రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ తీర రక్షకదళానికి శౌర్య పతకాలు, విశిష్ట సేవ పతకాలు, ప్రతిభాన్విత సేవా పతకాలు రక్షణ మంత్రి చేతుల మీదుగా మొత్తం 32 పతకాల ప్రదానం
బలవత్తరమైన, విశ్వసనీయమైన, ప్రపంచంలో అత్యంత సమర్థ సముద్ర దళాల్లో ఒకటిగా ఐసీజీ ఎదిగింది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
* సాధారణ, అసాధారణ ముప్పు విషయంలో సముద్ర బలగాలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ మంత్రి ఉద్బోధ
Posted On:
25 FEB 2025 1:25PM by PIB Hyderabad
భారతీయ తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్.. ‘ఐసీజీ’) 18వ ఇన్వెస్టిచర్ వేడుకని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించగా, కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఐసీజీ సిబ్బందికి శౌర్య పతకాలను, విశిష్ట సేవ పతకాలను, ప్రతిభాన్విత సేవ పతకాలను ప్రదానం చేశారు. మొత్తం 32 పతకాలు.. వాటిలో 6 రాష్ట్రపతి తట్‌రక్షక్ మెడల్స్ (విశిష్ట సేవ), 11 తట్‌రక్షక్ మెడల్స్ (శౌర్యానికి)తోపాటు 15 తట్‌రక్షక్ మెడల్స్ (ప్రతిభావంతమైన సేవకు) కలిసి ఉన్నాయి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఆదర్శనీయ సేవ, పరాక్రమభరిత కార్యాలు, విధినిర్వహణలో అంకితభావాన్ని.. అదీనూ సవాళ్లతో కూడిన, తీవ్ర స్థితిగతుల్లో చాటిన సిబ్బందికి అందజేశారు.
List of Awardees of PTM & TM
(పీటీఎమ్, టీఎమ్ పురస్కారాలు గెలుచుకొన్నవారి జాబితా)
సిబ్బందికి అభినందనలను తెలియజేస్తూ…. ఈ పతకాలు కేవలం మెమెంటోలు కాదనీ, అవి మన త్రివర్ణ పతాకం గౌరవాన్ని కాపాడడానికి ప్రదర్శించే శౌర్యానికీ, దృఢత్వానికీ, అచంచల సంకల్పానికీ ప్రతీకలనీ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. తీరప్రాంతాల్లో భద్రతకు హామీపడడం, సంస్థాగత దక్షత, మాదక ద్రవ్యాల జప్తు, సహాయక కార్యకలాపాలు, అంతర్జాతీయ విన్యాసాల్లో పాలుపంచుకొంటున్న సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు.
ఐసీజీ బలమైన, విశ్వసనీయమైన, ప్రపంచంలోకెల్లా అత్యంత సమర్థ సముద్ర బలగాల్లో ఒకటిగాను వర్ధిల్లుతోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రధానంగా చెప్పారు. ఆయన తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, ‘‘భౌగోళికంగా భారతదేశానికి మూడు పక్కలా సముద్రం ఉంది. తీరప్రాంతం సైతం సువిశాలంగా ఉంది. మన దేశానికి వ్యూహాత్మక భద్రతకు రెండు విధాలైన ముప్పులు పొంచి ఉన్నాయి. మొదటి ముప్పు యుద్ధం. దీనిని సాయుధ దళాలు ఎదుర్కోవలసి వస్తోంది. రెండో ముప్పు సముద్రంలో జరిగే దోపిడీలు. ఉగ్రవాదం, చొరబాట్లు, దొంగరవాణా, చట్టవిరుద్ధంగా జరిగే చేపల వేట. వీటితో సముద్ర బలగాలు, విశేషించి భారతీయ తీర రక్షకదళం (ఐసీజీ) సదా అప్రమత్తంగా ఉంటూ తలపడుతుంటాయి. ఐసీజీ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి క్రియాత్మకంగా పనిచేస్తోంది. వ్యూహాత్మక భద్రతకు అవసరమైన జాగ్రత్తచర్యలను తీసుకోవడంలో ఐసీజీ కీలక పాత్రను పోషిస్తోంది’’ అన్నారు.
