వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశ‌గా భారత్-ఖతార్ ఉమ్మ‌డి వాణిజ్య స‌మావేశం


ఉమ్మడి ఆసక్తులు, పరస్పర గౌరవం ఆధారంగా ఏర్పడిన భారత్ - ఖతార్ మధ్య బలమైన సంబంధాలను ఈ వేదిక ప్రతిబింబిస్తుంది.

ఉమ్మడి భవిష్యత్తు కోసం ఆర్థిక సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, ఇంధన భద్రత, సాంకేతికత, సుస్థిరత ప్రధానాంశాంలుగా సాగిన చర్చలు.

Posted On: 18 FEB 2025 3:20PM by PIB Hyderabad

ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ తనీ భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో 18వ తేదీన న్యూఢిల్లీలో ఇండియా-ఖతార్ సంయుక్త వాణిజ్య స‌మావేశాన్ని (ఇండియా-ఖతార్ జాయింట్ బిజినెస్ ఫోరం) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్  హాజ‌రైన ఈ స‌మావేశంలో... ఖతార్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి షేక్ ఫైజల్ బిన్ తనీ బిస్ పైజల్ అల్ తనీ హాజరై కీలకోపన్యాసం చేశారు.

సంయుక్త వ్యాపార వేదిక ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా 2047నాటికి భారత్ 30-35 అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఇంధన వాణిజ్యంలో భారత్, ఖతార్ మధ్య చారిత్రకంగా సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. హైడ్రోకార్భన్లను దాటి అత్యాధునిక రంగాలైన ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఐఓటీ, సెమీకండక్టర్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పు, పర్యావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో స్వయం సమృద్ధి అంటే ఆత్మనిర్భర భారత్ సాధించడం కీలకమైన అంశంగా మారిందని అన్నారు. రెండు దేశాలకు వాటికంటూ ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉన్నాయి. వీటిని సమర్థంగా వినియోగించుకుంటూ ఆవిష్కరణలు ముందుకు తీసుకెళుతూ, భవిష్యత్తుకు తగినట్టుగా పరిశ్రమలను మలచడంలో భారత్-ఖతార్ ఒకదానికొకటి తోడ్పాటు అందించుకుంటాయని అన్నారు. రెండు దేశాలు గుణాత్మకమైన పురోగతి దిశగా సాగుతున్న తరుణంలో పారిశ్రామికం, సాంకేతికత, సుస్థిరత అనే అంశాలపై ఆధారపడి ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు.

వ్యాపార వ్యయాన్ని తగ్గించి సులభతర వ్యాపార విధానాన్ని పెంపొందించేలా భారత్ చేపట్టిన కీలకమైన సంస్కరణల గురించి శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. తద్వారా విశ్వసనీయత, స్థిరత్వంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ ఒయాసిస్‌గా మారిందని అన్నారు. స్థిరమైన, అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను అన్వేషించాల్సిందిగా ఖతార్‌ను ఆహ్వానించారు. భారత్ విజన్ 2047, ఖతార్ జాతీయ లక్ష్యం 2030 రెండూ కలసి వ్యూహాత్మక ఆర్థిక సహకారంలో నూతన యుగానికి నాంది పలుకుతాయని అన్నారు. పరస్పరం ఆసక్తి ఉన్న రంగాల్లో సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గిఫ్ట్ సిటీ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ)ను సందర్శించాల్సిందిగా ఖతార్ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు.

ఫోరం ప్రారంభ కార్యక్రమంలో ఖతార్ వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి షేక్ ఫైజల్ బిన్ తనీ బిన్ ఫైజల్ అల్ తనీ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం లావాదేవీలకే పరిమితం కాలేదని, పరస్పర గౌరవం, ఉమ్మడి ఆసక్తులు, ఆర్థిక సహకారంలో అంకితభావాలపై నిర్మితమైందని అన్నారు. ఖతార్‌కు మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఎదిగేంతగా రెండు దేశాల మధ్య వాణిజ్య సహకారం విస్తరించిందని తెలిపారు. వైవిధ్యభరితమైన, అభివృద్ధి చెందుతున్న, పెట్టుబడిదారులకు అనుకూలమైన దేశంగా ఖతార్ ఉందని తెలియజేశారు. భారతీయ పెట్టుబడిదారులను ఖతార్ ఆర్థిక, మౌలిక వసతుల రంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాల గురించి తెలుసుకొనేందుకు తమ దేశానికి ఆహ్వానించారు.

భారత ఆర్థికాభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వ్యవస్థల గురించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద వివరించారు. 40,000 సంస్కరణలను అమలు చేయడం ద్వారా గడచిన దశాబ్దంలో 709 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను భారత్ ఆకర్షించిందని వెల్లడించారు. అంతరిక్షం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో 1,55,000 పైగా అంకురసంస్థలతో ఆవిష్కరణల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని అన్నారు.

డిజిటల్ యాక్సెస్, ఆర్థిక సమ్మిళితం, ఇంటర్నెట్‌ను ప్రజలకు చేరువ చేయడంలో ఇండియా స్టాక్ విప్లవాత్మక మార్పులు చేస్తోందని అన్నారు. ఖతార్ జాతీయ బ్యాంకు (క్యూఎన్‌బీ) - నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మధ్య కుదిరిన భాగస్వామ్యం క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించి ఉత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ గురించి సైతం వివరించారు. టెక్, ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని పెంపొందించేలా, త్వరలో భారత్‌లో జరిగనున్న స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఖతార్ ప్రతినిధులను ఆహ్వానించారు.

