ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల తాజా సమాచారం
73.90 కోట్ల కన్నా ఎక్కువ ఏబీహెచ్ఏ ఐడీలు సిద్ధం
ఈ పథకం లబ్ధిదారులకు వారి ప్రయోజనాల్ని, వారి హక్కుల్ని వివరించి
వారిని చైతన్య పరచడానికి సమగ్ర మీడియా, సంప్రదింపుల వ్యూహం అమలు
Posted On:
07 FEB 2025 2:00PM by PIB Hyderabad
‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ (ఏబీడీఎమ్)ను దేశంలో ప్రతి ఒక్కరికి దానిలో ప్రాతినిధ్యం లభించేటట్లు చూడాలన్న దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్.. ఏబీహెచ్ఏ)లకు సంబంధించిన సంఖ్యల్ని ఇస్తున్నారు. ఇవి 14 అంకెలతో కూడిన ఒక విశిష్ట ఆరోగ్య గుర్తింపు సంఖ్యలు (యూనీక్ హెల్త్ ఐడెంటిఫయర్). ఇదివరకు వీటిని హెల్త్ ఐడీలుగా పిలుస్తూ వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3 నాటికి మొత్తం 73,90,93,095 ఏబీహెచ్ఏ ఐడీల్ని రూపొందించారు.
దేశవ్యాప్తంగా అర్హత కలిగిన లబ్ధిదారుల్లో ఈ పథకాన్ని గురించి అవగాహనను పెంపొందింపచేయడానికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ వివిధ చర్యల్ని చేపట్టింది. ఈ పథకంలో భాగంగా వారికి లభించే ప్రయోజనాలు, వారు పొందే హక్కులపై వారిలో చైతన్యాన్ని పెంచడానికి ఒక సమగ్ర మీడియా, సంప్రదింపుల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి నిర్వహిస్తున్న ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యకలాపాల్లో- అవుట్‌డోర్ మీడియా, వివిధ రైల్వే స్టేషన్లలో టికెట్లు అమ్మే కౌంటర్ల దగ్గర డిజిటల్ బోర్డులు, ప్రధాన బస్ స్టేషన్లలో, ప్రయాణికుల రైళ్లలో ప్రకటనలు, ఈ పథకాన్ని గురించిన ప్రచారం పథకం పేరు, లోగో, డిజైను వంటివాటితో కూడిన బ్రాండ్ తరహా ప్రచారం కొనసాగింపు, జాతీయ పత్రికల్లో, ప్రాంతీయ పత్రికల్లో ఈ పథకం గురించిన సమాచారాన్ని ఇస్తూ ఉండడం, ప్రకటనల్ని జారీ చేయడం, ఆకాశవాణి మాధ్యమంలో ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం, ఈ పథకంలో ప్రయోజనాలు అందుకొన్న వారు పంచుకొనే అభిప్రాయాల్ని దూర్‌దర్శన్‌లో ప్రసారం చేస్తుండడం, మొబైల్ ఫోన్లలో సంక్షిప్త సందేశ సేవల (ఎస్ఎమ్ఎస్) రూపంలో జనబాహుళ్యానికి ఈ పథకాన్ని గురించి తెలియజేస్తుండడం వంటివి- ప్రధానంగా ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ లోక్‌సభలో ఈ రోజు ఇచ్చిన ఒక రాతపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2100617)
Visitor Counter : 43