ఆర్థిక మంత్రిత్వ శాఖ
2025 జనవరి 11 నుంచి 26 మధ్య 10,413 కిలోల మేర స్వాధీనం చేసుకున్న మత్తుమందులను,
రూ.2,246 కోట్ల విలువైన ట్యాబ్లెట్లను ధ్వంసం చేసిన సీబీఐసీ
Posted On:
29 JAN 2025 6:53PM by PIB Hyderabad
ఆర్థిక శాఖ ఆధీనంలోని పరోక్ష పన్నులు, సుంకాల కేంద్రీయ మండలి (సీబీఐసీ) బృందాలు 2025 జనవరి 11 నుంచి 26 మధ్య కాలంలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ముగించాయి. ఇందులో భాగంగా 7,844 కిలోగ్రాముల గంజాయిని, 1,724 కిలోల మెథాక్వాలోన్ (మాండ్రాక్స్)ను, 560 కిలోగ్రాముల హషీష్‌ను, చరస్‌ను, 130 కిలోల మెథంఫెటమైన్‌ను, 105 కిలోల కెటమైన్‌ను, 23 కిలోల హెరాయిన్‌ను, 20 కిలోల కొకైన్‌ను, 7 కిలోల ఎండీఎంఏను, 94.16 లక్షల ట్రెమడాల్ హెచ్‌సీఎల్ మాత్రలను, 46,000 అల్ప్రజోలం మత్రలను, వివిధ రకాల ఔషధ ఫార్ములాల 586 సూదిమందులను నాశనం చేశారు.
ధ్వంసం చేసిన నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టన్సెస్ (ఎన్డీపీఎస్) విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.2,246 కోట్లుగా ఉంది. మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని దేశంలో అనేక ప్రాంతాల్లో సురక్షిత, నిరపాయకర పద్ధతుల్లో నిర్వహించారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై యుద్ధానికి దిగాలనీ, అంతేకాకుండా ఈ విషయంలో సీబీఐసీ చేపడుతున్న చర్యలను గురించి ప్రజలలో అవగాహనను పెంపొందింపచేయాలనీ సీబీఐసీ భావిస్తోంది. తాజాగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఈ నిబద్ధతను చాటిచెప్పేదిగా ఉంది. డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అంశంపై న్యూఢిల్లీలో ఈ నెల 11న ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి ప్రారంభించారు. తాజా దాడులు కూడా ఇదే కాలంలో చోటు చేసుకోవడం విశేషం.
(Release ID: 2097611)