మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2025


సాధికారత సాధించిన మహిళలే ప్రపంచాన్ని శక్తిమంతం చేస్తారు

Posted On: 06 MAR 2025 9:39AM by PIB Hyderabad

పరిచయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 న నిర్వహిస్తారు. జాతీయ, భాష, జాతి, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలకు గుర్తింపు దక్కే రోజు ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2025 ఇతివృత్తం: ‘‘మహిళలు, బాలికలందరికీ: హక్కులు, సమానత్వం, సాధికారత’’. ఏ మహిళా వెనకబడిపోకుండా అందరికీ సమాన హక్కులు, అధికారం, అవకాశాలను అందించేలా చర్యలు తీసుకొనేలా ఈ ఏడాది ఇతివృత్తం పిలుపునిస్తుంది. తర్వాతి తరానికి సాధికారత కల్పించడం – ముఖ్యంగా యువతులు, కౌమారదశలోని బాలికలు - శాశ్వత మార్పులను సాధించేలా వారిని శక్తిమంతం చేయడమే ఈ ఇతివృత్తం ప్రధాన లక్ష్యం.

ఈ ఏడాది బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫాం ఫర్ యాక్షన్ 30వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ మహిళా దినోత్సవం కీలకం కానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులకు సంబంధించి విస్తృత ఆమోదం పొందిన ప్రగతిశీల పత్రం. ఇది చట్టపరమైన రక్షణ, సేవలను పొందడం, యువత భాగస్వామ్యం, సామాజిక కట్టుబాట్లలో మార్పులు, మూసధోరణులు, పాతతరం ఆలోచనల నుంచి బయటకు రాలేకపోవడం తదితర అంశాలపై దృష్టి సారిస్తూ మహిళల హక్కుల అజెండాను పునర్నిర్వచిస్తుంది.

వివిధ విధానాలు, పథకాలు, చట్టపరమైన చర్యల ద్వారా భారత్‌లో మహిళా సాధికారతను, స్త్రీ - పురుష సమానత్వం సాధించే దిశగా కేంద్రం ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది. జాతీయ పురోగతిలో సమాన భాగస్వామ్యాన్ని సూచిస్తూ మహిళల అభివృద్ధి నుంచి మహిళా నాయకత్వంలో అభివృద్ధి సాధించే దిశగా దేశం మార్పు సంతరించుకుంటోంది. విద్య, ఆరోగ్యం, డిజిటల్, నాయకత్వ రంగాల్లో అవరోధాలను అధిగమిస్తూ దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో తమ స్ఫూర్తిదాయక జీవితాల గురించి నమో యాప్ ఓపెన్ ఫోరంలో పంచుకోవాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 3న కోరారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు తమ ప్రయాణాన్ని, విజయాలను తెలియజేస్తూ ఇప్పటికే సమర్పించిన గాథలను ఆయన ప్రశంసించారు. వారిని మరింత ప్రోత్సహించేందుకు గాను మార్చి 8న ఎంపిక చేసిన మహిళలకు తన సామాజిక మాధ్యమ ఖాతాను నిర్వహించే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. మహిళల సహకారాన్ని చాటి చెబుతూ మరింతమందికి స్ఫూర్తినిచ్చేలా వారి సాధికారత, పట్టుదల, విజయాల ప్రయాణాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

రాజ్యాంగ, శాసన నియమావళి

పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని నిబంధనల ద్వారా స్త్రీ,పురుష సమానత్వానికి భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అని పద్నాలుగో అధికరణ తెలియజేస్తే, పదిహేనో అధికరణ లింగ ఆధారిత వివక్షను నిషేధించింది. మహిళల గౌరవానికి భంగం కలిగే వ్యాఖ్యలు చేయకుండా ఆర్టికల్ 51(ఎ)(ఈ) అడ్డుకొంటుంది. ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా ఆర్టికల్ 39, 42 జీవనోపాధికి సమాన అవకాశాలు, సమాన వేతనం, ప్రసూతి ప్రయోజనాలు అందిస్తున్నాయి.

