యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2028 ఒలింపిక్స్‌ సన్నద్ధత, 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు ప్రధానాంశాలుగా కేంద్ర, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల చర్చా వేదికగా చింతన్ శిబిరం


ప్రతిభ గుర్తింపు, ఖేలో ఇండియా ప్రభావం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కార్పొరేట్ భాగస్వామ్యాలకు తొలిరోజు చర్చల్లో ప్రాధాన్యం

प्रविष्टि तिथि: 07 MAR 2025 5:32PM by PIB Hyderabad

2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌ కోసం భారత్ సన్నాహాలు, 2036 వేసవి ఒలింపిక్స్‌ ఆతిథ్యం గురించి మన దేశ బిడ్‌ బలోపేతం కోసం తెలంగాణలోని కన్హ వనం లో నిర్వహించిన రెండు రోజుల చింతన్ శిబిరానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధిమంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. ఈ శిబిరంలో వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడా మంత్రులు, సీనియర్ క్రీడా నిర్వాహకులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు, ఆయా రంగాల నిపుణులు వారి ఆలోచనలను పంచుకుని ప్రపంచ క్రీడా శక్తి కేంద్రంగా భారత్ ను అభివృద్ధి చేసే ప్రణాళికను రూపొందించారు.

2036 ఒలింపిక్స్‌ను భారత్ నిర్వహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ఈ ఆశయాన్ని సాకారం చేయడంలో రాష్ట్రాల సహకారం అవసరమని డాక్టర్ మాండవీయ వ్యాఖ్యానించారు. “గౌరవ ప్రధానమంత్రి సుపరిపాలనా దార్శనికతతో మార్గనిర్దేశం చేసిన ఒక కార్యక్రమంగా చింతన్ శిబిరాన్ని ఆయన అభివర్ణించారు. ఈ వేదిక మన పరస్పర సహకారానికి, ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే మన కలను ముందుకు తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది” అని ఆయన అన్నారు.

Image



ప్రతిభ గుర్తింపు, శిక్షణా పద్ధతులు, క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడల సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చింతన్ శిబిరంలో చర్చించామన్నారు. జమ్మూకాశ్మీర్, ఒడిశా, హర్యానా, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు తాము అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను పంచుకున్నారు. క్రీడారంగంలో పురోగతిని వేగవంతం చేయడంలో దీని ప్రాముఖ్యతను డాక్టర్ మాండవీయ ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రపంచ క్రీడా శక్తి కేంద్రంగా మారాలనే భారతదేశ దార్శనికతను ప్రధానంగా ప్రస్తావిస్తూ, “2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలంటే క్రీడల పట్ల చక్కటి నిర్మాణాత్మక, సహకారాత్మక విధానం అవసరం. క్రీడలు రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికీ, దేశాన్ని ఒక బలీయమైన క్రీడాశక్తిగా నిలబెట్టడానికి సమష్టి కృషి జరగాల్సి ఉంది.” అని డాక్టర్ మాండవీయ అభిప్రాయపడ్డారు.

యువ అథ్లెట్లను గుర్తించడంలో, వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఖేలో ఇండియా ప్రభావం గురించి ప్రధానంగా చర్చించామని తెలిపారు. 2,800కి పైగా ఖేలో ఇండియా అకాడమీలను ఏర్పాటు చేస్తుండగా, 1,045 ఖేలో ఇండియా కేంద్రాలకు గాను 937 కేంద్రాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. ప్రతిభను గుర్తించడానికి, ఈ రంగంలో వారిని మెరికల్లా తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన ఐడీలతో జాతీయ అథ్లెట్ రిపోజిటరీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.

 

Image



"ప్రతిభను వృథా కానివ్వకుండా, సరైన గుర్తింపు, నిర్వహణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ, జాతీయ క్రీడా సమాఖ్యల సహకారంతో పనిచేయడం ఒలింపిక్ మిషన్‌కు చాలా కీలకం" అని ఆయన వ్యాఖ్యానించారు.

9-14 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ అథ్లెట్లను గుర్తించి, ఒలింపిక్స్ కోసం వారిని సన్నద్ధం చేసేలా దీర్ఘకాలిక శిక్షణ అందించడం ద్వారా అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. ప్రాంతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశ క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఖేలో ఇండియా కింద బీచ్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, స్వదేశీ ఆటలు వంటి కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు.

ఈ చర్చల్లో మరో ముఖ్యాంశంగా క్రీడా నిర్వహణ గురించి చర్చించారు. న్యాయమైన ఎంపిక ప్రక్రియల కోసం, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం, వారి పిల్లలు క్రీడలను జీవనోపాధిగా ఎంచుకునేలా ప్రోత్సహించడం కోసం జాతీయ క్రీడా సమాఖ్యల నిర్వహణలో పారదర్శకతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అథ్లెట్-కేంద్రిత పాలన నమూనా అభివృద్ధి కోసం సంబంధిత వ్యక్తులంతా మరింత సమన్వయంతో పనిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలను గురించి వారు చర్చించారు.

రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ప్రైవేట్ రంగాలకు చెందిన క్రీడా మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా వినియోగించుకునే అంశానికి ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై కూడా చర్చించారు. స్టేడియంలు, అందుబాటులో గల మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా ఉపయోగించుకునే సుస్థిర నమూనా అవసరాన్ని ప్రధానంగా చర్చించారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభను గుర్తించడం, శిక్షణను పెంచడానికి ఇప్పటికే ఉన్న పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా జిల్లా స్థాయి క్రీడా పాఠశాలలను (డీఎల్ఎస్ఎస్) ఏర్పాటు చేయడం గురించి కూడా వారు చర్చించారు.


ఉదయం పద్మభూషణ్ దాజీ నేతృత్వంలో మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతలను పెంపొందించే ధ్యాన సమావేశాన్ని నిర్వహించారు. అలాగే సాయంత్రం, సంప్రదాయ సంగీతం, నృత్యం, కళాత్మక ప్రదర్శనల ద్వారా సుసంపన్నమైన భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ, దేశంలోని భిన్నత్వాన్ని, స్ఫూర్తిని చాటుతూ ఉత్సాహకరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

*****


(रिलीज़ आईडी: 2109263) आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी