద్ధరణ, పునస్థాపనలో కీలక పాత్రను పోషిస్తోంది. దీంతోపాటు, వర్తమానంలో వాటి ఉపయుక్తత, నిరంతరత్వం కూడా కొనసాగేటట్లు చూస్తోంది.
భారత్‌లో ప్రాచీన జ్ఞాన వ్యవస్థలపై పరిశోధనకు దన్నుగా నిలవడానికి ఐజీఎన్‌సీఏ అనేక కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో కొన్ని:
1. విభాగం వారీ పరిశోధన కార్యక్రమాలు
ఐజీఎన్‌సీఏ వ్యవస్థాగత స్వరూపంలో భారత సాంస్కృతిక వారసత్వంలోని వివిధ అంశాలపై దృష్టిని సారించే ప్రత్యేక విభాగాలు భాగంగా ఉన్నాయి:
కళానిధి: ఇది మానవ విజ్ఞానశాస్త్రాలతోపాటు కళలపై పరిశోధన, రిఫరెన్స్ సామగ్రిల భాండాగారంలా పనిచేస్తుంది. పరిశోధక విద్యార్థులకు పాఠ్య, దృశ్య, శ్రవణ సంబంధ సమాచారాన్ని అందిస్తుంది.
కళాకోశ: ఇది పరిశోధన, ప్రచురణలలో నిమగ్నమైంది. అనేక విభాగాల్లో మేధో సంప్రదాయాలను అన్వేషిస్తుంది. దీనిద్వారా ప్రాచీన జ్ఞాన వ్యవస్థలను చక్కగా అర్థం చేసుకొనే సామర్థ్యం సిద్ధిస్తుంది.
జానపద సంపద: దీనిని జీవనశైలి అధ్యయనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విభాగం గిరిజన కళలు, జానపద కళలపై ఒక పద్ధతి ప్రకారం పరిశోధనను నిర్వహిస్తుంది. ప్రత్యక్ష ప్రదర్శనలకు వీలు కల్పిస్తుంది.. దీంతో, స్వదేశీ జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని ఇది పెంచుతుందన్నమాట.
కళాదర్శన: పరిశోధనల్లో కనుగొనే విషయాలను ప్రదర్శనలను ఏర్పాటు చేయడం ద్వారా దృశ్య ప్రధాన నమూనాలలోకి మార్చడం, ప్రాచీన జ్ఞానాన్ని ప్రజల వినియోగం కోసం సులభతరంగా మలచడం, మరింత విద్వత్తుతో కూడి ఉండే అన్వేషణను ప్రోత్సహించడం ఈ విభాగం ముఖ్య ఉద్దేశాలు.
కల్చరల్ ఇన్ఫర్మేటిక్స్ ల్యాబొరేటరి: ఈ విభాగం అరుదైన పాత దస్తావేజుల సేకరణలు ప్రధానంగా ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ భాండాగారం అన్నమాట. దీనిలో సాంస్కృతిక పరిరక్షణ కోసం, ప్రచారం కోసం ఉద్దేశించిన సాంకేతిక ఉపకరణాలను వినియోగిస్తుంటారు. ‘కళాసంపద’ను విస్తరింపచేయాలన్నది కూడా దీని ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.
2. ప్రాంతీయ కేంద్రాలు
పరిశోధనను వికేంద్రీకరించడానికీ, ప్రాంతీయ సాంస్కృతిక అధ్యయనాలను ప్రోత్సహించడానికీ ఐజీఎన్‌సీఏ దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో వారణాసి, గౌహతి, బెంగళూరు, రాంచీ, పుదుచ్చేరి, త్రిసూర్, గోవా, వడోదర, శ్రీనగర్ కూడా ఉన్నాయి. ఈ కేంద్రాలు స్థానిక కళారూపాలు, సంప్రదాయాలు, జ్ఞాన వ్యవస్థలపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రాంతాల వారీ నిర్దిష్ట పరిశోధన, పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహిస్తాయి.
3. సహకారపూర్వక పరిశోధన ప్రాజెక్టులు
వివిధ విభాగాల వారీ పరిశోధన ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణకు వివిధ జాతీయసంస్థలతోనూ, అంతర్జాతీయ సంస్థలతోనూ ఐజీఎన్‌సీఏ సహకారాన్ని అందిస్తోంది.
4. ప్రచురణలూ, ప్రసారం
ఈ కేంద్రం ప్రాచీన జ్ఞాన వ్యవస్థలతో సంబంధం కలిగి ఉన్న పరిశోధన నివేదికలనూ, పదకోశాలనూ, నిఘంటువులనూ, విజ్ఞాన సర్వస్వాలనూ ప్రచురిస్తోంది. ఈ ప్రచురణలు ప్రపంచమంతటా పరిశోధక విద్యార్థులకూ, పండితులకూ విలువైన సాయాన్ని సమకూరుస్తున్నాయి. అంతేకాక ఇవి భారతదేశ సంపన్న మేధో సంప్రదాయాలపై ప్రపంచ తార్కిక దృక్పథానికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి.
ఈ తరహా సమగ్ర కార్యక్రమాలను చేపట్టి ఐజీఎన్‌సీఏ ప్రాచీన జ్ఞాన వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించడంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తూ, వాటిని పదిలపరచడంతోపాటు వాటి మనుగడ కొనసాగేటట్లు చూస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్ సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2110232)
Visitor Counter : 12