భారత్ సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందాలు:

మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (1948)
పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక(ఐసీసీపీఆర్, 1966)
మహిళల విషయంలో అన్ని రకాల వివక్ష నిర్మూలనపై సమావేశం (సీఈడీఏడబ్ల్యూ 1979)
బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫాం ఫర్ యాక్షన్ (1995)
అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సమావేశం (2003)
సుస్థిరమైన అభివృద్ధికి అజెండా ౨౦౩౦

మహిళాభ్యున్నతికి ప్రభుత్వ పథకాలు:

1. విద్య

 



మహిళా సాధికారతను, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బాలికలు నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు సమానావకాశాలు అందించడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. విద్యలో స్త్రీ, పురుష సమానత్వం గణనీయంగా మెరుగైంది. ఇటీవలి కాలంలో ప్రాథమిక పాఠశాలల్లో నమోదయిన బాలుర సంఖ్యను బాలికలు అధిగమించారు.

ఉచిత, నిర్భంద విద్యాహక్కు చట్టం, 2009: పిల్లలందరికీ పాఠశాలల్లో చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.
బేటీ బచావో బేటీ పడావో (బీబీబీపీ): స్త్రీ, పురుష నిష్పత్తిని పెంపొందించడం, బాలికా విద్యను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది.
సమగ్ర శిక్షా అభియాన్: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, బాలికలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు మద్ధతు అందిస్తుంది.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020: లింగ సమానత్వానికి, సార్వత్రిక విద్యకు ప్రాధాన్యమిస్తుంది.
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు: గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యను అందించడం
స్త్రీల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2017-18 నుంచి పురుషుల జీఈఆర్‌ను అధిగమించింది.
ఉన్నత విద్యలో చేరిన మహిళలు: 2.07 కోట్లు (2021-22), ఉన్నత విద్యలో చేరిన వారి మొత్తం సంఖ్య 4.33 కోట్లు. దీనిలో దాదాపు 50 శాతం మహిళలే.
ప్రతి వంద మంది పురుషులకు మహిళా అధ్యాపకుల నిష్పత్తి 2014-15లో 63 నుంచి 2021-22 లో 77కు పెరిగింది.
స్టెమ్ రంగాల్లో మహిళలు: స్టెమ్ రంగంలోఉన్నవారి మొత్తం సంఖ్యంలో 42.57 శాతం (41.9 లక్షలు)



స్టెమ్ కార్యక్రమాలు

విజ్ఞాన జ్యోతి (2020) బాలికల ప్రాతినిధ్యం తక్కువ ఉన్న రంగాల్లో స్టెమ్ విద్యను ప్రోత్సహిస్తుంది.
ఓవర్సీస్ ఫెలోషిప్ పథకం ప్రపంచ పరిశోధనావకాశాల్లో మహిళా శాస్త్రవేత్తలకు మద్దతు ఇస్తుంది.
జాతీయ డిజిటల్ లైబ్రరీ, స్వయం, స్వయం ప్రభ ఆన్‌లైన్లో నేర్చుకొనే అవకాశాన్ని ఇస్తాయి.

10 లక్షలకు పైగా విద్యార్థినులకు లబ్ధి చేకూరేలా స్టెమ్ రంగాల్లో స్కాలర్‌షిప్‌లు
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు:



స్కిల్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన (పీఎంకేవీవై), మహిళా పారిశ్రామిక శిక్షణా సంస్థలు మహిళలకు వృత్తి, సాంకేతిక శిక్షణ ఇస్తున్నాయి.
మహిళా టెక్నాలజీ పార్కులు (డబ్ల్యూటీపీలు) శిక్షణకు, సామర్థ్య నిర్మాణానికి కేంద్రాలుగా పనిచేస్తాయి.
 2. ఆరోగ్యం, పౌష్టికాహారం

మహిళా సంక్షేమాన్ని పెంపొదించేందుకు, లింగ ఆధారిత ఆరోగ్య అసమానతలను తగ్గించేందుకు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం చాలా ముఖ్యం. సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, వైద్య సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అనేక విధానాలను ప్రవేశపెట్టింది.

ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై): గర్భిణిలు, బాలింతలకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. 2025 జనవరి నాటికి 3.81 కోట్ల మంది మహిళలకు రూ. 17,362 కోట్ల నగదును అందించారు.

మెరుగైన ప్రసూతి ఆరోగ్యం:

ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) లక్ష జననాలకు 130 (2014-16) నుంచి 97 (2018-20)కు తగ్గింది.
ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు (యూ5ఎంఆర్) 43 (2015) నుంచి 32 (2020)కు తగ్గింది.
మహిళల ఆయుర్దాయం 71.4 ఏళ్లు (2016-20) కు పెరిగింది. 2031-36 నాటికి 74.7 ఏళ్లకు చేరుతుందని అంచనా.

