పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: సముద్ర జీవుల సంరక్షణ
Posted On:
10 MAR 2025 1:24PM by PIB Hyderabad
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విధానపరమైన ఫ్రేమ్ వర్క్ లతో అనుసంధానం చేయడం ద్వారా భారత ప్రభుత్వం సముద్ర జీవుల సంరక్షణ వ్యూహాల అమలు, పర్యవేక్షణను మెరుగుపరుస్తోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, లవణీయత, నీటి నాణ్యత, ప్రవాళ దిబ్బల స్థితిగతులు సహా సముద్ర పరిస్థితుల పర్యవేక్షణ కోసం ఉపగ్రహ చిత్రాలు, దూర గ్రాహక సాంకేతికత, సి-బోట్ వంటి స్వయంప్రతిపత్తి జలాంతర్గత వాహనాలను ఉపయోగిస్తారు. ప్రవాళభిత్తికలను పరిరక్షించడానికి, వాతావరణ పునరుద్ధరణను మెరుగుపరచడానికి, పర్యావరణ స్థితిగతులను గుర్తించేలా విధాన రూపకల్పనకు, అక్రమ చేపల వేటను గుర్తించడానికి, ప్రవాళ దిబ్బలతోపాటు సముద్ర రక్షిత ప్రాంతాలను పర్యవేక్షించడం కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటుకు ఈ సాంకేతికతలు దోహదపడుతాయి.
భారత్ లో కృత్రిమంగా ప్రవాళ భిత్తికలను ఏర్పాటు చేయడమన్నది సముద్ర పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి, జీవవైవిధ్యాన్ని పెంచడానికి, సుస్థిర పద్ధతుల్లో చేపల వేటను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగం. ఇవి సహజ ఆవాసాల పునరుద్ధరణకు, లేదా వాటిని మెరుగుపరచడానికి.. ఉత్పాదకతను పెంచడంతోపాటు ఆవాసాలను మెరుగుపరచడం సహా జల వనరుల నిర్వహణ కోసం చేసిన సాంకేతికపరమైన ఆవిష్కరణలు. ప్రవాళాల పునరుద్ధరణ, పునఃస్థాపనలో ఇండియన్ జూలాజికల్ సర్వే (జెడ్ఎస్ఐ) ప్రధాన పాత్ర పోషిస్తుంది.
జెడ్ఎస్ఐ నేతృత్వంలో చేపట్టిన దేశంలోని అతిపెద్ద ప్రవాళభిత్తికల తరలింపు ప్రాజెక్టులో భాగంగా 16,522 ప్రవాళాలను ఇంటర్ టైడల్, సబ్ టైడల్ జోన్ల నుంచి గుజరాత్ లోని నర్మదా చుట్టుపక్కల అనువైన ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా, సముద్ర జీవ వైవిధ్యాన్ని దీర్ఘకాలం పరిరక్షించడానికి 2,000 ప్రవాళ సిమెంట్ ఫ్రేములను (కృత్రిమ దిబ్బలు) వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. జలచరాల పునరుద్ధరణను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై) కింద రూ .176.81 కోట్ల పెట్టుబడితో 11 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మత్స్య శాఖ 937 కృత్రిమ ప్రవాళ యూనిట్లను మంజూరు చేసింది.
గ్లోలిటర్ భాగస్వామ్య కార్యక్రమంలో ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంవో) చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ భాగస్వామ్యంతో అమలు చేస్తోంది. షిప్పింగ్, చేపల వేటల నుంచి జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలను పరిష్కరించడం కోసం భాగస్వామ్య దేశాలకు చేయూతనిస్తుంది. భారత్ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, సముద్ర ఆధారిత వనరుల నుంచి సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాలపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.
భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కోయిస్) ఉపగ్రహ సమాచారాన్ని ఉపయోగించి ప్రవాళ భిత్తికలు రంగులు కోల్పోయే అవకాశాలపై ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికలు వాటిని పరిరక్షించడానికి, వాతావరణ పునరుద్ధరణ చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడతాయి. ప్రవాళ భిత్తికల విరంజన హెచ్చరిక వ్యవస్థ (సీబీఏఎస్) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఆధారంగా ప్రవాళ వాతావరణంలోని మొత్తం ఉష్ణ తీవ్రతను అంచనా వేస్తుంది. సీబీఏఎస్ నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రతీ మూడు రోజులకొకసారి ప్రచురిస్తారు. హాట్ స్పాట్ ల సమాచారం, వారంలో ఉష్ణోగ్రతలు, కాలానుగుణ ఫలితాలు ఇందులో ఉంటాయి.
భారతీయ జలాల్లోని దృఢమైన ప్రవాళ జాతులపై బ్లీచింగ్ చూపే ప్రభావ తీవ్రతను ఇండియన్ జూలాజికల్ సర్వే (జెడ్ఎస్ఐ) అధ్యయనం చేసింది. అధునాతన వాతావరణ నమూనా పద్ధతులను ఉపయోగించి.. ప్రభావవంతమైన సంరక్షణ వ్యూహాల అభివృద్ధి, కాలానుగుణ చర్యలకు సంబంధించి జెడ్ఎస్ఐ విలువైన సూచనలు చేస్తుంది.
వివిధ జాతుల కూర్పు, సముద్ర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు అందులోని జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేసే తీరు సహా చేపలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయన్న విషయమై కీలకమైన సమాచారాన్ని ఇండియన్ ఫిషరీస్ సర్వే (ఎఫ్ఎస్ఐ) సేకరిస్తుంది. సముద్ర వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా సహాయపడడంలో, పర్యావరణ హిత పద్ధతుల్లో చేపల వేటపై మార్గనిర్దేశం చేయడంలో మత్స్యకారులకు ఎఫ్ఎస్ఐ దోహదం చేస్తుంది. అంతేకాకుండా వాతావరణ పునరుద్ధరణ చర్యలకు అనుగుణంగా చేపల వేట పద్ధతులు, స్థిరమైన జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల దిశగా తీరప్రాంత ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ఎఫ్ఎస్ఐ నిర్వహిస్తుంది.
సముద్ర విజ్ఞాన శాస్త్రం, సముద్ర జీవశాస్త్రం, మత్స్య, తీర ప్రాంత నిర్వహణ రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సీఎస్ఐఆర్- జాతీయ సముద్రవిజ్ఞాన శాస్త్ర సంస్థ (సీఎస్ఐఆర్-ఎన్ఐవో), జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ (ఎన్ఐవోటీ), భారత సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్), కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) వంటి సంస్థలు అభివృద్ధి చేసిన వాతావరణ పునరుద్ధరణ సాంకేతికతలు, పద్ధతులను సముద్ర జీవుల సంరక్షణ వ్యూహాలలో ఉపయోగిస్తున్నారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కృతి వర్ధన్ సింగ్ పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2109926)
Visitor Counter : 20