సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ 2025: వసంత పంచమి రోజు మూడో అమృత స్నానం.. త్రివేణీ సంగమంలో లక్షల మంది భక్తజనం పవిత్ర స్నానాలు
అమృత స్నానాలు సాఫీగా సాగేలా
మేళా పాలనయంత్రాంగం విస్తృత ఏర్పాట్లు
Posted On:
03 FEB 2025 9:40PM by PIB Hyderabad
మహాకుంభ్‌లో భాగంగా వసంత పంచమి సందర్భంగా మూడో అమృత స్నానం కార్యక్రమం ప్రయాగ్‌రాజ్‌లో విజయవంతంగా ముగిసింది. లక్షల మంది భక్తజనం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభ మేళా ధర్మం, నమ్మకం, భక్తిలకు ప్రతీకగా నిలవడానికి తోడు ఐక్యతకు, సమానత్వానికి, సాంస్కృతిక వైవిధ్యానికి అచ్చమైన నిదర్శనంగా కూడా నిలుస్తోంది.
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NY98r1ZuoS6LQ393UyVQPcGL8sL1xoaT8FEdE0cpqjaalLyOfS1JM_3b-27iGGU-M4CqVNYb5DHQ5DE3K0wZGTiTbJLBk0QqqHhth93noUnOez1AN_qVJAm0uBkv4Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WNKS.jpg)
వసంత పంచమి నాడు సాయంత్రం 6 గంటల కల్లా మొత్తం 2.33 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానం చేశారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తరలివచ్చిన భక్తులు ‘వసుధైవ కుటుంబకమ్’ స్ఫూర్తితో ఒక్కటై పుణ్యస్నానమాచరించే సంప్రదాయాన్ని పాటించారు. సాధువులు, సంతులు, యోగులు, పండితులు, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ దివ్య కార్యక్రమంలో పాలుపంచుకొని, ఇది ఒక నిజమైన సార్వజనిక ఉత్సవమని చాటిచెప్పారు.
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NYlUjOcOHca6bHC2SJx7kUGlnpbyT7llIsSF9eu_wdDuFk-rYS8R2Yaup1XJkzBpXt0nrm7iyXfEaTjsoLxHTiJiHayUOsVEMZz0RSL1bXAfrSSHzvMDJNEQZ7glJ8=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LUQB.jpg)
ఈ శుభప్రదమైన రోజుకు ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు ముందు రోజు రాత్రి నుంచే సంగమ ప్రాంతానికి చేరుకోవడం మొదలుపెట్టారు. కుంభ మేళా పాలనయంత్రాంగం, స్థానిక పాలనయంత్రాంగం, పోలీసు విభాగం, పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, పడవలు నడిపే వారితోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలు తలో చేయి వేసి ఈ చరిత్రాత్మక కార్యక్రమం సురక్షితంగా, సాఫీగా ముగిసేటట్లు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు.
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NbpOmCeYSj46gEfZORQuFBYg9o0FXcDBClgzVsVJ2T5xJgoHtdm0Hm69zA2C_Pzey37ea4xj1Wt0iYZy06TV0Xl54cjvLz3WQCxBneTtgt2REdbwiQkoXHUtdGeiPA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Q1XB.jpg)
వసంత పంచమి రోజు మూడో అమృత స్నానానికి శుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పరచాలన్న లక్ష్యంతో స్వచ్ఛత పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీని కోసం 15,000 మంది పారిశుధ్య కార్మికులు, 2,500 మందికి పైగా గంగా సేవా దూతలు అలసట అనేదే ఎరగకుండా పనిచేశారు. అటు సాధువులకు, ఇటు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేటట్లు అఖాడాలకు చేర్చే మార్గాలలో ప్రత్యేకంగా పరిశుభ్రత చర్యల్ని కూడా చేపట్టారు. మేళా మైదానాల్లో పోగుపడే వ్యర్థపదార్థాలను తక్షణం అక్కడి నుంచి తొలగించి, ఆ పరిసరాలన్నింటా అద్దంలా ఉంచడానికి శీఘ్ర ప్రతిస్పందన బృందాలను కూడా మోహరించారు. నీరు చల్లడం, సంగమ స్థలిని తేటపరచడానికి పడవల సిబ్బంది, స్టీమర్ల సేవలను ఉపయోగించుకున్నారు.
మన దేశ సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతుల్ని పెంపొందింపచేయడంలో కుంభ మేళా విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రసిద్ధి, సాంస్కృతిక ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంటున్నాయి. భారతీయ సంస్కృతన్నా, భారతీయ సంప్రదాయాలన్నా ఎంతో నచ్చిన విదేశీ భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేయడమే కాకుండా భారత్ ధార్మిక, సాంస్కృతిక ఆచారాల విశిష్టతలను గురించి శ్రద్ధాసక్తులతో అడిగి మరీ తెలుసుకొంటున్నారు.
***
(Release ID: 2099437)
Visitor Counter : 22