పోషణ, పారిశుద్ద్యం:

జల్ జీవన్ మిషన్ 15.4 కోట్ల గృహాలకు శుద్ధమైన తాగునీరు అందించింది. ఇది అనారోగ్యాలను తగ్గించింది.
స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 11.8 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. తద్వారా పారిశుద్ధ్యం, పరిశుభ్రత మెరుగయ్యాయి.
పోషణ్ అభియాన్: మాతా, శిశు పోషకాహార కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది.
ఉజ్వల్ యోజన పథకం ద్వారా10.3 కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.

3. ఆర్థిక సాధికారత, సమ్మిళితత్వం

ఆర్థిక వృద్ధిని సాధించేందుకు శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కీలకం. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, పారిశ్రామిక, ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలను ప్రారంభించింది.

ఇంటికి సంబంధించిన ప్రధాన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం: 84 శాతం (2015) నుంచి 88.7 శాతానికి (2020) పెరిగింది.

 



ఆర్థిక సమ్మిళితత్వం

పీఎం జన్‌ధన్ యోజన: 30.46 కోట్లకు పైగా ఖాతాలు (55 శాతం మహిళలవి) తెరిచారు.
స్టాండప్ ఇండియా పథకం: రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు మంజూరు చేసిన రుణాల్లో 84 శాతం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకే అందించారు.
ముద్ర పథకం: సూక్ష్మరుణాల్లో 69శాతం మహిళలకే మంజూరయ్యాయి.
ఎన్‌ఎల్‌ఆర్ఎంలో భాగంగా స్వయం సహాయక బృందాలు: 10కోట్లు (100 మిలియన్లు) మంది మహిళలు 9 మిలియన్ల స్వయం సహాయక బృందాలకు అనుసంధానమయ్యారు.
బ్యాంకు సఖీల విధానం: 2020లో 40 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను 6,094 మంది మహిళా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు నిర్వహించారు.

 ఉద్యోగం, నాయకత్వం:

సాయుధ బలగాల్లో మహిళలు: ఎన్డీయే, రక్షణ విభాగాలు, సైనిక్ పాఠశాలల్లో ప్రవేశం
పౌరవిమానయానం: భారత్‌లో 15 శాతానికి పైగా మహిళా పైలట్లు ఉన్నారు. ఇది ప్రపంచ సగటు 5శాతం కంటే ఎక్కువ.
వర్కింగ్ విమెన్ హాస్టళ్లు(సఖీ నివాస్): 26,306 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా 523 వసతి గృహాలు.

 అంకుర సంస్థల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు:

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10 శాతం నిధులు మహిళా నేతృత్వంలోని అంకుర సంస్థలకు రిజర్వు చేశారు.

4. డిజిటల్, సాంకేతిక సాధికారత

ఈ డిజిటల్ యుగంలో మహిళల సామాజిక - ఆర్థిక పురోగతికి సాంకేతికత అందుబాటులో ఉండటం, డిజిటల్ అక్షరాస్యత చాలా కీలకం. వివిధ  కార్యక్రమాల ద్వారా మహిళలు డిజిటల్ విప్లవంలో భాగమయ్యేలా ప్రభుత్వం ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది.

డిజిటల్ ఇండియా కార్యక్రమాలు

పీఎంజీ దిశ (ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరతా అభియాన్): 60 మిలియన్ల మంది గ్రామీణ పౌరులకు డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ
 కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీలు): 67,000 మంది మహిళలు డిజిటల్ సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం): డిజిటల్ పరిష్కారాల ద్వారా ఆరోగ్యసేవలు అందించడం
మహిళా సాధికారత కోసం సంకల్ప్ కేంద్రాలు: 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత   ప్రాంతాల్లోని 742 జిల్లాల్లో పనిచేస్తున్నాయి.

ఆర్థిక సాంకేతికత, సమ్మిళితత్వం

·         డిజిటల్ బ్యాంకింగ్, ఆధార్ అనుసంధాన సేవలు మహిళలకు ఆర్థిక భద్రతను కల్పిస్తాయి.

·         ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేసులు ఆన్లైన్ వ్యాపారం చేసేలా మహిళలను ప్రోత్సహిస్తాయి.

