ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత ఏఐ ఈ శతాబ్దపు మానవీయతను రచిస్తోంది: ప్రధానమంత్రి
ఉమ్మడి విలువలను కాపాడుకునే, సంకటస్థితిని పరిష్కరించి విశ్వాసాన్ని నింపే విధానాలు, ప్రమాణాలను నెలకొల్పే దిశగా సమష్టి అంతర్జాతీయ కృషి అత్యావశ్యకం: ప్రధానమంత్రి
ఆరోగ్యం, విద్య, వ్యవసాయంతోపాటు అనేక అంశాలను మెరుగుపరచడం ద్వారా లక్షలాది జీవితాల్లో ఏఐ మార్పు తేగలదు: ప్రధానమంత్రి
ఏఐ ఆధారిత భవిత దిశగా ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి, నైపుణ్యాల మెరుగుదలపై పెట్టుబడులు రావాలి: ప్రధానమంత్రి
ఏఐ అప్లికేషన్లను మేం ప్రజా శ్రేయస్సు కోసం అభివృద్ధి చేస్తున్నాం: ప్రధానమంత్రి
శ్రేయస్సు కోసం, అందరి కోసం ఏఐ అన్న సంకల్పంతో అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది: ప్రధానమంత్రి
Posted On:
11 FEB 2025 7:21PM by PIB Hyderabad
పారిస్ లో జరిగిన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత వహించారు. వారం పాటు సాగిన సదస్సు ఈనెల 6-7 తేదీల్లో సైన్స్ దినోత్సవాలతో ప్రారంభమైంది. తర్వాతి రెండు రోజులు సాంస్కృతిక వారాంతపు కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నత స్థాయి ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులు, విధాన నిర్ణేతలు, నిపుణులు హాజరయ్యారు.
ఫిబ్రవరి 10న ఎలిసీ ప్యాలెస్ లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందుతో ఈ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల నాయకులు, ప్రధాన ఏఐ కంపెనీల సీఈవోలు, ఇతర విశిష్ట అతిథులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నేటి సదస్సులో సహాధ్యక్షుడిగా ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా భారత ప్రధానమంత్రిని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆహ్వానించారు. మానవీయతా కోడింగ్ ను వేగంగా లిఖిస్తూ.. మన రాజకీయ, ఆర్థిక, భద్రత వ్యవస్థలతోపాటు సమాజ రూపురేఖలను కృత్రిమమేధ మార్చివేస్తోందని, ప్రస్తుతం ఈ ఉషోదయం వాకిట ప్రపంచం నిలిచి ఉందని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ప్రభావం దృష్ట్యా.. మానవ చరిత్రలో సాధించిన ఇతర సాంకేతికతలతో పోలిస్తే ఏఐ భిన్నమైనదన్నారు. ఉమ్మడి విలువలను కాపాడుకునే, సంకట స్థితిని పరిష్కరించి విశ్వాసాన్ని నింపే విధానాలు, ప్రమాణాలను నెలకొల్పే దిశగా అంతర్జాతీయ స్థాయిలో సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. విధానమంటే కేవలం సంకట పరిస్థితులను ఎదుర్కోవడం మాత్రమే కాదని, ఆవిష్కరణలను ప్రోత్సహించి అంతర్జాతీయ శ్రేయస్సు కోసం వాటికి విస్తృత వ్యాప్తి కల్పించాలని అన్నారు. ఈ దిశగా ఏఐని అందరికీ.. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించి, ప్రజా కేంద్రీకృత అప్లికేషన్ల ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా భారత్ - ఫ్రాన్స్ మధ్య విజయవంతమైన సుస్థిర భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ.. ఆధునిక, బాధ్యతాయుతమైన భవిత దిశగా ఉమ్మడి ఆవిష్కరణల కోసం ఇరుదేశాలూ చేతులు కలపడం సహజమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సార్వత్రికమైన, అందుబాటులో ఉండే సాంకేతికత ఆధారంగా 140 కోట్ల మంది ప్రజల కోసం డిజిటల్ ఆధారిత ప్రజా మౌలిక సదుపాయాలను భారత్ విజయవంతంగా నిర్మించిందని ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారత ఏఐ మిషన్ ను గురించి వివరిస్తూ.. వైవిధ్యం దృష్ట్యా ఏఐ కోసం స్వీయ విస్తృత భాషా వైవిధ్య నమూనాను భారత్ రూపొందిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఏఐ ప్రయోజనాలు అందరికీ అందడం కోసం తన అనుభవాలను పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తర్వాత జరగబోయే ఏఐ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడొచ్చు: [Opening Address ; Concluding Address ]
నాయకుల ప్రకటనను ఆమోదించడంతో సదస్సు ముగిసింది. సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించేలా ఏఐ మౌలిక సదుపాయాలను అందరికీ మరింతగా అందుబాటులోకి తేవడం, ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం, ప్రజా ప్రయోజనం కోసం ఏఐ, ఏఐని మరింత సుస్థిరంగా మార్చడం, సురక్షిత - విశ్వసనీయ ఏఐ విధానాలు సహా పలు కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.
***
MJPS/SR
(Release ID: 2102143)
Visitor Counter : 13
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam