సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాఘ పూర్ణిమ అమృత ఘడియల స్నానాల తర్వాత రాత్రిపూట స్వచ్ఛత డ్రైవ్ నిర్వహణ;


భక్తుల పుణ్య స్నానాల్లో శుభ్రత, పవిత్రతకు ఈ డ్రైవ్ ప్రాధాన్యం;

ఘాట్లు, ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించిన ప్రత్యేక వాహనాల ఏర్పాటు, మురుగునీటి నిర్వహణ కార్యక్రమాలు

Posted On: 13 FEB 2025 7:28PM by PIB Hyderabad

మహాకుంభమేళా 2025‌లో మాఘ పూర్ణిమ అమృత ఘడియల స్నానాల తర్వాత ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికుల బృందం స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది. ఘాట్లు, ఉత్సవాలు జరిగే ప్రదేశాలను రాత్రికి రాత్రే  పూర్వం ఉన్న స్థితికి తీసుకొచ్చారు. బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో 2 కోట్ల మందికి పైగా భక్తులు పుష్పగుచ్ఛాలు, బట్టలు, ప్రసాదం, ఇతర ఘన వ్యర్థాలను వదిలి పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు వెనుదిరగటం మొదలు పెట్టిన వెంటనే అధికార యంత్రాంగం పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరుసటి రోజు ఉదయానికి పవిత్ర నదీ తీరాలు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంది.

సమగ్ర పరిశుభ్రతకు ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం, మురుగునీటి నిర్వహణ(సెస్‌పూల్ ఆపరేషన్) కార్యక్రమం

ఘాట్లు, ఉత్సవాలు జరిగే ప్రాంతాల నుంచి ఘన వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య వాహనాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని అన్ని ప్రజా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకునేందుకు మురుగునీటి నిర్వహణ(సెస్‌పూల్ ఆపరేషన్) కార్యక్రమాన్ని చేపట్టారు. కుంభమేళాలో పరిశుభ్రత విషయంలో ఇంచార్జ్ అధికారి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలు ఘాట్లకు మాత్రమే పరిమితం కాకుండా ఉత్సవాలు జరిగే అన్ని ప్రధాన రహదారులకు కూడా విస్తరించాయని.. వాటిని పూర్తిగా శుభ్రం చేసి, మంచిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టిప్పర్ ట్రక్కులు, కాంపాక్టర్లను ఉపయోగించి చెత్త డబ్బాలు, లైనర్ బ్యాగులను ఖాళీ చేసి కుంభమేళా ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా, చక్కగా ఉండేలా చేశారు.

భక్తులు, స్థానికుల కృతఙ్ఞతలు

అధికార యంత్రాంగం వేగంగా, సమర్థవంతంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమం పట్ల భక్తులు, స్థానికులు అభినందలు తెలిపారు. మహా కుంభమేళా 2025ను ఒక వ్యవస్థీకృత, మచ్చ లేని కార్యక్రమంగా మార్చడంలో తీసుకోవాల్సిన ఎటువంటి చర్యను వదిలిపెట్టడం లేదని అధికారుల నిబద్ధత రుజువు చేసిందని పేర్కొంటూ పలువురు ప్రశంసించారు.

 

***


(Release ID: 2103169) Visitor Counter : 36