5. భద్రత, రక్షణ

మహిళా భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశం. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి, చట్టపరమైన సంస్థాగత మద్ధతు అందించడానికి అనేక శాసన చర్యలు, ప్రత్యేక నిధులు, ఫాస్ట్ ట్రాకు కోర్టులను ఏర్పాటు చేసింది.

కీలకమైన చట్టాలు

క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2018: మహిళలపై నేరాలకు పాల్పడేవారికి విధించే శిక్షలను పెంచారు.
 గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం, 2005.
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, 2013.
పోక్సో చట్టం, 2012 : చిన్నారులపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టాలను బలోపేతం చేశారు.
ముమ్మారు తలాఖ్ నిషేధం (2019): తక్షణమే విడాకులు ఇచ్చే పద్ధతిని నేరంగా పరిగణిస్తారు.
వరకట్న నిషేద చట్టం, 1961: వరకట్న సంబంధిత నేరాలకు శిక్షలు
బాల్య వివాహాల నిషేధ చట్టం2006: బలవంతపు వివాహాల నుంచి మైనర్లను రక్షిస్తుంది.
నిర్భయ నిధి ప్రాజెక్టులు (రూ. 11,298 కోట్లు కేటాయింపు)

వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్సీలు):  802 కేంద్రాలు మిలియన్‌కు పైగా మహిళకు సాయం అందించాయి.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్-112): 38.34 కోట్ల కాల్స్ వచ్చాయి.
ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు(ఎఫ్టీఎస్సీలు): 750 కోర్టులు పనిచేస్తున్నాయి. పోక్సో కేసుల కోసం ప్రత్యేకంగా 408 పనిచేస్తున్నాయి.
సైబర్ క్రైం హెల్ప్ లైన్ (1930), డిజిటల్ భద్రత కోసం సైబర్ ఫోరెన్సిక్ ల్యాబులు
సేఫ్ సిటీ ప్రాజెక్టులు: మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు 8 నగరాల్లో అమలు
పోలీస్ స్టేషన్లలో 14,658 హెల్ప్ డెస్కులు, వాటిలో 13,473 డెస్కులకు మహిళలే సారథ్యం వహిస్తున్నారు.

 సంస్థాగత, శాసన సంస్కరణలు

భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023: సమన్యాయం దిశగా నిబంధనలను బలోపేతం చేస్తుంది.
లైంగిక నేరాలు, మానవ అక్రమ రవాణాలకు కఠిన శిక్షలు
సాక్షుల రక్షణ, సాంకేతిక ఆధారాలను అంగీకరించే దిశగా చర్యలు
సీఏపీఎఫ్ లో మహిళల ప్రాతినిథ్యం: ఎంపిక చేసిన బలగాల్లో 33శాతం రిజర్వేషన్
నారీ అదాలత్: అస్సాం, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో 50 గ్రామ పంచాయతీల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా చేపట్టారు. ఇప్పుడు దాన్ని విస్తరిస్తున్నారు.

ముగింపు

సమగ్ర విధానాలు, లక్ష్యం ఆధారిత పథకాలు, చట్టపరమైన నియమాల ద్వారా మహిళా సాధికారత అశంలో భారత్ గొప్ప పురోగతిని సాధించింది. ఆర్థిక భాగస్వామ్యం నుంచి భద్రత వరకు, డిజిటల్ సమ్మిళితత్వం నుంచి విద్య వరకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకు వస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళలు కీలకపాత్ర పోషించేలా సమ్మిళితమైన, స్త్రీపురుష సమానత్వం సాధించిన సమాజాన్ని నిర్మించేందుకు పునరంకింతమవ్వాలి. విధాన రూపకల్పనలో స్థిరమైన ప్రయత్నాలు, సమాజాన్ని చైతన్య పరచడం, డిజిటల్ సమ్మిళితత్వం దిశగా చేపట్టే నిరంతర ప్రయత్నాలు భవిష్యత్తులో భారత అభివృద్ధి కథను ముందుకు నడిపిస్తాయని తెలియజేస్తున్నాయి.

 

References

Ministry of Women and Child Development

https://www.pmindia.gov.in/en/news_updates/pm-encourages-women-to-share-their-inspiring-life-journeys/

https://www.un.org/en/observances/womens-day/background

https://www.un.org/en/observances/womens-day

https://dashboard.pmjay.gov.in/pmj/#/

https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2069170

Click here to see PDF

 

***


(Release ID: 2108990) Visitor Counter : 90