సహకార మంత్రిత్వ శాఖ
పీఏసీఎస్‌ల కోసం ఒకే విధమైన సాఫ్ట్‌వేర్
Posted On:
11 FEB 2025 3:21PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం రూ.2,516 కోట్ల వ్యయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ ప్రాజెక్టును చేపట్టింది. అన్ని పీఏసీఎస్‌లను ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) ఆధారితంగా పని చేసే ఉమ్మడి నేషనల్ సాఫ్ట్‌వేర్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్‌టీసీబీలు), జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీలు) ద్వారా నాబార్డుతో కలుపుతున్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి ఉమ్మడి సాఫ్ట్‌వేర్‌ను నాబార్డ్ రూపొందించింది. ఈ ఏడాది జనవరి 27 నాటికి 50,455 పీఏసీఎస్‌లను ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌తో కలిపారు.
పీఏసీఎస్‌ల మోడల్ బై-లాస్‌లో పేర్కొన్న 25 కన్నా ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలకు ఒక సమగ్ర ఈఆర్‌పీ పరిష్కారాన్ని అందించాలన్నదే పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించడంలోని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యకలాపాల్లో స్వల్పకాల రుణాలకు, మధ్యకాలిక రుణాలకు, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఆర్థిక సేవలు, కొనుగోలు కార్యకలాపాలు, ప్రజా పంపిణీ దుకాణాల (పీడీఎస్) కార్యకలాపాలు, వ్యాపార ప్రణాళిక, గోదాములకు సంబంధించిన కార్యకలాపాలు, మర్చంటైజింగ్, అప్పులు తీసుకోవడం, ఆస్తుల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ వంటి విభిన్న మాడ్యూళ్లున్నాయి.
ఇంతవరకు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 67,930 పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ ప్రతిపాదనలకు అనుమతినిచ్చారు. దీనికోసం ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ. 741.34 కోట్లను ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగం పంచుకొనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి వాటి అవసరాలకు అనుగుణంగా ఈఆర్‌పీ సాఫ్ట్ వేర్‌లో మార్పుచేర్పులు చేయించుకొనేందుకు వీలుంటుంది.
ఉమ్మడి అకౌంటింగ్ వ్యవస్థ (సీఏఎస్), మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)ల మాధ్యమాలను ఈఆర్‌పీ ఆధారిత ఉమ్మడి నేషనల్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించుకొంటూ పీఏసీఎస్‌ల పనితీరులో సమర్ధతను పెంచుతుంది. దీనికి తోడు, పీఏసీఎస్‌లలో పాలన, పారదర్శకతలు కూడా మెరుగుపడతాయి. రుణాలను త్వరత్వరగా ఇవ్వడానికీ, లావాదేవీలకయ్యే ఖర్చును తగ్గించడంతోపాటు చెల్లింపుల్లో అసమానతల్ని తగ్గించడానికీ ఇది తోడ్పడుతుంది. రాష్ట్ర సహకార బ్యాంకులతో, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో అకౌంటింగ్ (ఖాతాల తనిఖీ)లో ఇబ్బందులు తొలగుతాయి. ఇది పీఏసీఎస్‌ల పనితీరుపై రైతుల్లో విశ్వసనీయతను పెంచగలుగుతుంది. ఇలా ‘‘సహకార్ సే సమృద్ధి’’ దృష్టికోణాన్ని సాకారం చేయడంలో తోడ్పాటు లభిస్తుంది.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ విషయాల్ని తెలియజేశారు.
(Release ID: 2102774)
Visitor Counter : 28