ఆర్థిక మంత్రిత్వ శాఖ
పని చేస్తున్న కేసీసీ ఖాతాల్లో సొమ్ము రూ.10 లక్షల కోట్లు దాటింది: 7.72 కోట్ల మంది రైతులకు మేలు
* మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీములో భాగంగా రుణ పరిమితి రూ.3 లక్షలుగా ఉండగా,
2025-26 కేంద్ర బడ్జెటులో రూ.5 లక్షలకు పెంచారు
Posted On:
25 FEB 2025 8:01PM by PIB Hyderabad
2014 మార్చి నెలలో రూ.4.26 లక్షల కోట్లుగా ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ఖాతాలు 2024 డిసెంబరుకు రెండింతల కన్నా అధికంగా పెరిగి రూ.10.05 లక్షల కోట్లయింది. ఇది వ్యవసాయానికీ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం రైతులకు అవసరం ఉన్న రుణాల పరిమాణం బాగా పెరిగినట్లు సూచిస్తోంది. ఇది వ్యవసాయ రంగంలో రుణ పరిమాణం విస్తరించడంతోపాటు సంస్థాగతేతర రుణాలపై ఆధారపడే ధోరణి తగ్గుముఖం పట్టిందని కూడా తెలియజేస్తోంది.
కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) అనేది బ్యాంకులు అందించే సేవలలో ఒకటి. విత్తనాలు, ఎరువులు, కీటక నాశక మందులు వంటి వ్యవసాయానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి తక్కువ రేట్లకు రుణం అందించడమే కాకుండా పంట సాగుకూ, దానితో ముడిపడ్డ కార్యకలాపాలకూ కావలసివచ్చే నగదును రైతులకు సకాలంలో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు సమకూర్చుతుంది. పశు పోషణ, పాడి, మత్స్యపాలనల వంటి కార్యకలాపాలతో ముడిపడి ఉండే పెట్టుబడి అవసరాలను తీర్చడానికి కూడా ఉపయోగపడేటట్లు ఈ కేసీసీ పథకం పరిధిని 2019లో విస్తరించారు.
కేసీసీ మాధ్యమం ద్వారా రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను 7 శాతం తగ్గింపు వడ్డీ రేటుతో ఇవ్వడానికిగాను మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీము (ఎంఐఎస్ఎస్)లో భాగంగా 1.5 శాతం వడ్డీ రాయితీ రూపంలో ఆర్థిక సహాయాన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. రుణాలను అనుకున్న కాలానికే తిరిగి చెల్లించిన రైతులకు 3 శాతం మేర అదనపు ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్‌సెంటివ్‌ను ఇస్తున్నారు. అంటే ఇది రైతులకు వర్తించే వడ్డీ రేటును చివరకు 4 శాతానికి కుదిస్తారు. రూ.2 లక్షల వరకు రుణాలను పూచీకత్తు అక్కరలేని పద్ధతిలో ఇస్తుంటారు.
ఈ సదుపాయం చిన్న రైతులకు, చాలా చిన్న పొలాన్ని సాగు చేసే సన్నకారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాని తరహా రుణ ప్రాప్తికి బాటపరుస్తుంది.
ఆర్థిక మంత్రి 2025-26 బడ్జెటు ప్రసంగంలో, మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీములో భాగంగా రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది రైతులకు మరింతగా లాభాన్ని చేకూర్చేదే.
కిందటి ఏడాదిలో డిసెంబరు నెలాఖరు నాటికి, క్రియాశీలంగా ఉన్న కేసీసీల మాధ్యమం ద్వారా మొత్తం రూ. 10.05 లక్షల కోట్లను అందించడంతో 7 కోట్ల 72 లక్షల మంది రైతులు ఈ ప్రయోజనాన్ని అందుకొన్నారు.
***
(Release ID: 2106542)
Visitor Counter : 60