రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఉత్తమ కవాతు బృందాలు, ప్రదర్శనలకు అవార్డులు అందించిన రక్షణ శాఖ సహాయమంత్రి

Posted On: 30 JAN 2025 5:47PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవ పరేడ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కవాతు బృందాలు, ఉత్తమ ప్రదర్శనలకు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ పురస్కారాలు అందించారు. ఢిల్లీలోని రాష్ట్రీయ రంగశాల క్యాంపులో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీడబ్ల్యూడీ ప్రదర్శనకూ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన కళాకారులతో పాటు ట్రాక్టర్ కంపెనీల ప్రతినిధులకు ఆరు జ్ఞాపికలను కూడా శ్రీ సంజయ్ సేథ్ అందించారు.

సేవలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్)/ ఇతర సహాయక బలగాలు, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాల ప్రదర్శనను అంచనా వేయడం కోసం మూడు ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ప్యానెళ్లు ప్రకటించిన ఫలితాలిలా ఉన్నాయి:

·         సేవా విభాగంలో ఉత్తమ కవాతు దళం – జమ్మూ-కాశ్మీర్ రైఫిల్స్ బృందం

·         సీఏపీఎఫ్/ ఇతర సహాయక బలగాల్లో ఉత్తమ కవాతు దళం – ఢిల్లీ పోలీసు

·         మూడు అత్యుత్తమ ప్రదర్శనలు (రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు)

o    మొదటి స్థానం – ఉత్తర ప్రదేశ్ (మహాకుంభ్ 2025 - స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్)

o    రెండో స్థానం- త్రిపుర (నిత్య పూజ: త్రిపురలో 14 దేవతల ఆరాధన - ఖర్చి పూజ)

o    మూడో స్థానం – ఆంధ్రప్రదేశ్ (ఏటికొప్పాక బొమ్మలు – పర్యావరణ హిత చెక్క బొమ్మలు)

·         కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన

o    గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (జనజాతీయ గౌరవ్ వర్ష్)

·         ప్రత్యేక బహుమతి:

o    కేంద్ర ప్రజా పనుల విభాగం (75 ఏళ్ల భారత రాజ్యాంగం)

o    ‘జయతి జయ మమఃభారతం’ నృత్య బృందం

ఇంతేకాకుండా మైగవ్ పోర్టల్ లో ఈ నెల 26 నుంచి 28 వరకు ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించి ‘పాపులర్ కేటగిరీ’ కింద తమకు నచ్చిన ప్రదర్శన, కవాతు బృందానికి ఓటు వేసే అవకాశాన్ని ప్రజలకు కల్పించారు. ఆ ఫలితాలు కింది విధంగా ఉన్నాయి:

·         సేవా విభాగంలో ఉత్తమ కవాతు దళం – సిగ్నల్స్

·         సీఏపీఎఫ్ / ఇతర సహాయక బలగాల్లో ఉత్తమ కవాతు దళం – సీఆర్పీఎఫ్

·         మూడు అత్యుత్తమ ప్రదర్శనలు (రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు)

o    మొదటి స్థానం - గుజరాత్(స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్)

o    రెండో స్థానం– ఉత్తర ప్రదేశ్(మహాకుంభ్ 2025 – స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్)

o    మూడో స్థానం – ఉత్తరాఖండ్ (ఉత్తరాఖండ్: సాంస్కృతిక వారసత్వం, సాహస క్రీడలు)

·         కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన – మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ (మంత్రిత్వ శాఖ సమగ్ర పథకాల ద్వారా మహిళలు, చిన్నారుల బహుముఖీన అభివృద్ధి ప్రస్థానం)

గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రజల భాగస్వామ్యం దేశంపై వారి ప్రేమ, అంకిత భావాలను చాటుతుందన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను రక్షణ శాఖ సహాయమంత్రి తన ప్రసంగంలో గుర్తుచేశారు. అన్ని ప్రదర్శనలూ సృజనాత్మకతను చాటాయని శ్రీ సంజయ్ సేథ్ స్పష్టం చేశారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను పునరుద్ఘాటిస్తూ.. ఇది ఒక వ్యక్తి ద్వారా జరిగేది కాదని, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో భారత్ ను ఒకటిగా నిలపాలన్నది 140 కోట్ల మంది భారతీయుల సంకల్పమని అన్నారు.

సాంస్కృతిక ప్రదర్శనలో 5,000 మంది కళాకారులతో కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు శ్రీ సంజయ్ సేథ్ ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలను ఆ ప్రదర్శన ఆకట్టుకుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు నిర్వహించిన మూడు సాంస్కృతిక ప్రదర్శనలను కూడా రక్షణ శాఖ సహాయ మంత్రి వీక్షించారు.

 

****


(Release ID: 2097951) Visitor Counter : 55