మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 పరీక్షా పే చర్చ మొదటి ఎపిసోడ్‌లో విద్యార్థులతో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


* 2025 పరీక్షా పే చర్చ 5వ ఎపిసోడ్‌లో పాల్గొన్న సద్గురు

Posted On: 15 FEB 2025 10:10PM by PIB Hyderabad

సరికొత్త రూపంలో మరింత ఆకర్షణీయమైన ఫార్మట్‌లో జరిగిన 2025 పరీక్షా పే చర్చ దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రశంసలను అందుకుంటోంది. సంప్రదాయ టౌన్ హాల్ ఫార్మాట్‌కు భిన్నంగా 2025 ఫిబ్రవరి 10న దిల్లీలో హరితమయమైన సుందర్ నర్సరీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఆకర్షణీయ సంభాషణతో ఈ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభమైంది.

తొలి ఎపిసోడ్‌లో ప్రధాని దేశవ్యాప్తంగా 36 మంది విద్యార్థులతో మమేకమై పలు ఆలోచింపజేసే అంశాల గురించి మాట్లాడారు. పోషికాహారం, సమగ్ర ఆరోగ్యం, ఒత్తిడిని జయించటం, తమను తాము సవాల్ చేసుకోవటం, నాయకత్వ కళ, పుస్తకాల ఆవల-అన్ని విభాగాల్లో  ఎదుగుదల, సానుకూల అంశాలను కనుక్కోవడం, మరెన్నో విలువైన పాఠాలను ఆయన పంచుకున్నారు. విద్యార్థుల విద్యా సంబంధిత సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవటానికి, ఎదుగుదల మనస్తత్వాన్ని పెంపొందించుకునేందుకు, నేర్చుకోవటంలో సమగ్రమైన దృక్పథాన్ని అలవరుచుకునేందుకు ఆచరణాత్మక విషయాలను, సమర్థవంతమైన వ్యూహాలను ఈ సెషన్ అందించింది.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని జరిగేలా చూసుకునేందుకు క్రీడా దిగ్గజాలు, సాంకేతిక నిపుణులు, పోటీ పరీక్షల్లో అగ్ర స్థానాల్లో నిలిచిన వారు, వినోద పరిశ్రమ నిపుణులు, ఆధ్యాత్మిక నాయకులతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ జ్ఞానాన్ని పంచుకోవటంతో పాటు పాఠ్యపుస్తకాల ఆవలి జ్ఞానాన్ని విద్యార్థులకు అందించారు. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. ప్రతి సెషన్ విద్యార్థులను విలువైన పాఠాలు, ఆచరణాత్మక వ్యూహాలతో విద్యా, వ్యక్తిగత సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తూనే ఉంది.

ఈ రోజు ఐదో ఎపిసోడ్‌లో పరీక్ష ఒత్తిడిని ఎదుర్కోవడంలో మాత్రమే కాకుండా వివిధ జీవిత సవాళ్లను అధిగమించడంలో పూర్తి మనస్సుతో పనిచేయటం అనే విషయం ప్రాముఖ్యతను సద్గురు వివరించారు. విద్యార్థుల మధ్య బహిరంగ వాతావరణంలో లోతైన విషయాలను పంచుకుంటూ స్వేచ్ఛగా జరిగిన సంభాషణలో నిమగ్నమయ్యారు. పరీక్ష సంబంధిత ఒత్తిడిని తట్టుకోవటంలో విద్యార్థులకు సహాయపడేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పరీక్షల ఒత్తిడి కారణంగా చాలా మంది పిల్లలు ఒత్తిడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడటం గురించి తాను పరిశీలించిన విషయాలను సద్గురు పంచుకున్నారు. విద్య అనేది కేవలం పరీక్షలకు సంబంధించినది కాదని.. జీవితాన్ని అర్థం చేసుకోవటమే అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలను మార్చుకునేందుకు సిద్ధంగా(డైనమిక్ మోడ్) ఉండాలని.. ప్రాథమిక జ్ఞానాన్ని విద్య అందిస్తుందని, అది జీవితం అనే ఇంటి తలుపులు తెరుస్తుందని వివరించారు.