అంతర్జాతీయంగా మారుతున్న వాణిజ్య రంగాన్ని సరైన దిశలో నడిపించే సామర్థ్యం భారత్, ఖతార్ దేశాలకు ఉందని ఖతార్ వాణిజ్యం, పరిశ్రమలు, విదేశీ వాణిజ్య వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-సయ్యద్ అన్నారు. సంప్రదాయ ఇంధన రంగాన్ని దాటి విద్యుత్ వాహనాలు (ఈవీ), తయారీ, చమురు-సహజవాయువేతర రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సహాయం అందించేందుకు ఖతార్ ఫైనాన్సియల్ సెంటర్ (క్యూఎఫ్‌సీ)ను తమ దేశం ఏర్పాటు చేసిందని తెలియజేశారు. వ్యాపారాలను, ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చేపట్టిన కీలకమైన కార్యక్రమంగా దీన్ని పేర్కొన్నారు. భారత్‌‌తో అత్యంత బలమైన భాగస్వామ్యమున్న దేశాల్లో ఖతార్ ఒకటని, అంతర్జాతీయ మార్కెట్లను చేరుకొనేందుకు అసమానమైన అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. పరిశోధనలకు, అభివృద్ధికి ఖతార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కు పునాదిగా ఉంటుందని అన్నారు. అగ్రశ్రేణి మీడియా సంస్థలను ఆకర్షించడమే లక్ష్యంగా మీడియా సిటీ, కీలకమైన రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఖతార్ ప్రీ జోన్ రూపొందించామని తెలియజేశారు.

డిజిటలైజేషన్లో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. డిజిటల్‌గా రూపాంతరం చెందేందుకు ఖతార్ ప్రతిష్టాత్మక ప్రణాళిక అవలంబిస్తోంది.  ఈ అంశంలో ఖతార్‌కు అవసరమైన స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ అందించగలిగే స్థితిలో ఉంది. దక్షిణాసియాకు ముఖద్వారంగా భారత్ స్థానాన్ని, మధ్యప్రాచ్యానికి కేంద్రంగా ఖతార్ పోషిస్తున్న పాత్రను ఈ చర్చలు తెలియజేస్తున్నాయి. అధిక నాణ్యత గల సోలార్ గ్రిడ్ పాలిసిలికాన్ తయారీలో భారత్, ఖతార్ మధ్య సహకారానికి అధిక ప్రాధాన్యముందని నిపుణులు గుర్తించారు.

సంబంధిత రంగాలలో సహకారానికి, నూతన మార్గాలను అన్వేషించేందుకు వ్యాపార దిగ్గజాలను, విధానరూపకర్తలను, పారిశ్రామిక నిపుణులను ఇండియా-ఖతార్ జాయింట్ బిజినెస్ ఫోరం ఒక్కచోట చేర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ డాలర్లను అధిగమించడంతో, భారత్‌లో పెట్టుబడులు పెరిగాయి. భారత్‌లో జీసీసీ పెట్టుబడిదారుల ర్యాంకుల్లో మూడో స్థానంలో నిలిచింది.  అయినప్పటికీ అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్తాయిలో వినియోగించుకోవాల్సి ఉంది. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఈ కార్యక్రమంలో రెండు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)పై సంతకాలు జరిగాయి:

    భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఖతార్ వ్యాపార సంఘం
    ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్ ఖతార్

ఈ ఒప్పందాలు వ్యాపారంలో సహకారాన్ని సులభతరం చేస్తాయి. పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. ఉమ్మడి ఆసక్తులు ఉన్న రంగాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యానికి భారత-ఖతార్ వ్యాపార ప్రతినిధి బృందం ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని డిపిఐఐటి సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ అన్నారు. 2025 ఏప్రిల్ 3 నుంచి 5 వరకు జరగబోయే స్టార్టప్ ఇండియా మహాకుంభ్ 2025 లో ఖతార్ పాల్గొనడాన్ని ఆయన స్వాగతించారు. ఇది అంకురసంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో ఖతార్ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకమైన కార్యక్రమంగా నిలవనుంది.

ఇంధన భద్రత, వ్యవసాయం, అంకుర సంస్థల రంగం, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాలతో సహా కీలకమైన రంగాల్లో ఆర్థిక సహకారాన్ని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరీ వివరించారు భారత ఇంధన రంగంలో ఖతార్ పోషిస్తున్న కీలక పాత్ర గురించి తెలియజేస్తూ రెండు దేశాలు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు కలిగి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన సంస్థల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేసేందుకు సీఐఐ కట్టుబడి ఉందని తెలియజేశారు.

ఖతార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ షేఖ్ ఖలీఫా బిన్ జస్సీమ్ అల్ తనీ, ఖతారీ వ్యాపారవేత్తల సంఘం బోర్డు సభ్యుడు షేక్ హమద్ బిన్ ఫైజల్ అల్ తనీ సైతం ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పెట్టుబడులు, సరకు రవాణా, అధునాతన తయారీ, ఏఐ, ఆవిష్కరణలు, సుస్థిరత తదితర అంశాలపై మూడు ప్యానెల్ చర్చలు జరిగాయి.

వాణిజ్యాన్ని, పెట్టుబడులను, సాంకేతిక సహకారాలను ముందుకు తీసుకెళ్లే దిశగా రెండు దేశాల అంకిత భావాన్ని ఇండియా-ఖతార్ బిజినెస్ ఫోరం ప్రతిబింబిస్తుంది. రెండు దేశాలు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో సంక్షేమం, ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి సాధించే మార్గంలో చారిత్రక భాగస్వామ్యానికి నాంది పలికాయి.


 

***


(Release ID: 2104546) Visitor Counter : 25