జాతీయ మానవ హక్కుల కమిషన్
శీతాకాలం నిరాశ్రయుల మరణాలపై నివేదికను సుమోటోగా స్వీకరించిన ఎన్ హెచ్ ఆర్సీ: ఢిల్లీలో 56 రోజుల వ్యవధిలో 474 మంది మృతి
ఢిల్లీలోని గుర్తు తెలియని మృతదేహాల్లో దాదాపు 80 శాతం నిరాశ్రయులవేనన్న నివేదిక
వెచ్చని దుస్తులు, దుప్పట్లు, సరైన ఆశ్రయం కల్పించడం వంటి రక్షణ చర్యలు లోపించడం ఇందుకు కారణాలుగా ప్రస్తావన
వారంలోగా ఈ విషయమై వివరంగా నివేదిక ఇవ్వాలంటూ ఢిల్లీ ముఖ్య కార్యదర్శి, పోలీసు కమిషనర్ కు కమిషన్ నోటీసులు
Posted On:
30 JAN 2025 5:55PM by PIB Hyderabad
నిరాశ్రయుల కోసం పనిచేసే ఎన్జీవో అయిన సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (సీహెచ్ డీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ శీతాకాలం 56 రోజుల వ్యవధిలో ఢిల్లీలో 474 మంది వ్యక్తులు మృత్యువాత పడ్డారన్న మీడియా రిపోర్టులను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సీ) సుమోటోగా స్వీకరించింది. వెచ్చని దుస్తులు, దుప్పట్లు, సరైన ఆశ్రయం వంటి తగిన రక్షణ సదుపాయాలు వారికి అందకపోవడం వల్ల గతేడాది డిసెంబరు 15 నుంచి ఈ నెల 10 వరకు వీరు మరణించినట్టు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఢిల్లీలోని గుర్తుతెలియని మృతదేహాల్లో 80 శాతం నిరాశ్రయులవే అని ఎన్జీవో నివేదిక పేర్కొన్నది.
వార్తా నివేదికలోని అంశాలు నిజమే అయితే, అది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని భావించిన కమిషన్.. ఈ విషయంపై అన్ని వివరాలతో వారంలోగా నివేదిక ఇవ్వాలంటూ ఢిల్లీ ముఖ్య కార్యదర్శి, పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 16న ప్రసారమైన మీడియా నివేదిక ప్రకారం.. దేశ రాజధానిలోని అవసరానికి సరిపడా ఆశ్రయాల సౌకర్యం లేదు. అందుబాటులో ఉన్న వాటిలోనూ వెచ్చదనం, వేడి నీటి వంటి సదుపాయాలు చాలావరకూ లేవు. దాంతో అందులోని వ్యక్తులు తీవ్రమైన చలితో అవస్థలు పడుతున్నారు. వీధుల్లో బతుకీడుస్తున్న వ్యక్తులు శ్వాస సమస్యలు, చర్మ వ్యాధులు, మానసిక ఆరోగ్య క్షీణత సహా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా వెల్లడించిన మీడియా నివేదిక.. ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను కూడా ఉటంకించింది.
***
(Release ID: 2097953)
Visitor Counter : 44