రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర బడ్జెట్అద్భుతం: : భద్రతపై ప్రత్యేక దృష్టితో రైల్వేకు వరుసగా భారీ కేటాయింపులను కొనసాగిస్తున్నందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్


వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో ప్రజల ప్రయాణ అనుభవంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అందుబాటులోకి రానున్న 200 కొత్త వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ ర్యాపిడ్ రైల్ , 17,500 జనరల్ నాన్ ఏసీ కోచ్ లు

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.6 బిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యంతో ప్రపంచంలోనే రెండో అత్యధిక సరుకు రవాణా రైల్వేగా అవతరించనున్న భారతీయ రైల్వే

Posted On: 01 FEB 2025 6:43PM by PIB Hyderabad

కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపు నేపథ్యంలో, భారతీయ రైల్వే మరింత వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో, దేశం మొత్తం మీద 200 కొత్త వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రాపిడ్ రైళ్లు, 17,500 సాధారణ (నాన్-ఏసీ) కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇది భారత రైల్వే ప్రయాణాన్ని మరింత విస్తృతం, సౌకర్యవంతం, సమర్థవంతం చేస్తుంది. కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని అభివర్ణించిన కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్,  ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2,52,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు స్థూల బడ్జెట్ మద్దతుగా కేటాయించినందుకు ప్రధాన మంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రైళ్లు, ఆధునిక బోగీలు దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ కు మార్గ సూచిక అని కేంద్రమంత్రి అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వే మౌలిక వృద్ధి ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 4.6 లక్షల కోట్లు కేటాయించారని, ముఖ్యంగా భద్రతపై దృష్టి సారిస్తూ, ఈ సంవత్సరానికి రూ. 1.16 లక్షల కోట్లను రైల్వే భద్రత పెంపు కోసం వివిధ ప్రాజెక్టుల ద్వారా ఖర్చు చేయనున్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత శ్రీ అశ్విని వైష్ణవ్  రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్ పెట్టుబడుల ద్వారా ఉపాధిని సృష్టించడమే కాకుండా, తగ్గిన ఆదాయపు పన్ను భారం మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరటను అందిస్తుందని అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే, భారతీయ రైల్వేకు ప్రభుత్వం ఈసారి కూడా రూ. 2,52,000 కోట్లను కేటాయించింది. ఇంకా రైల్వే ఖర్చుల కోసం, ఆధునికీకరణను వేగవంతం చేయడానికి బడ్జెట్‌కు వెలుపలి వనరుల ద్వారా రూ. 10,000 కోట్లు అదనంగా కేటాయించింది. దీంతో, రైల్వే మౌలిక సదుపాయాల కోసం మొత్తం మూలధన వ్యయం (కాపెక్స్)రూ. 2,62,000 కోట్లకు చేరుకుంది. దీని అర్థం ఆస్తులు, సేకరణ, నిర్మాణం, భర్తీపై స్థూల బడ్జెట్ కేటాయింపు (రైల్వే భద్రతా నిధి,రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ తో సహా) నుండి మాత్రమే కాకుండా భారతీయ రైల్వేల సాధారణ ఆదాయాల నుండి కూడా ఖర్చు చేస్తారు. రూ 200 కోట్ల నిర్భయ నిధి కూడా బడ్జెట్లో ఉంది. రైల్వే తన అంతర్గత వనరుల నుంచి అదనంగా రూ.3,000 కోట్లు సమీకరించనుంది.

వ్యూహాత్మక మార్గాల నిర్వహణ నష్టాలకు తిరిగి చెల్లింపుల కోసం 2025-26 బడ్జెట్ అంచనాలో రూ.2739.18 కోట్లు కేటాయించారు. ఇది 2024-25 సవరించిన అంచనాల (2602.81 కోట్లు) కంటే ఎక్కువ. జాతీయ ప్రాజెక్టులకు మార్కెట్ రుణాల చెల్లింపుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.706 కోట్లు కేటాయించారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలో రూ.2,79,000 కోట్లుగా ఉన్న భారతీయ రైల్వేల నికర ఆదాయ వ్యయం ఈ ఏడాది బడ్జెట్ అంచనాలో రూ.3,02,100 కోట్లకు చేరింది. 2013-14లో కేవలం రూ.28,174 కోట్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం స్థూల బడ్జెట్ మద్దతు దాదాపు 9 రెట్లు పెరిగింది.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.6 బిలియన్ టన్నుల సరుకు రవాణాతో భారతీయ రైల్వే రెండో  అత్యధిక సరుకు రవాణా రైల్వేగా అవతరించనుందని కేంద్ర మంత్రి మీడియాకు తెలిపారు. 2047 నాటికి గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 7000 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ను కలిగి ఉండాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సుస్థిరత గురించి మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతీయ రైల్వేలు 100 శాతం విద్యుదీకరణను సాధిస్తాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను బడ్జెట్ లో శిలాజేతర ఇంధన వనరుగా ప్రకటించినందున, భారతీయ రైల్వేలు మన విద్యుదీకరణ ప్రయత్నాలలో ముందంజలో ఉంటాయి.


 

*****


(Release ID: 2098814) Visitor Counter : 45