సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహాకుంభమేళా 2025: ఈ నెల 25-26న ప్రయాగరాజ్ లో పర్యటించనున్న ప్రముఖ బ్రిటన్ యాత్రా రచయితలు
Posted On:
10 FEB 2025 7:14PM by PIB Hyderabad
ప్రయాగరాజ్ కుంభమేళా వైభవం, దైవికత దేశవ్యాప్తంగా భక్తులను సమ్మోహితులను చేయడంతోపాటు విదేశీ పర్యాటకులు, యాత్రా రచయితల దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ కు చెందిన ప్రముఖ యాత్రా రచయితల బృందం ఈ నెల 25, 26 తేదీల్లో మహా కుంభమేళాను సందర్శించనున్నది. ఇందులో భాగంగా కుంభమేళాను మాత్రమే కాకుండా ఇతర మతపరమైన, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రదేశాలను కూడా ఈ బృందం సందర్శిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లో పర్యాటకానికి అపారమైన అవకాశాలున్నాయని, అయితే విదేశీ పర్యాటకులను ఈ పరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉత్తరప్రదేశ్ పర్యాటక మంత్రి శ్రీ జయవీర్ సింగ్ అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేలా అంతర్జాతీయ స్థాయి రచయితలు, పాత్రికేయులను ఆహ్వానిస్తున్నారు. అంతర్జాతీయ పర్యాటక పటంలో ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని బలంగా చాటడమే లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నంలో బ్రిటీష్ యాత్రా రచయితల సందర్శన ఒక భాగం.
విశిష్టమైన ఈ వేడుకను ఆస్వాదించేలా, మహాకుంభమేళా సందర్భంగా విదేశీ పర్యాటకుల కోసం పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. వసతి సదుపాయాలు, మార్గనిర్దేశక సేవలు, డిజిటల్ సమాచార కేంద్రాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా విదేశీ యాత్రికులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
కుంభమేళాను మాత్రమే కాకుండా ప్రయాగరాజ్ తోపాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాలనూ బ్రిటిష్ రచయితల బృందం సందర్శిస్తుంది. ప్రయాగరాజ్ కోట, ఆనంద భవన్, అక్షయవట, ఆల్ఫ్రెడ్ పార్క్, సంగమ ప్రాంతం వంటి ప్రదేశాల్లో వారు పర్యటిస్తారు. అంతేకాకుండా అయోధ్య, వారణాసి, లక్నో సహా ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిశీలిస్తుంది.
బ్రిటిష్ యాత్రా రచయితల సందర్శన రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా కీలకమైన అంశంగా నిలుస్తుంది. మహా కుంభమేళా వైభవాన్ని ప్రపంచానికి చాటడం మాత్రమే కాకుండా, ఉత్తరప్రదేశ్ ను ప్రధాన అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా నిలపడానికి విదేశీ రచయితల పర్యటన ఎంతగానో దోహదం చేస్తుంది. సుసంపన్నమైన ఉత్తరప్రదేశ్ వారసత్వం, ఆధ్యాత్మిక ప్రదేశాలు, సహజ సౌందర్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంతోపాటు ప్రపంచంలోని అగ్రగామి పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా రాష్ట్రాన్ని నిలపడం ప్రభుత్వ లక్ష్యం.
***
(Release ID: 2101624)