ప్రధాన మంత్రి కార్యాలయం
బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమానికి పదేళ్లు.. ప్రస్తావించిన ప్రధానమంత్రి
ఆడ, మగ అనే భేదభావాన్ని దూరం చేయడంలో బేటీ బచావో, బేటీ పఢావో కీలక పాత్ర పోషించింది: ప్రధాని
బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చాయి: ప్రధాని
Posted On:
22 JAN 2025 10:04AM by PIB Hyderabad
‘బేటీ బచావో, బేటీ పఢావో’ (ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి) ఉద్యమానికి నేటితో పది సంవత్సరాలు పూర్తి అయిన సంగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం చెప్పుకోదగ్గ మార్పులకు దారితీసిందని, ప్రజల అండదండలే దీనిని ముందుకు నడిపిస్తున్నాయని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని ప్రధాని అన్నారు. బాలురు, బాలికల విషయంలో పక్షపాత భావనను దూరం చేయడంలో, బాలికలకు సాధికారతను కల్పించడంలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం తోడ్పడిందని ఆయన ప్రధానంగా చెప్పారు. బాల బాలికల నిష్పత్తి తక్కువ స్థాయిల్లో ఉంటూ వస్తున్న జిల్లాల్లో ఈ ఉద్యమం అమలుతో గణనీయ ఫలితాలు వచ్చాయని కూడా శ్రీ మోదీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని చక్కగా కొనసాగించడంలో పాలుపంచుకొంటున్న ఆసక్తిదారులందరినీ ఆయన అభినందించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన కొన్ని పోస్టులు పెడుతూ, వాటిలో ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు మనం బేటీ బచావో, బేటీ పఢావో (#BetiBachaoBetiPadhao) ఉద్యమ పదో వార్షికోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాం. గత పదేళ్లలో, ఈ ఉద్యమం గణనీయ మార్పులకు కారణమైంది, ప్రజలే ఈ ఉద్యమానికి అండదండగా నిలుస్తున్నారు, ఈ ఉద్యమంలో అన్ని రంగాల వారు భాగస్తులయ్యారు.’’
‘‘ఆడపిల్లలు, మగ పిల్లల మధ్య భేద భావనను చూపకుండా ఉండేటట్లు చేయడంలో బేటీ బచావో, బేటీ పఢావో (#BetiBachaoBetiPadhao) తోడ్పడింది. విద్యను బాలికలకు అందుబాటులోకి తీసుకురావడానికి, బాలికలు వారి కలలను నెరవేర్చుకొనేందుకు తగిన పరిస్థితుల్ని కూడా ఇది ఏర్పరిచింది.’’
‘‘ప్రజలతోపాటు వివిధ సమాజ సేవాసంస్థలు అంకితభావంతో కృషి చేయడంతో, బేటీ బచావో, బేటీ పఢావో (#BetiBachaoBetiPadhao) అసాధారణ విజయాలను సాధించింది. బాలబాలికల నిష్పత్తి తక్కువ స్థాయిలలో ఉంటూ వస్తున్న జిల్లాల్లో మంచి ఫలితాలు వచ్చాయి; అవగాహన కలిగించడానికి నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు పురుషులు, మహిళల మధ్య సమానత్వ భావన కనబరచడానికి ప్రాముఖ్యాన్నివ్వాలని చాటిచెప్పడంలో సఫలమయ్యాయి.’’
‘‘ఈ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయిలో చురుకుగా అమలుచేయడానికి సహకరించిన ఆసక్తిదారులు అందరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రండి, మన కుమార్తెల హక్కులను పరిరక్షిస్తూ వారికి చదువుకొనేందుకు అవకాశాలు కల్సిస్తూ, వారు ఎలాంటి భేదభావానికి గురికాకుండా వృద్ధిలోకి వచ్చే తరహా సమాజాన్ని నిర్మిద్దాం. మనమంతా కలిసికట్టుగా రాబోయే కాలంలో భారత్ పుత్రికలు మరింత ఘనమైన ప్రగతిని సాధించడానికి అనువుగా వారు అవకాశాల్ని సమృద్ధిగా అందుకొనే స్థితిని ఆవిష్కరిద్దాం. #BetiBachaoBetiPadhao”
***
(Release ID: 2095100)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam