రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్’ సేవలు: త్వరలో దూర ప్రయాణాలు మరింత సౌకర్యవంతం

పొడవైన రూట్ లో ప్రయోగాత్మక రన్ ను పూర్తి చేసుకున్న తొలి ట్రైన్ సెట్ – ఈ ఏడాది చివరికల్లా మరో తొమ్మిది వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్లను అందించనున్న ఐసీఎఫ్

Posted On: 06 FEB 2025 7:03PM by PIB Hyderabad

వేగానికి పెట్టింది పేరైన వందే భారత్ శ్రేణి రైళ్ళ కూటమికి అత్యాధునిక స్లీపర్ ట్రైన్ సెట్ రకాన్ని జోడించడం ద్వారా భారతీయ రైల్వేలు దూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. జనవరి 15న ‘రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్’-ఆర్డీఎస్ఓ చేపట్టిన కఠిన పరీక్షలను తొలి 16-కోచ్ ల స్లీపర్ ట్రైన్ సెట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ముంబై-అహ్మదాబాద్ సెక్షన్లో జరిపిన ప్రయోగాత్మక రన్ లో భాగంగా స్లీపర్ ట్రైన్ సెట్ ఐదు వందల నలభై కిలోమీటర్ల మేర పరుగులు పెట్టింది. దాంతో, ప్రపంచ స్థాయి హై స్పీడ్ స్లీపర్ రైళ్ళ కల త్వరలో నిజమవనుంది. చెన్నై లోని ‘ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ’-ఐసీఎఫ్, గత డిసెంబర్లోనే దేశ తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. తదుపరి పదిహేను రోజుల్లో ఈ రైలును కోటా డివిజన్ కు తరలించి వరసగా మూడు రోజుల పాటు 30-40 కిలోమీటర్ల మేర పరీక్షలు జరిపారు. గత నెల తొలి వారంలో జరిపిన ఈ ప్రయోగాత్మక రన్ లో భాగంగా కొత్త రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని సులభంగా సాధించింది.

 

రైల్వేల ఆధునికీకరణలో ఈ విజయం మైలురాయి వంటిది. కొత్త రైళ్ళు ప్రయాణికులకు సుఖవంతమైన, లగ్జరీ అనుభవాన్ని అందిస్తాయి. వివిధ సౌకర్యాలు, మెరుగైన వేగం, అత్యాధునిక సాంకేతికతల వినియోగం ద్వారా సుదూర రాత్రి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్లు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

 

 

ఉత్పాదన పెంపు: తదుపరి కార్యాచరణ

 

నమూనా రైలు సఫల పరీక్షల అనంతరం, రానున్న ఏప్రిల్ డిసెంబర్ మాసాల మధ్య మరో తొమ్మిది వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్లను నిర్మించాలని రైల్వేలు నిర్ణయించాయి. దూర ప్రయాణాలు చేపట్టే వారికి సమర్థవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించడంలో రైల్వేలు ఇక నూతన ప్రమాణాలను నెలకొల్పనున్నాయి.  

 

24-కోచుల వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్ల నిర్మాణం కోసం గత డిసెంబర్ 17న భారతీయ రైల్వేలు 50 రేక్స్ ల ప్రొపల్షన్ ఎలెక్ట్రిక్స్ భాగాలకు భారీ ఆర్డర్ పెట్టాయి. రెండేళ్ళ కాలంలో పూర్తి కాగలదని భావిస్తున్న ఈ ఆర్డర్ ను రెండు ప్రముఖ కంపెనీలకు అప్పగించారు. వివరాలు:

 

· మెస్సర్స్ మేధ - 33 రేక్స్ కు అవసరమైన ప్రోపల్షన్ వ్యవస్థలను అందిస్తుంది.

 

· మెస్సర్స్ ఆల్స్టోమ్ – 17 రేక్స్ కు అవసరమైన ప్రోపల్షన్ వ్యవస్థలను అందిస్తుంది.

 

24-కోచుల వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్ల పూర్తి నిర్మాణ కార్యకలాపాలు 2026-27 లో ప్రారంభమవుతాయి, తద్వారా ఇవి రైల్వే సాంకేతికతలో దేశ స్వావలంబనను బలోపేతం చేస్తాయి.

 

మరింత వేగం,లగ్జరీలు చిరునామాగా రైలు ప్రయాణాల్లో నూతనోధ్యాయం ప్రారంభం  

 

కొత్త వందే భారత్ రైళ్ళు ఆటోమేటిక్ తలుపులు, సుఖవంతమైన బెర్తులు, వైఫై సౌకర్యం, విమానాన్ని పోలిన అధునాతన డిజైన్ లతో రూపుదిద్దుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మధ్య స్థాయి, తక్కువ దూరాల మధ్య నడుస్తున్న136 వందే భారత్ రైళ్ళలో ప్రయాణిస్తున్న వారు ఇప్పటికే వెనక్కి వాలే సీట్లు సహా పలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను చవి చూస్తున్నారు. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్ళలో మరింత నిశ్శబ్దాన్ని, సురక్షితమైన, ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన సుఖవంతమైన ప్రయాణాన్ని ఆశించవచ్చు. మేకిన్ ఇండియా పథకంలో భాగంగా చేపట్టిన వందే భారత్ స్లీపర్ రైళ్ళ నిర్మాణం, దేశ ఇంజినీరింగ్ సామర్థ్యానికీ, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించాలన్న రైల్వేల నిబద్ధతకు అద్దం పడుతోంది.

 

అత్యాధునిక, సమర్థవంతమైన, అనువైన వ్యవస్థగా నిలవాలన్న రైల్వేల ఆశయానికి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్లు ఉదాహరణగా నిలుస్తాయి. విప్లవాత్మతమైన ఈ ప్రాజెక్టుతో భారతీయ రైల్వేలు ముందంజ వేస్తున్నాయి.

 

రైళ్ళలోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు:

 

· 16 కోచుల రైల్లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్ సేవలు అందుబాటులో ఉంటాయి.

 

· ఒక్కో రైలు 1128 ప్రయాణికుల పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

 

· క్రాష్ బఫర్ లు, డీఫార్మేషన్ ట్యూబులు, అగ్నిని నిలువరించే వ్యవస్థ- ఫైర్ బ్యారియర్ వాల్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంటాయి.

 

· ఆటోమేటిక్ గా తెరిచీ మూసుకునే తలుపులు, మెత్తని కుషన్లు గల బెర్తులు, వైఫై సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

 

దేశ తొలి వందే భారత్ స్లీపర్ రైలుకి పచ్చ జెండా ఊపే ముందు ఆర్డీఎస్ఓ ప్రయోగాత్మక రన్ ను మరోసారి విశ్లేషించి తుది ధ్రువపత్రాన్ని జారీ చేస్తుంది. రైలు అత్యంత వేగ సామర్థ్యాన్ని రైల్వే భద్రతా కమిషనర్ పరిశీలిస్తారు.

 

***


(Release ID: 2100683) Visitor Counter : 49