రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైల్వే ఆస్తులను ధ్వంసం చేసే, గూండాయిజానికి పాల్పడే అన్ని కేసుల్లోనూ దుండగులపై కఠిన చర్యలు తీసుకొంటున్న భారతీయ రైల్వేలు


* ఒక యువకుడిని అరెస్టు చేసిన ఆర్‌పీఎఫ్..

* స్వతంత్రతా సేనాని ఎక్స్‌ప్రెస్ ఏసీ రైలుపెట్టెకు మధుబని రైల్వే స్టేషన్లో నష్టం కలగజేసిన ఘటనలో
రైల్వే చట్టం 153 సెక్షన్ సహా వివిధ సెక్షన్లతో ఇతరులపైనా కేసుల దాఖలు..

* రైలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడవేసినందుకు 5 సంవత్సరాల వరకు జైలుశిక్షకూ ఆస్కారం

* రైల్వేలు జాతీయ ఆస్తి, దీనికి నష్టాన్ని కొనితేవడం చట్టవిరుద్ధం;
రైల్వే ఆస్తులకు నష్టపరచొద్దంటూ ప్రయాణికులకు, సాధారణ ప్రజానీకానికి రైల్వే వినతి

Posted On: 20 FEB 2025 7:27PM by PIB Hyderabad

మధుబని రైల్వే స్టేషన్లో ఈ  నెల 10న కొందరు పట్ట పగ్గాల్లేని ప్రయాణికులు స్వతంత్రతా సేనాని ఎక్స్‌ప్రెస్ రైలు (సంఖ్య 12561)కు చెందిన ఏసీ రైలు పెట్టెల గాజు కిటికీల్లో 73 గాజు కిటికీలను దెబ్బతీశారు. ఇది రైలు ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తించి, అస్తవ్యస్తతకు దారితీసింది. మధుబనిలో ఆర్‌పీఎఫ్ (రైల్వే పోలీస్ దళం) పోస్ట్ గాని, లేదా జీఆర్‌పీ (ప్రభుత్వ రైల్వే పోలీసు) పోస్ట్ గాని లేకపోవడంతో దుండగులు పేట్రేగిపోయారు. రైల్వే ఆస్తిని విధ్వంసం చేసిన తరువాత వారు అక్కడ నుంచి పరారయ్యారు.

ఈ దుశ్చర్యపై తూర్పు మధ్య రైల్వే పరిధిలోని ఆర్‌పీఎఫ్ స్పందించింది. దర్భంగా ఆర్‌పీఎఫ్ పోస్ట్‌లో నేరం సంఖ్య 168/2025 ను దృష్టిలో పెట్టుకొని రైల్వే చట్టం లోని సెక్షన్ 145(బి)తోపాటు 146, 153 & 174(ఎ) సెక్షన్ల కింద ఒక కేసును నమోదు చేయడంతోపాటు సత్వర దర్యాప్తును కూడా చేపట్టింది. తప్పు చేసిన వ్యక్తులను గుర్తించి వారికి శిక్షపడేటట్టు చూడడానికి ఆర్‌పీఎఫ్‌లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ప్రత్యేక బృందం విచారణను నిర్వహించి, వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించడంతోపాటు సాంకేతిక రుజువులను కూడా పరిశీలించి ఈ ఘటనలో ఒక యువకుడు భాగం పంచుకొన్నట్టు తేల్చింది. అంతేకాక అతడిని గుర్తించి, అరెస్టు చేశారు. ఘటనతో తన ప్రమేయం ఉందని అతడు ఒప్పుకొన్నాడు. జరిగినదానికి అతడు తన పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇదే తరహా చెడ్డపనులకు ఒడిగట్టిన ఇతర ఘటనల్లో పాల్గొన్న మరికొందరిని పసిగట్టి, వారిని నిర్బంధించేందుకు ఈ కేసులో విచారణను చురుకుగా  కొనసాగిస్తున్నారు. రైల్వే ఆస్తిని ధ్వంసం చేసే, నష్టపరిచే చర్యలకు పాల్పడ్డ దుండగులపై తీవ్ర చర్య తీసుకోవాలని ఆర్‌పీఎఫ్ గట్టి పట్టు పట్టింది.

రైల్వే ఆస్తులు జాతీయ ఆస్తులు. రైల్వే ఆస్తులకు నష్టాన్ని కలగజేసే ఏ చర్య అయినా చట్టవిరుద్ధం. ప్రయాణికులకు సురక్షను కల్పించడానికి, వారి భద్రతకు పూచీపడడానికి, రైల్వే మౌలిక సదుపాయాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, జీఆర్‌పీలతో ఆర్‌పీఎఫ్ సమన్వయాన్ని ఏర్పరచుకొని అవసరమైన ఏర్పాట్లు చేసింది.

అత్యంత నిబద్ధతతో ప్రయాణికులకు భద్రతను కల్పిస్తూనే పైన పేర్కొన్న తరహా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెగబడే వారిపై కఠిన చర్య తీసుకోవాలని కూడా ఆర్‌పీఎఫ్  సంకల్పించింది. జనసామాన్యం భద్రతకు భంగాన్ని కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దిగకుండా ఉండాల్సిందిగా ప్రజాబాహుళ్యానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు రైల్వేల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

రైల్వేలో ప్రయాణించే ఏ వ్యక్తికైనా అపాయాన్ని తలపెట్టిన ఎవరికైనా 5 సంవత్సరాల వరకు జైలు పాల్జేసే శిక్షను విధించడానికి ఆస్కారం ఉందని 1989 నాటి రైల్వే చట్టంలోని 153వ సెక్షన్ చెబుతోందని రైల్వే శాఖ ప్రకటనలో తెలిపారు. రైలు పెట్టెల విధ్వంసానికి పూనుకోవడం గాని లేదా అలాంటి ప్రయత్నాలు చేయడం గాని కూడా దీని పరిధిలోకి వస్తాయి.   రైలుకు గాని లేదా ఇతర రోలింగ్ స్టాక్ (రైలు పెట్టెల)కు గాని నష్టం వాటిల్లజేసే నేరం కూడా 1989 నాటి రైల్వేల చట్టం 174 (ఎ) సెక్షన్‌లో ఓ భాగంగా ఉంది.  ఈ సెక్షన్‌లో ప్రస్తావించిన నేరానికి పాల్పడితే రెండు సంవత్సరాల వరకు ఖైదు, రూ.2,000 వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలను కూడా కలిపి విధిస్తారు.

 

***


(Release ID: 2105212) Visitor Counter : 10