గత సంవత్సర కాలంలో, సముద్ర సంబంధ సురక్ష, భద్రతలతోపాటు మానవతదృక్పథంతో చేపట్టే పనులు.. వీటిలో ఐసీజీ చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఈ దళం 14 పడవలతోపాటు 115 సముద్ర దొంగలను పట్టుకొంది. దీనికి అదనంగా దాదాపు రూ.37,000 కోట్ల విలువ చేసే మాదకపదార్థాలను స్వాధీనం చేసుకొంది. ఐసీజీ వివిధ సహాయక కార్యకలాపాల్లో పాల్గొని 169 మంది ప్రాణాలను కాపాడింది. అంతేకాక తీవ్రంగా గాయపడ్డ 29 మందికి వైద్యసహాయాన్ని అందించింది.
ఈ విజయాలు ఒక్క గణాంక సమాచారం మాత్రమే కాదు. ఇవి ఐసీజీ మన దేశ ప్రజల భద్రత విషయంలో చూపుతున్న ధైర్య సాహసాలకు, అంకితభావానికి సంబంధించిన గాధ అని రక్షణ మంత్రి కొనియాడారు. నౌకావాణిజ్యం సాగే సరిహద్దులలో అప్రమత్తంగా ఉంటూ, చట్టవిరుద్ధ చొరబాట్లను అడ్డుకోవడం ఒక్కటే కాకుండా దేశ సార్వభౌమత్వంపైనా, ఆంతరంగిక భద్రత పైనా సానుకూల ప్రభావం కలిగించడంలో కూడా ఐసీజీ తోడ్పడుతోందని ఆయన అన్నారు. అత్యాధునిక సాంకేతిక పురోరగతి కారణంగా సంప్రదాయేతర ముప్పులు తలెత్తుతున్నాయని మంత్రి చెబుతూ, ఒక పక్క నుంచి సంప్రదాయక ముప్పులకు తోడు సైబర్ దాడులు, సమాచార చౌర్యం, సిగ్నళ్లను పనిచేయనివ్వకపోవడం, రాడార్ సేవలను అడ్డగించడం, జీపీఎస్ స్పూఫింగ్ వంటి సవాళ్ల పట్ల సైతం సముద్ర బలగాలు ప్రత్యేకించి ఐసీజీ జాగరూకతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశ భద్రత వ్యవస్థ దృఢంగాను, రక్షణ బలగాలు బలంగాను ఉన్నప్పుడే ‘సురక్షిత, సమృద్ధ భారత్’ దార్శనికతను సాకారం చేసుకోగలుగుతామని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారతీయ తీర రక్షక దళం సామర్థ్యాన్ని పెంపొందింపచేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ తీర రక్షకదళానికి రూ. 9,676.70 కోట్లు కేటాయించారు. ఇది అంతకు ముందటి సంవత్సరం బడ్జెటు కన్నా 26.50 శాతం ఎక్కువ. ఐసీజీని ఆధునీకరించడంలో ఇది ఒక కీలక నిర్ణయం. దీనికి అదనంగా, విధులను అతి వేగంతో నిర్వహించే కాపలా నౌకలు 14, ఎయిర్ కుషన్ వెహికల్స్ 6, ఇంటర్‌సెప్టర్ బోట్లు 22, తీరానికి దూరంగా కావలి కాసే నవ తరం నౌకలు 6, ఇలాంటివే విధులను అతి వేగంతో నిర్వహించే కాపలా నౌకలు 18... వీటినన్నింటినీ కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారని, దీని ఉద్దేశం ఐసీజీని సుదృఢం చేయడమే’’ అనీ ఆయన వివరించారు.
డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఘట్టాన్ని పూర్తి చేయడాన్ని రక్షణ మంత్రి అభినందించారు. సాంకేతికంగా పురోగమన పథంలో పయనించడంపై ఐసీజీ తీసుకొంటున్న శ్రద్ధను కూడా ఆయన మెచ్చుకొన్నారు. ఈ ప్రయత్నాలన్నీ సాధారణ, అసాధారణ ముప్పులకు దీటుగా నిలవడంలో ఐసీజీని పటిష్టపరుస్తాయని ఆయన అంటూ, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీనిచ్చారు.
కార్యక్రమం మొదలవడానికన్నా ముందు, రక్షణ మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇది ఈ సందర్భానికున్న గంభీరత్వానికీ, ప్రాముఖ్యానికీ అద్దం పట్టింది. పురస్కార విజేతలు, వారి కుటుంబ సభ్యులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఇది ఈ కార్యక్రమానికి చక్కని ముగింపును సూచించింది. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణిలతోపాటు ఐసీజీ, రక్షణ మంత్రిత్వ శాఖలతోని ఇతర ఉన్నతాధికారులు, విజేతల కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 2106135)
Visitor Counter : 15