సామర్థ్యం ప్రాముఖ్యతను సద్గురు ప్రధానంగా చెప్పారు. ప్రతి వ్యక్తిలోనూ ప్రకాశించే,  ఊహించలేని వాటిని సాధించే సామర్థ్యం ఉంటుందని అన్నారు. అయితే వాస్తవంగా ప్రకాశించేందుకు అంకింతభావంతో కృషిచేయాలని సూచించారు.

సరదాగా నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రధానంగా తెలియజేస్తూ.. ఆలోచనలను వాటి ఆచరణాత్మక ఉపయోగానికి మించి పెంపొందించుకోవటం, జీవిత అనుభవాల లోతును అర్థం చేసుకోవడం అనే అంశాల గురించి మాట్లాడారు. దృష్టి సారించేందుకు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయడంపై కొన్ని ఆచరణాత్మక చిట్కాలను కూడా ఆయన పంచుకున్నారు.

సెషన్‌లో భాగంగా విద్యార్థులకు నాద యోగా గురించి సద్గురు చెప్పారు. మూడు ప్రాథమిక శబ్దాలను ప్రదర్శిస్తూ.. ప్రతిరోజూ ఉదయం ఏడు నిమిషాల పాటు సాధన చేయమని సలహా ఇచ్చారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం ఇస్తూ జీవిత సవాళ్లను ఎదుర్కోవటంలో ఉపయోగపడే ఆచరణాత్మక, లోతైన పరిజ్ఞానంతో కూడిన పరిష్కారాలను అందించారు.

ఈ 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చా రెండో ఎపిసోడ్‌లో 2025 ఫిబ్రవరి 12న ప్రఖ్యాత నటి దీపికా పదుకొణె సుమారు 60 మంది విద్యార్థులతో సంభాషించారు. మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడం అనేది ఎలా సాధికారత కలిగిస్తుందో తెలిపిన దీపికా.. తన సొంత  పోరాటాల నుండి నేర్చుకున్న విలువైన పాఠాల గురించి మాట్లాడారు.

టెక్నికల్ గురూజీగా పేరు సంపాదించిన గౌరవ్ చౌదరి.. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ& సీఈఓ రాధికా గుప్తా 2025 ఫిబ్రవరి 13న కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. చాట్ జీపీటీ, ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్స్ ప్రాక్టికల్ అప్లికేషన్లను వారు వివరించారు.

ప్రముఖ పోషకాహార నిపుణులు సోనాలి సబ్హెర్వాల్, రుజుతా దివేకర్, ఫుడ్ ఫార్మర్‌గా పేరొందిన రేవంత్ హిమత్సింగ్కా 2025 ఫిబ్రవరి 14న విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సమయంలో ఆరోగ్యంగా, ఒత్తిడి లేకుండా ఉండటానికి పోషకాహారం వహించే కీలక పాత్ర గురించి సంభాషించారు.


 

మొదటి ఎపిసోడ్ చూడటానికి లింక్: https://www.youtube.com/watch?v=G5UhdwmEEls

రెండో ఎపిసోడ్ చూడటానికి లింక్ : https://www.youtube.com/watch?v=DrW4c_ttmew

మూడో ఎపిసోడ్ చూడటానికి లింక్: https://www.youtube.com/watch?v=wgMzmDYShXw

నాలుగో ఎపిసోడ్ చూడటానికి లింక్: https://www.youtube.com/watch?v=3CfR4-5v5mk

ఐదో ఎపిసోడ్ చూడటానికి లింక్: https://www.youtube.com/watch?v=3GD_SrxsAx8

 

 

***


(Release ID: 2103905) Visitor Counter : 19